టాలీవుడ్ ను హాలీవుడ్ కు తీసుకెళ్లిన సాహో: అనంత మారుమూల గ్రామంలో సంబరాలు: లింకేంటీ?
అనంతపురం: ప్రస్తుతం చలన చిత్ర పరిశ్రమలో అందరి దృష్టినీ ఆకర్షిస్తోన్న సినిమా సాహో. సుమారు 300 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన మూవీ ఇది. మరో 48 గంటల్లో ఈ యాక్షన్ ప్యాక్డ్ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. బాహుబలి సిరీస్ తరువాత ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ ఇదే కావడంతో.. దీని మీద ఉన్న బజ్, క్రేజ్ అంతా ఇంతా కాదు. జాతీయ స్థాయిలో సినిమా పేరు మారుమోగిపోతోంది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదలకు సిద్ధమౌతున్న నేపథ్యంలో.. కరవు జిల్లాగా సార్థక నామధేయాన్ని సొంతం చేసుకున్నట్లుగా భావిస్తోన్న అనంతపురంలోని ఓ మారుమూల గ్రామం సంబరాల్లో మునిగిపోయింది. ఆ గ్రామం పేరు డబురువారి పల్లి. సాహో సినిమా విడుదలకు, ఎక్కడోొ రాయలసీమలోని ఓ మారుమూల గ్రామంలో పండగ వాతావరణం నెలకొనడానికి ఓ లింక్ ఉంది.
పాకిస్తాన్ సరికొత్త కుట్ర: అటు నుంచి నరుక్కొస్తున్న వైనం: భారత్ అప్రమత్తం!

కనీస సౌకర్యాలు లేని కుగ్రామం..
హాలీవుడ్ రేంజ్ లో ఈ మూవీని తెరకెక్కించినట్టు కనిపిస్తోన్న సాహో చిత్ర దర్శకుడు సుజీత్ స్వగ్రామం అది. కదిరి సమీపంలోని ఓబుళదేవర చెరువు (ఓడీసీ) మండలం పరిధిలో ఉందీ డబురువారి పల్లి. కనీస సౌకర్యాలు లేని కుగ్రామం అది. ఈ గ్రామస్తులు.. సాహో సినిమా గురించి గొప్పగా చెప్పుకొంటున్నారు. మూవీ విడుదల నాడు పండగ చేసుకోవడానికి ఏర్పాట్లను సిద్ధం చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఆ ఊరిలో సుజీత్ సమీప బంధువులెవరూ నివసించట్లేదు. ఆయన కుటుంబీకులు కూడా అనంతపురంలో స్థిరపడ్డారు. రామ్ నగర్ లో నివాసం ఉంటున్నారు. సినిమాల మీద ప్రేమతో సుజీత్ హైదరాబాద్ వెళ్లి అక్కడే స్థిరపడ్డారు.

ఎకనమిక్స్ లో గ్రాడ్యుయేట్..ఎల్వీ ప్రసాద్ అకాడమీలో శిక్షణ
ఆయన పూర్తి పేరు ఎద్దుల సుజీత్ రెడ్డి. ఎకనమిక్స్ లో గ్రాడ్యుయేట్. ఎలాంటి సినిమా నేపథ్యంలోని కుటుంబం ఆయనది. పాఠశాల విద్యాభ్యాసం అంతా అనంతపురంలో కొనసాగింది. ఉన్నత విద్య కోసం హైదరాబాద్ కు వెళ్లిన ఆయన టాలీవుడ్ ను తన గమ్యస్థానంగా మార్చుకున్నారు. ఎల్వీ ప్రసాద్ ఫిల్మ్ అకాడమీలో శిక్షణ తీసుకున్నారు. ప్రభాస్ కుటుంబానికి చెందిన యూవీ క్రియేషన్స్ తో మొదటి నుంచీ అసోసియేట్ గా ఉన్నారు. సుజీత్ దర్శకత్వం వహించిన తొలి సినిమా రన్ రాజా రన్. శర్వానంద్ హీరోగా నటించిన ఈ మూవీ 2014లో విడుదలైంది. తెలుగు సినిమాకు మరింత ఆధునికతను తెచ్చిపెట్టిన సినిమాగా అభివర్ణించారు విమర్శకులు. ఆ సినిమా ఇచ్చిన ఊపుతో సాహోకు సిద్ధమయ్యారు. అంతకుముందు సుమారు 30కి పైగా షార్ట్ ఫిల్మ్ లు తీసిన అనుభవం మాత్రమే సుజీత్ కు ఉంది.

300 కోట్ల రూపాయల మూవీ
సుజీత్ దర్శకత్వం వహించిన సాహో.. భారత చలన చిత్ర పరిశ్రమలోొ ఓ మైలురాయిలా నిలిచిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఆయన దర్శకత్వం వహించిన రెండో సినిమానే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కించడం కేరీర్ లోనే హైలైట్ నిలిచిపోవచ్చు. సుజీత్ టేకింగ్ పై ప్రభాస్ కు నమ్మకం ఉండటం వల్లే తన కుటుంబానికి చెందిన యూవీ క్రియేషన్స్ బ్యానర్ కింద భారీ బడ్జెట్ సినిమాను తెరకెక్కించారనేది ఫిల్మ్ నగర్ టాక్. రెండో సినిమాతోనే భారీ బడ్జెట్ సినిమాను హ్యాండిల్ చేయడం ఓ సవాల్ అనడంలో సందేహాలు అక్కర్లేదు. అయినప్పటికీ- తన నైపుణ్యంతో ఎక్కడా ఎలాంటి గందరగోళానికి తావు లేకుండా సుజీత్ ఈ సినిమాను తెరకెక్కించినట్లు చెబుతున్నారు. బాలీవుడ్ నుంచి నటీనటులను, హాలీవుడ్ నుంచి సాంకేతిక నిపుణులను రప్పించి మూవీని తెరకెక్కించిన విధానం.. ఆయనకు ఉజ్వల భవిష్యత్తును తెచ్చి పెట్టిందని సినీ విశ్లేషకులు అంటున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా 10 వేలకు పైగా స్క్రీన్లపై
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. ప్రపంచవ్యాప్తంగా 10 వేలకు పైగా స్క్రీన్లపై విడుదల కాబోతుండటం మరో రికార్డ్. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాల వాటా కనీసం రెండు వేల స్క్రీన్లపైమాటేనని తెలుస్తోంది. బాలీవుడ్‌తో పాటు మిగతా చోట్ల కూడా అత్యధిక ధియేటర్స్ సాహోకే కేటాయించారు. ప్రభాస్ మూవీ బాహుబలి: ది కన్‌క్లూజన్ మూవీ తొమ్మిది వేలకు పైగా స్క్రీన్స్‌లో విడుదలైన విషయం తెలిసిందే. సాహో మాత్రం 10 వేల ల్యాండ్ మార్క్ ను అందుకుంది. బాహుబలి - 2 తో పోల్చకుంటే అదనంగా మరో వెయ్యి ధియేటర్లలో విడుదల అవుతోంది. సినిమా బడ్జెట్ ను దృష్టిలో ఉంచుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వాలు అదనపు మూవీలను ప్రదర్శించడానికి అనుమతిని మంజూరు చేశాయి. ఈ లెక్కన చూసుకుంటే- విడుదలైన వారంరోజుల్లోనే సినిమాపై పెట్టిన ఖర్చు వెనక్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది.