రాత్రి మందు..పగలు ఫ్యాన్స్: బాలకృష్ణ ఎలాంటివారో తేల్చేసిన ఎంపీ గోరంట్ల మాధవ్
అనంతపురం: ప్రముఖ నటుడు, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడు నందమూరి బాలకృష్ణ వైఖరి.. ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది. హిందూపురం మున్సిపాలిటీ ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొంటోన్న ఆయన ఓ అభిమానిని కొట్టిన ఉదంతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి. దెబ్బలు తిన్న అభిమానిని.. బాలయ్యయ మళ్లీ ఆప్యాయతగా దగ్గర చేశారు. ఫొటో దిగారు. అభిమానులపై చేయి చేసుకోవడం బాలకృష్ణకు కొత్తేమీ కాదు. ఇదివరకు పలు సందర్భాల్లో ఆయన తన అభిమానులు, టీడీపీ కార్యకర్తలను కొట్టిన సందర్భాలు ఉన్నాయి.
మున్సిపల్ ఎన్నికల సమయంలో, ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తోన్న సందర్భంలో ఈ ఘటన చోటు చేసుకోవడం.. విమర్శలను సంధించడానికి ప్రత్యర్థులకు అవకాశాన్ని ఇచ్చినట్టయింది. బాలకృష్ణ వైఖరి పట్ల వ్యతిరేకత ఎదురవుతోంది. ఓ ఫొటో జర్నలిస్ట్‌పైనా ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేయడాన్ని తప్పుపడుతున్నారు. అనంతపురంలో ఫొటో జర్నలిస్టులు నిరసన ర్యాలీని కూడా నిర్వహించారు. బహిరంగంగా బాలకృష్ణ క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేస్తోన్నారు.

బాలకృష్ణ తీరు పట్ల హిందూపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ సభ్యుడు గోరంట్ల మాధవ్ అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. ఓ ప్రజా ప్రతినిధి వ్యవహరించాల్సిన తీరు అది కాదంటూ హితబోధ చేశారు. సొంత పార్టీ కార్యకర్తలు, అభిమానులను కొట్టడం, దౌర్జన్యం చేయడాన్ని ఎవరూ సమర్థించుకోలేరని అన్నారు. రాత్రి మందు కొట్టడం.. పగలు ప్రజలను కొట్టడం బాలకృష్ణకు అలవాటుగా మారిందని ఎద్దేవా చేశారు. ప్రజా ప్రతినిధిగా ఆయన ఎలాంటి సందేశాన్ని ఇస్తున్నారో అర్థం కావట్లేదని చెప్పారు. తెలుగుదేశం పార్టీకి ఓటేసిన పాపానికి సాక్షాత్తూ ఎమ్మెల్యేతో దెబ్బలు తినాల్సిన ఆగత్యం ఓటర్లకు ఏర్పడిందని మండిపడ్డారు.
కాగా- హిందూపురం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. ఆ పార్టీ ఆవిర్భవించిన తరువాత.. ఇప్పటిదాకా కూడా మరో నాయకుడు ఆ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎంపిక కాలేదు. టీడీపీ ఏకచ్ఛాత్రిధిపత్యాన్ని వహిస్తూ వచ్చిన అసెంబ్లీ స్థానాల్లో ఇదీ ఒకటి. ఈ సారి మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీని గట్టిగా దెబ్బకొట్టాలని వైఎస్సార్సీపీ సర్వశక్తులు ఒడ్డుతోంది. గోరంట్ల మాధవ్‌తో పాటు అనంతపురం ఎంపీ తలారి రంగయ్య, హిందూపురానికి చెందిన వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఇక్బాల్, నియోజకవర్గం ఇన్ఛార్జ్ నవీన్ నిశ్చల్.. మున్సిపాలిటీ పరిధిలో విస్తృతంగా పర్యటిస్తోన్నారు. ఇంటింటి ప్రచారాన్ని నిర్వహిస్తోన్నారు.