రాజమండ్రి సెంట్రల్ జైల్లో కరోనా కలకలం... 13 మంది రిమాండ్ ఖైదీలకు పాజిటివ్...
రాజమండ్రిలోని సెంట్రల్ జైల్లో మరో 13 మంది రిమాండ్ ఖైదీలు కరోనా బారినపడ్డారు. బుధవారం(ఏప్రిల్ 7) వీరికి జ్వరం రావడంతో జైలు అధికారులు కరోనా టెస్టులు చేయించారు. గురువారం టెస్టు రిపోర్టులు రాగా... అందులో వీరికి పాజిటివ్‌గా నిర్దారణ అయింది. ఈ విషయాన్ని జైలు సూపరింటెండెంట్ రాజారావు వెల్లడించారు. వారం రోజుల క్రితం ఇదే సెంట్రల్ జైల్లో 8 మంది ఖైదీలు కరోనా బారినపడ్డారు. తాజాగా కరోనా బారినపడ్డ ఖైదీల ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు సూపరింటెండెంట్ వెల్లడించారు.
గత కొద్దిరోజులుగా రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగింది. అంతకుముందు వెయ్యి లోపే నమోదైన కేసులు ఇప్పుడు 2వేలు దాటుతున్నాయి. గురువారం(ఏప్రిల్ 8) రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 2558 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 465, అత్యల్పంగా పశ్చిమగోదావరి జిల్లాలో 37 కేసులు వెలుగుచూశాయి. కరోనాతో మరో ఆరుగురు మృతి చెందారు. గుంటూరు, కృష్ణా, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, విశాఖ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు.

ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 14913 యాక్టివ్ కేసులున్నాయి. గడిచిన 24గంటల్లో 31268 కొవిడ్ పరీక్షలు చేశారు. కొత్తగా మరో 915 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 9,15,832కు చేరింది. ఇప్పటివరకూ కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 7,268కి చేరింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,53,33,851 నమూనాలను పరీక్షించినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకు మొత్తం 8,93,651 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
కరోనా ఉధృతి పెరుగుతుండటంతో ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖానికి మాస్కులు ధరించడం,భౌతిక దూరం పాటించడం వంటివి తప్పనిసరిగా పాటించాలంటున్నారు. దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో జాగ్రత్తగా వ్యవహరించాలని చెబుతున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించి కరోనా బారినపడవద్దని,వైరస్ వ్యాప్తికి కారణం కావొద్దని సూచిస్తున్నారు.
ఇక దేశవ్యాప్తంగా గడిచిన 24గంటల్లో 1లక్షా 26వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. మరో 685 మంది కరోనాతో మృతి చెందారు. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,29,28,574కి చేరింది. కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 1,66,862 కు చేరింది.