
ఇటు ప్రభుత్వం - అటు కోర్టు : కోనసీమ జిల్లా పేరుపై పిటీషన్లు - పోలీసుల అలెర్ట్..!!
కోనసీమ జిల్లా పేరు వ్యవహారం ఇప్పుడు ప్రభుత్వం వద్దకు చేరింది. అదే సమయంలో కోర్టులోనూ పిటీషన్లు దాఖలయ్యాయి. కోనసీమ కు ఇప్పుడున్న పేరే కొనసాగించాలని, ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా స్టే ఇవ్వాలని హైకోర్టులో పన్నెండు పిటిషన్లు ఫైల్ చేసారు. వీటన్నింటి పైనా కలిసి విచారించాలని కోర్టు నిర్ణయించింది. ఇదే సమయంలో కోనసీమ జిల్లా పేరు పైన జిల్లా వాసుల నుంచి అభిప్రాయ సేకరణ పూర్తయింది. గత నెల 18న కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయం తీసుకుంది.
దీని పైన ప్రజల నుంచి అభ్యంతరాలు.. సూచనలు..సలహాలు ఇవ్వటానికి నెల రోజుల సమయం నిర్దేశించింది. ఈ సమయంలో అమలాపురంలో పేరు అంశం పైన పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అయింది. విధ్వంసానికి దారి తీసింది. మంత్రి..ఎమ్మెల్యేల ఇల్లు దహనం చేసారు. భారీ విధ్వంసకాండ పైన పోలీసు ఉన్నతాధికారులు విచారణ చేసారు. 217 మందిని అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన వారిని పట్టుకోవటానికి ఏడు ప్రత్యేక బృందాలు గాలింపు కొనసాగిస్తున్నాయి. గడువు ముగియడంతో ప్రభుత్వానికి అభ్యంతరాలపై కలెక్టర్ నివేదిక ప్రభుత్వానికి పంపినట్లు సమాచారం.

ప్రస్తుతం జరుగుతున్న ఏపీ కేబినెట్ సమావేశంలోనూ దీని పైన చర్చకు వచ్చే అవకాశం ఉంది. అమలాపురం లో ముందస్తుగానే వాట్సప్ ద్వారా సమాచారం షేర్ చేసుకొని అల్లర్లకు పాల్పడినట్లుగా గుర్తించారు. దీంో..జిల్లాలో దాదాపు 15 రోజుల పాటుగా 16 మండలాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. ఇదే అంశం పైన జిల్లా మంత్రులు.. పోలీసు- రెవిన్యూ అధికారులతో సీఎం జగన్ సమీక్షించారు. ఇక, జిల్లా పేరు మార్పు పై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉండటంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు.
జిల్లాలో 1300 మంది పోలీసులతో గస్తీ నిర్వహణ కొనసాగుతోంది. అయితే, ఇప్పుడు కోర్టులో ఏకంగా 12 పిటీషన్లు దాఖలు కావటంతో.. ఇటు ప్రభుత్వం ఏం చేయబోతోంది.. కోర్టు నుంచి ఎటువంటి మార్గదర్శకాలు వస్తాయనేది ఆసక్తి కరంగా మారుతోంది. ఈ వ్యవహారం పైన సానుకూల నిర్ణయం తో సమస్య పరిష్కరించాలని ప్రభుత్వం భావిస్తోంది.