anantapur tadipatri jc diwakar reddy tdp ycp shabbir ali అనంతపురం తాడిపత్రి జేసీ దివాకర్ రెడ్డి టీడీపీ వైసీపీ షబ్బీర్ అలీ
జగన్ దెబ్బకు జేసీ శిబిరం విలవిల.. వైసీపీలోకి ప్రధాన అనుచరుడు షబ్బీర్ అలీ
తాడిపత్రి: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా ఆసక్తికరంగా మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పరిణామాల్లో వేగవంతమైన మార్పు కనిపిస్తోంది. టీడీపీలో ఉండటం వల్ల లాభమేమీ లేదని భావిస్తున్న నాయకులు వైసీపీ వైపు చూస్తున్నారు. ఇప్పటికే కృష్ణా జిల్లా రాజకీయం వైసీపీ చుట్టూ తిరుగుతోంది. సీన్ కట్ చేస్తే అనంతపురం జిల్లా తాడిపత్రిలో జేసీ బ్రదర్స్‌క షాకిస్తూ దివాకర్‌రెడ్డి ప్రధాన అనుచరుడు షబ్బీర్ అలీ అలియాస్ గోరా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.
దివాకర్ రెడ్డి మాజీ పీఏ ఇంటిపై ఏసీబీ దాడులు: రూ. 3 కోట్ల ఆస్తులు గుర్తింపు..!

ఏపీలో చేరికలతో వేడెక్కుతున్న రాజకీయం
ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత రాజకీయంగా పావులను వేగంగా కదుపుతోంది. మొన్న గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీని టార్గెట్ చేస్తూ తాను వైసీపీకి మద్దతు ఇస్తానంటూ బాహాటంగానే చెప్పారు. మరోవైపు కృష్ణా జిల్లాలో ప్రత్యేక గుర్తింపు ఉన్న దేవినేని ఫ్యామిలీ నుంచి దేవినేని నెహ్రూ కుమారుడు అవినాష్ వైసీపీ కండువా కప్పుకున్నారు. మరింత మంది టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీతో టచ్‌లో ఉన్నట్లు సమాచారం.ఇక తాజాగా అనంతపురం జిల్లా తాడిపత్రిలో జేసీ బ్రదర్స్‌కు షాకిస్తూ దివాకర్‌రెడ్డి ప్రధాన అనుచరుడు షబ్బీర్ అలీ అలియాస్ గోరా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో పట్టున్న తాడిపత్రిలో జేసీ వర్గంకు ప్రాధాన్యత లేకుండా పోయింది.

వైసీపీ తీర్థం పుచ్చుకున్న జేసీ అనుచరుడు షబ్బీర్ అలీ
షబ్బీర్ అలీ అలియాస్ గోరాతో పాటు బుధవారం నాడు పలువురు అనుచరులు తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. జేసీ అనుచరులతో మరికొంతమంది లారీ యజమానులు కూడా వైసీపీ కండువా కప్పుకున్నారు. పార్టీలోకి వచ్చిన వారికి ఎమ్మెల్యే పెద్దారెడ్డి సాదరంగా ఆహ్వానించారు. కాగా మొత్తం 500 మంది పెద్దారెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారని తెలుస్తోంది.ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందే జేసీ దివాకర్ రెడ్డి అనుచరులు కొందరు వైసీపీలో చేరారు. ఎన్నికల్లో జేసీ దివాకర్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి వారసులను ప్రజలు తిరస్కరించారు. దీంతో అటు అనంతపురం ఇటు సొంత నియోజకవర్గం తాడిపత్రిలో జేసీ కుటుంబం దాదాపు పట్టుకోల్పోయిందనే చెప్పాలి. తాజాగా జేసీ ప్రధాన అనుచరుడు షబ్బీర్ అలీ పార్టీ వీడటంతో జేసీకి ఊహించని షాక్ తగిలినట్లు సమాచారం.

జేసీ శిబిరాన్ని ఖాళీ చేయిస్తున్న వైసీపీ
ఏపీలో వైసీపీ సర్కార్ వచ్చినప్పటి నుంచి అనంతపురంపై ప్రత్యేక దృష్టి సారించింది. ముందుగా దివాకర్ రెడ్డి బస్సులను టార్గెట్ చేసి ఇరుకున పెట్టింది. ఒకానొక సమయంలో వ్యాపారం మానేస్తామనే స్థాయికి జేసీ బ్రదర్స్ వచ్చారు. ఈ క్రమంలోనే జేసీ దివాకర్ రెడ్డి బీజేపీ వైపు చూస్తున్నారా అనే వార్త జోరుగా ప్రచారం అందుకుంది. వీటికి బలం చేకూరుస్తూ బీజేపీకి అనుకూలంగా జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. మరోవైపు జేసీ దివాకర్ రెడ్డి మాజీ పీఏ సురేష్ రెడ్డిపై ఏసీబీ దాడులు నిర్వహించి పెద్ద ఎత్తున్న ఆస్తులను కనుగొనింది. ఇక తాడిపత్రిలో అధికాంగా ఉండే లారీ వ్యాపారులను సైతం టార్గెట్ చేసిన వైసీపీ వారిని పార్టీలోకి ఆకర్షించడంలో సక్సెస్ అయ్యింది. జేసీకి అనుచరులు లేకుండా చేద్దామన్న ఆలోచనతో పావులు కదిపిన వైసీపీ సక్సెస్ అయ్యిందని విశ్లేషకులు చెబుతున్నారు.

రాజకీయాల్లో యాక్టివ్‌గా లేని జేసీ వారసులు
ఒకప్పుడు తాడిపత్రిలో పరిస్థితి జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ పెద్దారెడ్డిగా ఉండేది. కానీ గతకొంతకాలంగా జేసీ ప్రభాకర్ రెడ్డి ఊసే ఎక్కడా కనిపించడం లేదు వినిపించడం లేదు. ఆయన రాజకీయాలకు దాదాపు దూరమయ్యారనే టాక్ అనంతపురంలో వినిపిస్తోంది. అదే సమయంలో జేసీ బ్రదర్స్ వారసులు కూడా రాజకీయాల్లో యాక్టివ్‌గా కనిపించడం లేదు. దీంతో తాడిపత్రి అంటే జేసీ బ్రదర్స్.. జేసీ బ్రదర్స్ అంటే తాడిపత్రి అనే కాన్సెప్ట్ ముగిసిందని జిల్లా ప్రజలు మాట్లాడుకుంటున్నారు.
మొత్తానికి జగన్ దెబ్బకు జేసీ శిబిరం విలవిలలాడుతోందని జిల్లా రాజకీయాలపై అవగాహన ఉన్న ప్రజలు చెబుతున్నారు. మరికొన్ని రోజుల్లో జేసీ క్యాంపును మొత్తం వైసీపీ ఖాళీ చేయిస్తుందనే వార్త అనంతపురం జిల్లాలో జోరుగా షికారు చేస్తోంది.