ఏపీలో భారీగా తగ్గిన కరోనా కొత్త కేసులు: 26వేలకు తగ్గిన యాక్టివ్ కేసులు, జిల్లాలవారీగా..
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుతోంది. కరోనా పరీక్షలు తగ్గించనప్పటికీ.. కరోనా కొత్త పాజిటివ్ కేసులు మాత్రం భారీగా పెరగడం లేదు. మరణాల సంఖ్య కూడా భారీగా తగ్గుతోంది. అదే సమయంలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గుతోంది.
కరోనా ఎఫెక్ట్: మైక్ పాంపియో, ఎస్పర్లతో అజిత్ దోవల్ 'ఎల్బో బంప్’

ఏపీలో కొత్తగా 2949 కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 77,028 కరోనా పరీక్షలు చేయగా.. 2949 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,14,774కు చేరింది. కరోనా బారినపడి 18 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనాతో మరణించినవారి సంఖ్య 6643కు చేరింది.

జిల్లాలవారీగా మరణాలు
గడిచిన 24 గంటల్లో అనంతపురం, గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో ముగ్గురు చొప్పున కరోనాతో మృతి చెందారు. చిత్తూరు, తూర్పుగోదావరిలో జిల్లాల్లో ఇద్దరు చొప్పున, ప్రకాశం, విశాఖపట్నం జిల్లాల్లో ఇద్దరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.

ఏపీ జిల్లాలవారీగా కొత్త కేసులు
ఏపీ జిల్లాల వారీగా కరోనా కొత్త కేసులను గమనించినట్లయితే.. అనంతపురంలో 192, చిత్తూరులో 315, తూర్పుగోదావరిలో 417, గుంటూరులో 421, కడపలో 193, కృష్ణాలో 457, కర్నూలులో 32, నెల్లూరులో 76, ప్రకాశంలో 99, శ్రీకాకుళంలో 74, విశాఖపట్నంలో 114, విజయనగరంలో 67, పశ్చిమగోదావరిలో 492 కరోనా కేసులు నమోదయ్యాయి.

భారీగా తగ్గిన కరోనా యాక్టివ్ కేసులు
గడిచిన 24 గంటల్లో 3609 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 7,81,509కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 26,622 యాక్టివ్ కేసులున్నాయి. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 77,73,681 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు తెలిపింది. దేశంలోనూ కొత్త కేసులు తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం దేశంలో 80 లక్షలకు చేరువలో కరోనా కేసులుండగా, ఆరు లక్షలకుపైగా యాక్టివ్ కేసులున్నాయి. లక్షా 20వేల మరణాలు సంభవించాయి.