పెళ్లైన నెలకే గర్భవతి: అనుమానంతో అత్తింటి వేధింపులు, మెడికల్ విద్యార్థిని ఆత్మహత్య
అనంతపురం: అనంతపురంలోని హిందూపురంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ యువతి పెళ్లైన నెల రోజులకే అత్తింటి వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మంచి సంబంధమని కట్నకానుకలతో పెళ్లి..
వివరాల్లోకి వెళితే.. మడకశిరకు చెందిన అర్షియా(26) కోటి ఆశలతో వైద్య విద్య కాలేజీలో విద్యార్థిగా చేరింది. మరో రెండేళ్లలో కోర్సు పూర్తి అవుతుందనుకుంటున్న సమయంలోనే హిందూపురం ఆర్టీసీ కాలనీకి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి నూరుల్లా పెళ్లి సంబంధం వచ్చింది. మంచి సంబంధమని నమ్మిన అర్షియా తల్లిదండ్రులు గత ఏడాది నూరుల్లాకు అర్షియానిచ్చి పెళ్లి చేశారు. ఆ సమయంలో కట్న కానుకల కింద రూ. 5లక్షలు, అరకిలో బంగారం నగలు అందజేశారు.

నెలకే గర్భం.. వేధింపులు తీవ్రం..
అయితే, వైవాహిక జీవితంపై కోటి ఆశలతో అత్తారింటిలో అడుగుపెట్టిన అర్షియాకు అవమానాలే, అనుమానులు ఎదురయ్యాయి. ప్రతి విషయంలోనూ భర్తతోపాటు అత్తింటివారు ఆమెను అనుమానిస్తూ వచ్చారు. నెలదాటకుండానే ఆమె గర్భం దాల్చడంతో ఆమెపై వేధింపులు మరింత పెరిగాయి. అదనపు కట్నం కావాలని, కారు, స్థిరాస్తులు రాయించుకురమ్మంటూ నూరుల్లా వేధింపులకు దిగాడు. కాగా, మంగళవారం అర్షియాకు తల్లిదండ్రులు ఫోన్ చేసి, ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అయితే, అప్పటికే అత్తింటి వేధింపులతో తీవ్రమనస్తాపంతో ఉన్న అర్షియా.. వారితో సక్రమంగా మాట్లాడలేదు.

నిర్జీవంగా అర్షియా
ఇక బుధవారం ఉదయాన్నే హిందూపురంలోని నింకంపల్లిలో ఉండే బంధువులు ఫోన్ చేసి అర్షియా లేవడం లేదంటూ ఫోన్ చేయడంతో ఆమె తల్లిదండ్రులు, సోదరులు హుటాహుటిన హిందూపురం చేరుకున్నారు. మంచంపై నిర్జీవంగా పడివున్న అర్షియాను చూసి కన్నీటిపర్యంతమయ్యారు. ఏం జరిగిందని నూరుల్లాను నిలదీశారు.
దీంతో ఇంటి పైకప్పుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని నూరుల్లా నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు. దీంతో అర్షియా కుటుంబసభ్యులు ఆగ్రహానికి గురయ్యారు. ఈ క్రమంలో ఇరుకుటుంబాల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను శాంతిపర్చారు. అర్షియా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. బాధితులకు న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇచ్చారు.