500 కిలోల వెండి స్వాధీనం: ఛత్తీస్గఢ్ టు తమిళనాడు వయా ఏపీ, నలుగురు అరెస్ట్
కర్నూలు: జిల్లాలోని డోన్ సమీపంలో 44వ జాతీయ రహదారిపై భారీగా వెండి పట్టుబడింది. అక్రమంగా తరలిస్తున్న సుమారు 500 కిలోల వెండిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వెండి అక్రమంగా తలిస్తున్నారన్న సమాచారం అందడంతో డోన్, వెల్దుర్తి, కృష్ణగిరి పోలీసులు గురువారం రాత్రి అమకతాడు టోల్ ప్లాజా వద్ద తనిఖీలు చేపట్టారు.
ఈ తనిఖీల్లో ఎలాంటి పత్రాలు లేకుండా కారులో అక్రమంగా తరలిస్తున్న 500 కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నట్లు డోన్ పోలీసులు తెలిపారు. నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు. పట్టుబడిన వెండి సుమారు రూ. 3 కోట్ల వరకు ఉంటుందని పోలీసులు వెల్లడించారు. ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని రాయపూర్ నుంచి తమిళనాడులోని సేలంకు వెండిని తలిస్తున్నారని విచారణలో తేలింది.

గుంటూరులో 13 కోట్ల భారీ మోసం
నకిలీ సంస్థలను సృష్టించి వ్యాపార లావాదేవీలు నిర్వహించకుండానే ఇన్పుట్ టాక్స్ క్రెడిట్(ఐటీసీ) ద్వారా ప్రభుత్వాన్ని మోసం చేసినట్లు జీఎస్టీ ఇంటెలీజెన్స్ విభాగం విశాఖపట్నం శాఖ గుర్తించింది. ఈ కేసులో కీలక సూత్రధారిగా ఉన్న ప్రొద్దుటూరుకు చెందిన 38ఏళ్ల వ్యక్తిని బుధవారం అరెస్ట్ చేశారు. మూడు నకిలీ జీఎస్టీ రిజిస్ట్రేషన్లు సృష్టించి రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 84 కోట్ల మేర వ్యాపార లావాదేవీలు జరిపినట్లు జీఎస్టీ ఇంటెలీజెన్స్ అధికారులు తెలిపారు.
గుంటూరు పరిసరాల్లోనే ఈ నకిలీ సంస్థలు ఉన్నట్లు తేలిందని మరింత లోతుగా విచారిస్తున్నామన్నారు. ఈ కేసులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఇన్ఫ్రా కంపెనీల పేరిట దొంగ బిల్లులు సృష్టించినట్లు అధికారులు గుర్తించారు. లేని సంస్థల పేరిట జీఎస్టీ రిజిస్ట్రేషన్లు సృష్టించి రూ. 527 కోట్ల లావాదేవీలు చూపించి రూ. 50 కోట్ల మేర ఇన్ పుట్ టాక్స్ క్రెడిట్ మోసం చేసినట్లు అధికారులు నవంబర్ నెలలోనే గుర్తించారు. ఇప్పటి వరకు ఈ మోసానికి సంబంధించి 11 కేసులు నమోదు కాగా, నలుగురిని అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు.