కరోనా బారినపడవద్దంటే.... ఆ మంత్రం చదవండి... : హిందూపురం పర్యటనలో బాలకృష్ణ
హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సోమవారం(అగస్టు 31) తన నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా రూ.55లక్షలు విలువైన కరోనా మెడికల్ కిట్లను ఆస్పత్రికి అందజేశారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన బాలకృష్ణ... కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కరోనాకు భయపడాల్సిన పని లేదని,వేద మంత్రాలతో దాన్ని ఎదుర్కొందామని అన్నారు. లలిత త్రిపుర సుందరి మంత్రాన్ని 108 సార్లు పటిస్తే కరోనా దరిచేరదన్నారు. అంతేకాదు,స్వయంగా మంత్రం చదివి వినిపించారు.
ఇక హిందూపురం గురించి ప్రస్తావిస్తూ....తాను ఎక్కడున్నా నియోజకవర్గ అభివృద్ది కోసమే శ్రమిస్తానని చెప్పారు. హిందూపురంలో అభివృద్ది పనులకు సంబంధించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఇప్పటికే రెండుసార్లు అపాయింట్మెంట్ కోరానని అన్నారు. మరోసారి సమయం అడిగి ముఖ్యమంత్రితో భేటీ అవుతానని చెప్పారు.

కాగా,కరోనా కారణంగా బాలకృష్ణ గత 5 నెలలుగా తన నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు. అయితే నియోజకవర్గంలో కరోనా పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. సోమవారం ఆయన రాకతో భారీగా అభిమానులు,కార్యకర్తలు తరలివచ్చారు. కరోనాపై పోరులో తనవంతుగా తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు బాలకృష్ణ రూ.50లక్షలు చొప్పున విరాళం అందజేసిన సంగతి తెలిసిందే. అలాగే సినీ కార్మికులను ఆదుకునేందుకు ఏర్పాటు చేసిన 'సీసీసీ మనకోసం' అందించిన సాయంలోనూ తనవంతుగా రూ.25 లక్షలు విరాళం అందించారు.