ఏపీలో కొత్తగా 349 కరోనా కేసులు: ఏ జిల్లాలో ఎన్ని కేసులుంటే, 3వేలకు చేరువలో యాక్టివ్ కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో నమోదైన కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. అదే సమయంలో కోలుకుంటున్నవారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఒక్క రోజు వ్యవధిలో 55,740 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 349 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 8,81,948కి చేరింది.
గత 24 గంటల్లో నలుగురు కరోనా బాధితులు మృతి చెందారు. చిత్తూరు, కడప, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు మృతి చెందినవారి సంఖ్య 7104కు చేరింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బుధవారం సాయంత్రం వెల్లడించింది.

ఏపీలో జిల్లాలవారీగా కరోనా కొత్త కేసులను గమనించినట్లయితే.. అనంతపురంలో 16, చిత్తూరులో 50, తూర్పుగోదావరిలో 28, గుంటూరులో 44, కడపలో 24, కృష్ణాలో 75, కర్నూలులో 7, నెల్లూరులో 9, ప్రకాశంలో 6, శ్రీకాకుళంలో 14, విశాఖపట్నంలో 26, విజయనగరంలో 4, పశ్చిమగోదావరిలో 46 కరోనా కేసులు నమోదయ్యాయి.
గడిచిన 24 గంటల్లో 472 మంది బాధితులు పూర్తిగా కోలుకోగా.. రాష్ట్రంలో ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 8,71,588కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 3256 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,17,64,418 కరోనా నమూనాలను పరీక్షించినట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.