
10 వేల మందికి ఉపాధి.. అపాచీతో స్థానికులకే 80 శాతం ఉద్యోగాలు: సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్లో మరో పరిశ్రమకు అంకురార్పణ జరిగింది. ఇప్పటికే నెల్లూరులో ఒక యూనిట్ ఉన్న అపాచీ.. మరో యూనిట్ నెలకొల్పనుంది. శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇనగలూరులో రూ. 700 కోట్లతో అపారీ పరిశ్రమను ఏర్పాటు చేయనుంది. అపాచీ పరిశ్రమకు సీఎం జగన్ గురువారం శంకుస్థాపన చేశారు. ఇనగలూరులో అపాచీ పరిశ్రమ ఏర్పాటు చేయడం సంతోషకరం అని జగన్ అన్నారు.

రూ.700 కోట్లు
తొలి దశలో రూ.350 కోట్లు, వచ్చే ఐదేళ్లలో మరో 350 కోట్లు పెట్టుబడి పెడతారని సీఎం జగన్ తెలిపారు. అపాచీ పరిశ్రమలో అడిడాస్ షూ, లెదర్ జాకెట్స్, బెల్ట్ వంటి ఉత్పత్తులను తయారు చేస్తారు. అపాచీ పరిశ్రమ ఏర్పాటుతో 10 వేల మందికి ఉద్యోగాలు అవకాశాలు లభిస్తాయని సీఎం జగన్ అన్నారు. ఇదీ 2023 సెప్టెంబర్ వరకు అందుబాటులోకి వస్తుందన్నారు. పరిశ్రమ ఏర్పాటుతో 80 శాతం మంది స్థానికులకే ఉద్యోగాలు వస్తాయని తెలిపారు.

సీఎం జగన్ తోడ్పాటు
పరిశ్రమల ఏర్పాటుకు సహకారం అందించిన సీఎం జగన్కు అపాచీ కంపెనీ డైరెక్టర్ టోనీ కృతజ్ఞతలు తెలియజేశారు. పరిశ్రమల ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం అందించిన తోడ్పాటును మరువలేమని తెలిపారు. పారిశ్రామికరంగాన్ని సీఎం జగన్ ప్రోత్సహిస్తున్నారని వివరించారు. అందుకోసమే మరో యూనిట్ నెలకొల్పామని వివరించారు.


పూజలు
అంతకుముందు తిరుపతి సమీపం గల పేరూరు బండపై పునర్ నిర్మించిన శ్రీ వకుళామాత ఆలయాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. ఆలయంలో సీఎం ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీటీడీ ఆధ్వర్యంలో సీఎం జగన్ను సన్మానించి శ్రీవారి చిత్రపటాన్ని అందజేశారు. మంత్రి పెద్దిరెడ్డి తన సొంత నిధులతోపాటు టీటీడీ ఆధ్వర్యంలో నిర్మించిన ఆలయాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. వకుళా మాత ఆలయం వద్ద 83 ఎకరాల 42 సెంట్ల భూమి ఉంది. ఈ ప్రాంతంలో టీటీడీ కల్యాణ మండపం, అతిథి భవనం నిర్మిస్తుందని మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు. 20 కేజీల బంగారంతో ఆలయ గోపురానికి 5 కలశాలు టీటీడీ సహకారంతో ఏర్పాటు చేస్తారు.