జేసీ దివాకర్ రెడ్డిని కలిసిన బీజేపీ ఎంపీ సీఎం రమేష్, బీటెక్ రవి, భేటీపై చర్చ
అనంతపురం: ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిని బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కలిశారు. ఆయన వెంట టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి కూడా ఉండటం గమనార్హం. వీరిద్దరూ కలిసి అనంతపురం తాడిపత్రికి వెళ్లారు.
జేసీ ఫాంహౌస్లో భేటీ..
జూటురులోని జేసీ దివాకర్ రెడ్డి ఫాంహౌస్లో ఆయనను కలిసిన సీఎం రమేష్, బీటెక్ రవిలు సుమారు మూడు గంటలపాటు సమావేశమయ్యారు. ఆ తర్వాత జేసీ దివాకర్ రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో సాగు చేసిన వివిధ రకాల పంటలను ఎంపీ రమేష్, బీటెక్ రవిలు పరిశీలించారు. అయితే, వీరు తమ భేటీలో ప్రస్తుత కరోనావైరస్ గురించి, వ్యవసాయ రంగం గురించిన చర్చించినట్లు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.

ఏం చర్చించారంటే..
అయితే, టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవితో కలిసి బీజేపీ ఎంపీ సీఎం రమేష్ జేసీని కలవడం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. జేసీ దివాకర్ రెడ్డి ఏమైనా బీజేపీకి దగ్గరవుతున్నారా? అనే చర్చ సాగుతోంది. అయితే, జేసీ వర్గీయులు మాత్రం ఈ విషయాన్ని కొట్టిపారేస్తున్నారు. పాత స్నేహితులు కావడంతో కలిశారని, ఇందులో ఎలాంటి రాజకీయాలు లేవని స్పష్టం చేశారు.

అలాంటిదేం లేదు..
కేవలం తన యోగ క్షేమాలు అడిగి తెలుసుకునేందుకే రమేష్, రవిలు వచ్చారని జేసీ కూడా స్పష్టం చేశారు. తమ భేటీలో ఎలాంటి రాజకీయ చర్చలు జరగలేదని చెప్పారు.
కాగా, టీడీపీలో ఎంపీగా ఉన్న సీఎం రమేష్ 2019 ఎన్నికల తర్వాత బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. బీటెక్ రవి టీడీపీలోనే కొనసాగుతున్నారు. అయితే, గత కొంత కాలంగా జేసీ దివాకర్ రెడ్డి బీజేపీ ప్రభుత్వానికి సానుకూలంగా వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించికుంది.