టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ కు కరోనా పాజిటివ్ ... ఏపీలో తాజా కరోనా పరిస్థితి ఇదే
ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభిస్తూనే ఉంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే పలు దేశాలు మళ్ళీ లాక్ డౌన్ విధించి కరోనా కంట్రోల్ కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ మొదలైందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు నిత్యం నమోదు అవుతూనే ఉన్నాయి. రాజకీయ నాయకులను సైతం కరోనా వదిలిపెట్టకుండా వేధిస్తోంది.
రోడ్లన్నీ రద్దీ .. 700 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ .. పారిస్ లో లాక్ డౌన్ ఎఫెక్ట్

టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ కు కరోనా పాజిటివ్
తాజాగా టిడిపి ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ కరోనా బారిన పడ్డారు. అస్వస్థతకు గురైన ఆయన కరోనా పరీక్షలు చేయించుకో గా ఆయనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించిన పయ్యావుల కేశవ్, ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు. ఇటీవల తనను కలిసిన నేతలు, నాయకులందరినీ కరోనా టెస్టులు చేయించుకోవాలని, వారు కూడా హోమ్ క్వారంటైన్ లో ఉండాలని పయ్యావుల కేశవ్ విజ్ఞప్తి చేస్తున్నారు.

తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యధిక కరోనా కేసులు
ఇదిలాఉంటే ఏపీలో కరోనా కేసులు 8,25,966 కు చేరుకున్నాయి. ఇప్పటి వరకు తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యధిక కరోనా కేసులు నమోదయ్యాయి . రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం యాక్టివ్ గా ఉన్న కేసులు 23,668 కాగా , కరోనా బారిన పడి కోలుకున్న వారు మొత్తం 7, 95,592 మంది గా ఉంది . కరోనా మహమ్మారి కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 6,706 మంది ఇప్పటి వరకు మృతి చెందారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి.

చాలా జిల్లాలలో తగ్గుముఖం పడుతున్న కేసులు
ఇటీవల కాలంలో కరోనా కేసులు తక్కువ సంఖ్యలో నమోదు కావడం, రికవరీల రేటు క్రమంగా పెరగడంతో ఏపీ ప్రభుత్వం కాస్త ఊపిరి తీసుకుంటోంది. అయితే రానున్నది శీతాకాలం కావడంతో, కరోనా కేసులు మరింత పెరిగే అవకాశం ఉంటుందని పలు అధ్యయనాలు హెచ్చరిస్తున్న సందర్భంలో మరింత అప్రమత్తంగా ఉండాలని ఏపీ సర్కార్ తగు జాగ్రత్తలు తీసుకుంటోంది.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్నూలు జిల్లాలోనూ, విజయనగరం, విశాఖపట్నం ,పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, శ్రీకాకుళం జిల్లాలలో 100 కంటేతక్కువగా కరోనా కేసులు నమోదవుతున్నాయి.

దేశంలో కరోనా కేసుల్లో మూడో స్థానంలో ఏపీ
కొత్త కేసుల నమోదు తగ్గడం, కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య పెరగడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రస్తుతం కరోనా కేసులలో దేశంలో మూడవ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో మహారాష్ట్ర, రెండవ స్థానంలో కర్ణాటక రాష్ట్రాలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో తాజా పరిస్థితి ఏపీ త్వరలోనే కరోనా నుండి బయటపడుతుంది అన్న విశ్వాసాన్ని కలిగిస్తున్నాయి . ఏది ఏమైనా ప్రపంచ వ్యాప్తంగా ప్రతి పది మందిలో ఒకరికి కరోనా సోకుతుంది అని అంచనా వేసిన అధ్యయనాల ప్రకారం కరోనా ప్రపంచాన్ని చుట్టేస్తోంది .