జగన్ లాంటి సీఎం దొరకడు! వందకు 110 మార్కులు, రోడ్డున పడిన పరువు!!
అమరావతి: ఏపీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన విమర్శలు చేశారు. జగన్ తన ఇష్టానుసారం పాలన కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. ఆయన అవలంభిస్తున్న విధానాలన్నీ విమర్శలకు తావిస్తున్నాయని అన్నారు.

జగన్ లాంటి సీఎం దొరకడు.. 110 మార్కులు
ఏపీకి జగన్ లాంటి ముఖ్యమంత్రి మళ్లీ దొరకడని.. జగన్ ఏడాది పాలనకు వందకు 110 మార్కులు వేస్తానని జేసీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జగన్ పట్టుదల పరాకాష్టకు చేరిందనడానికి హైకోర్టు తీర్పే ఉదాహరణ అని వ్యాఖ్యానించారు. తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్నట్లు జగన్ వ్యవహరిస్తే అభాసుపాలవడం తప్పదన్నారు.

జగన్ శ్రీరాముడో.. రావణుడో..
రాజ్యాంగం జోలికి వెళ్తే ఇలాంటి తీర్పులే వస్తాయని ప్రభుత్వానికి ముందే తెలుసని.. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లడం ప్రభుత్వం ఇష్టమని జేసీ అన్నారు. జగన్ శ్రీరాముడో.. రావణుడో ప్రజలే తేల్చుకోవాలన్నారు. చరిత్ర అనే పుస్తకంలో తనకు ఒక్క పేజీ ఉండాలనేది జగన్ ఆలోచన అని వ్యాఖ్యానించారు.
టీటీడీ ఆస్తులు అమ్మాలని వైవీ సుబ్బారెడ్డిపై జగన్ ఒత్తిడి తెచ్చారని అన్నారు.
ఇక వచ్చే ఎన్నికల్లో ఓట్ల కోసం జగన్ సంక్షేమంపై దృష్టిసారించారని, సంక్షేమానికి ఓట్లు పడవన్న విషయం 2019లో తేలిందని జేసీ వ్యాఖ్యానించారు.

జగన్ సర్కారు పరువు రోడ్డుమీదకంటూ సుజనా
టీడీపీ నుంచి బీజేపీలో చేరిన రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరి కూడా ఏపీ సీఎం వైఎస్ జగన్పై తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టారు. ఎస్ఈసీ విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ఏపీ ప్రభుత్వం పరువు రోడ్డు మీదకు వచ్చిందని విమర్శించారు. జగన్ నియంతలా వ్యవహరిస్తున్నారని, ముఖ్యమంత్రి అయినా ప్రజాస్వామ్య వ్యవస్థలో కొన్ని పరిమితులుంటాయని తెలుసుకోవాలని హితవు పలికారు.

151 సీట్లొచ్చాయని ఇష్టమొచ్చినట్లు చేస్తారా?
తనకు 151 సీట్లు వచ్చాయని, తాను ఇష్టానుసారంగా చేస్తానంటే మన భారత రాజ్యాంగం అంగీకరించదని సుజనా చౌదరి చెప్పారు. రాజకీయాలు పక్కన పెట్టి, రాష్ట్రాభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు. గతంలో వైఎస్ కూడా సీఎంగా ఉన్న సమయంలో ఎరుపు సుధాకర్ రెడ్డి విషయంలో గవర్నర్ ను తప్పుదోవ పట్టించారని, సుప్రీంకోర్టు అన్ని అంశాలను విచారించి గవర్నర్ నిర్ణయం సరికాదని.. రద్దు చేసిందని గుర్తు చేశారు. ఎస్ఈసీ రమేష్ కుమార్ విషయంలో జగన్ సర్కారు ఏకపక్షంగా వ్యవహరించిందని మండిపడ్డారు. ఇప్పటికైనా జగన్ రాజకీయాలు పక్కన పెట్టి.. ఏపీ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడంపై దృష్టి సారించాలని హితవు పలికారు.