అనంత రైతులకు కానుక: సౌత్‌లో ఫస్ట్‌టైమ్: కిసాన్ రైలు: కేంద్రమంత్రితో కలిసి ప్రారంభించిన జగన్
అనంతపురం: దేశంలోనే రెండో అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే జిల్లాగా గుర్తింపు పొందిన అనంతపురానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక కానుకను ప్రకటించాయి. అరకొర నీటి వనరులు ఉన్నప్పటికీ.. వ్యవసాయరంగంలో అద్భుత ఫలితాలను సాధిస్తోన్న అనంతపురం రైతుల సౌకర్యం కోసం కిసాన్ రైలును అందుబాటులోకి తీసుకొచ్చాయి. వ్యవసాయోత్పత్తులను శరవేగంగా మార్కెట్లో విక్రయించుకోవడానికి ఉద్దేశించిన కిసాన్ రైలును కొద్దిసేపటి కిందట పట్టాలెక్కింది. అనంతపురం నుంచి దేశ రాజధానికి పరుగులు తీసింది.

దక్షిణాదిన మొట్టమొదటి రైలు..
కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, రైల్వేశాఖ సహాయ మంత్రి సురేష్ అంగడి న్యూడిల్లీ నుంచి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి జెండా ఊపి ప్రారంభించారు. అనంతపురం, హిందూపురం లోక్‌సభ సభ్యులు తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్, కలెక్టర్ గంధం చంద్రుడు అనంతంపురం నుంచి, దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ సికింద్రాబాద్ రైల్ నిలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశంలో ఇది రెండో కిసాన్ రైలు కాగా.. దక్షిణాదిన మొట్టమొదటిది.

321 టన్నుల వ్యవసాయోత్పత్తులు..
అనంతపురం నుంచి బయలుదేరిన ఈ రైలు ఢిల్లీలోని ఆదర్శ్ నగర్‌కు చేరుకుంటుంది. ఇందులో లోడ్ చేసిన పండ్లు, కూరగాయలు, ఇతర వ్యవసాయోత్పత్తులను మార్కెట్లకు తరలిస్తారు. 321 టన్నుల పంట ఉత్పత్తులను అనంతపురం స్టేషన్లో లోడ్ చేశారు. ఈ సందర్భంగా నరేంద్ర సింగ్ తోమర్ మాట్లాడుతూ త్వరగా పాడైపోయే వ్యవసాయోత్పత్తులను శరవేగంగా మార్కెట్లకు చేరవేయడానికి తాము కిసాన్ రైలును ప్రవేశపెట్టామని అన్నారు. అనంతపురం జిల్లాలో రెండు లక్షలకు పైగా హెక్టార్లలో రైతులు కూరగాయలను పండిస్తున్నారని, అలాంటి ప్రాంతం నుంచి కిసాన్ రైలును ప్రారంభించడం ఆనందంగా ఉందని చెప్పారు.

త్వరలో కిసాన్ ఉడాన్..
వాయు మార్గం ద్వారా వ్యవసాయోత్పత్తులను తరలించడానికి త్వరలోనే కిసాన్ ఉడాన్ కూడా చేపడతామని అన్నారు. కిసాన్ రైలు వల్ల ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్ రాష్ట్రాల రైతులకు లబ్ది కలుగుతుందని, వారు పండించిన పంట ఉత్పత్తులకు రవాణా వసతి కలుగుతుందని అన్నారు. త్వరలోనే కిసాన్ రైళ్ల సంఖ్యను పెంచుతామని హామీ ఇచ్చారు. వైఎస్ జగన్ మాట్లాడుతూ.. పండ్ల ఉత్పత్తిలో ఏపీ దేశంలోనే రెండో స్థానంలో ఉందని అన్నారు. అరటి, మామిడి, బొప్పాయి వంటి పండ్లను ఉత్పత్తి చేస్తున్నామని అన్నారు. కొద్దిరోజుల కిందటే తాడిపత్రి నుంచి ముంబై పోర్ట్‌కు వందల టన్నుల మేర పండ్లను రవాణా చేశామని గుర్తు చేశారు.

రైతు సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా..
రైతుల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా పని చేస్తున్నామని వైఎస్ జగన్ అన్నారు. ధరల స్థిరీకరణ నిధిని నెలకొల్పామని అన్నారు. పంట ఉత్పత్తులకు కనీస మద్దతు ధరను కల్పిస్తున్నామని చెప్పారు. కరోనా వైరస్ సంక్షోభ పరిస్థితుల్లోనూ పెద్ద ఎత్తున పంట దిగుబడిని సాధించామని పేర్కొన్నారు. పంట దిగుబడికి రవాణా వసతిని కల్పించినప్పుడు దానికి సార్థకత కలుగుతుందని వైఎస్ జగన్ అన్నారు. పంట పండించడం ఎంత ముఖ్యమో.. రవాణా చేయడం అంతే ముఖ్యమని అన్నారు.

కిసాన్ రైలు అవసరం..
దీనికోసం కిసాన్ రైలును ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్, రైల్వేశాఖ మంత్రి పియూష్ గోయెల్‌లకు కృతజ్ఙత తెలుపుతున్నానని జగన్ చెప్పారు. కిసాన్ రైలును ఏపీకి ప్రకటించడం హర్షణీయమని, దీనికోసం తమ పార్టీ ఎంపీలు తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్ అహర్నిశలు కృషి చేశారని ప్రశంసించారు. కిసాన్ రైలు అవసరాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లి, దాన్ని సాధించ గలిగారని అన్నారు. అనంతపురం జిల్లా రైతులకు ఇది మరింత మేలు చేస్తుందని వైఎస్ జగన్ చెప్పారు.