అనంతపురంలో రోడ్డు ప్రమాదం.. ట్రాక్టర్ బోల్తా.. 8 మందికి గాయాలు
ఆంధ్రప్రదేశ్లో వరసగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇవాళ ఒక్కరోజే మూడు రోడ్డు ప్రమాదాలు జరిగాయి. చిత్తూరు జిల్లాలో రెండు రోడ్డు ప్రమాదాలు జరగ్గా, తాజాగా అనంతపురం జిల్లాలో మరో రోడ్డు ప్రమాదం జరిగింది. అనంతపురం జిల్లా బెళుగుప్ప మండలం బ్రాహ్మణపల్లి సమీపంలో ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

కర్ణాటక మొలకలుమురు నుంచి రెండు ట్రాక్టర్లలో 20 మంది వలస కూలీలు బయలదేరారు. కళ్యాణదుర్గం మండలం బొరంపల్లిలో ఓ ఇంటి స్లాబ్ నిర్మాణం కోసం వెళుతున్నారు. మార్గమధ్యలో ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో 8 మందికి గాయాలయ్యాయి.. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం అనంతపురం ఆసుపత్రికి తరలించారు.
అంతకుముందు చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం భాకరాపేట ఘాట్ రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మృతి చెందారు. ఘటనా స్థలంలో ఏడుగురు మృతి చెందగా...ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు. మరికొందరికి గాయాలయ్యాయి. అనంతపురం జిల్లా ధర్మవరం నుంచి తిరుపతికి వెళుతుండగా ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం ముంగిలిపట్లులో రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ను టెంపో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 10 మందికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దామలచెరువులో ఓ నిశ్చితార్థ వేడుకకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.