• search
  • Live TV
అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

జేసీబీ, ఏసీబీ, పీసీబీ: మూడు ముక్కల్లో జగన్ పాలన ఇదీ: టీడీపీ ఛార్జ్‌షీట్: మా పథకాలకు పేర్లు

|

విశాఖపట్నం: రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రతిపక్ష తెలుగుదేశం ఛార్జ్‌షీట్‌ను విడుదల చేసింది. ఈ రెండేళ్లలో జగన్ సర్కార్ ఎలాంటి విధ్వంసకర కార్యకలాపాలకు పాల్పడిందో ఇందులో వివరించింది. ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులపై భౌతికదాడులకు పాల్పడటం, రాజకీయంగా కక్షసాధింపు చర్యలకు పాల్పడటం, రాజధాని అమరావతి నిర్మాణాన్ని నిలిపివేయడం వంటి విధ్వంసకర చర్యలకు పాల్పడిందని ఆరోపించింది. జగన్ విధ్వంసం పేరుతో ఓ బుక్‌లెట్‌ను టీడీపీ విడుదల చేసింది.

జేసీబీ, ఏసీబీ, పీసీబీ తప్ప

జేసీబీ, ఏసీబీ, పీసీబీ తప్ప

ఈ ఉదయం విశాఖపట్నం తెలుగుదేశం జిల్లా కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు వాటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. వైఎస్ జగన్ విధ్వంసకర ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోతారని మండిపడ్డారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక జేసీబీ, ఏసీబీ, పీసీబీ తప్ప అభివృద్ధి అనేది కంటికి కనిపించట్లేదని విమర్శించారు. ఒక్క ఛాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి విధ్వంసకర చర్యలతో పరిపాలనను మొదలు పెట్టారని ఆరోపించారు.

ప్రజా వేదిక కూల్చివేతతో విధ్వంసకర పాలన

ప్రజా వేదిక కూల్చివేతతో విధ్వంసకర పాలన

అమరావతి ప్రాంతంలో తమ ప్రభుత్వం నిర్మించిన ప్రజా వేదికను జేసీబీతో కూల్చి వేయడంతో రాష్ట్రంలో విధ్వంసకర పరిపాలనకు జగన్ శ్రీకారం చుట్టారని ధ్వజమెత్తారు. ప్రశ్నించిన వారిపై అకారణంగా, రాజకీయ కక్ష, దురుద్దేశాలతో ఏసీబీ దాడులను ప్రభుత్వం చేయిస్తోందని ఆరోపించారు. సీఐడీ అంటే జగన్మోహన్ రెడ్డి సొంత సంస్థగా మారిందని అచ్చెన్నాయుడు ఆరోపించారు. ముఖ్యమంత్రి ఏది చెప్తే అది..చేయడానికి మాత్రమే సీఐడీ పనిచేస్తోందని చెప్పారు. జేసీబీ, ఏసీబీలకు లొంగని ప్రతిపక్ష నాయకుల కంపెనీలు, సంస్థలపై పీసీబీని ప్రయోగించి, మూతపడేలా చేస్తోందని అచ్చెన్నాయుడు మండిపడ్డారు.

లేనివి ఉన్నట్లు..

లేనివి ఉన్నట్లు..

అధికార పార్టీలో ప్రతీ నాయకుడు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారని, లేనివి ఉన్నట్లుగా, చేయనివి చేసినట్లుగా ప్రజలను మభ్యపెడుతున్నారని అచ్చెన్నాయుడు విమర్శించారు. వైఎస్ జగన్ తన పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు కాలేదని, వాటన్నింటినీ గాలికొదిలేశారని ధ్వజమెత్తారు. అయినప్పటికీ 90 శాతానికి పైగా మేనిఫెస్టోను అమలు చేసినట్లు వైసీపీ నాయకులు గొప్పలు చెప్పుకొంటున్నారని ఆరోపించారు. సంక్షేమ పథకాల పేర్లతో దోపిడీకి పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు.

మా పథకాలకు స్టిక్కర్లు..

మా పథకాలకు స్టిక్కర్లు..

నవరత్నాలను అమలు చేస్తామని ప్రకటించిన వైఎస్ జగన్.. తాను అధికారంలోకి వచ్చాక ప్రజలకు నకిలీ రత్నాలు ఇచ్చారని, ఓటు వేసిన అధికారాన్ని అప్పగించిన ప్రజలను మోసం చేశారని అచ్చెన్నాయుడు విమర్శించారు. తమ ప్రభుత్వ హయాంలో ప్రవేశ పెట్టిన పథకాలకు పేర్లు మార్చడం తప్ప కొత్త పథకాలు ఏ ఒక్కటీ అమలు చేయలేదని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాలు, అరాచకాలను నిలదీయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని చెప్పారు. మూడేళ్ల తరువాత.. తాము అధికారంలోకి రావడం ఖాయమని, వైసీపీ నేతలకు వడ్డీతో సహా చెల్లిస్తామని అచ్చెన్నాయుడు హెచ్చరించారు.

English summary
Chargesheet released by Opposion Telugu Desam Party leader Atchannaidu against two years of YSRCP Governance in Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X