ఏపీలో కోటి దాటిన కరోనా పరీక్షలు: పశ్చిమగోదావరిలో ఎక్కువ, శ్రీకాకుళంలో తక్కువ కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. కరోనా పరీక్షలు భారీగా నిర్వహిస్తున్నప్పటికీ కరోనా కేసులు తక్కువగానే ఉంటున్నాయి. తాజాగా, రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య కోటి దాటడం గమనార్హం. కోటికిపైగా కరోనా పరీక్షలు నిర్వహించిన ఆరో రాష్ట్రంగా ఏపీ నిలిచింది.

ఏపీలో కొత్తగా 620 కరోనా పాజిటివ్ కేసులు
ఒక్క రోజు వ్యవధిలో 54,710 కరోనా నమూనాలను పరీక్షించడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు జరిపిన పరీక్షల సంఖ్య 1,00,17,126కి చేరింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం సాయంత్రం వెల్లడించింది. గత 24 గంటల్లో 620 మందికి కరోనా సోకినట్లు తేలింది. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 8,67,683కి చేరింది.

8వేలకు పడిపోయిన యాక్టివ్ కేసులు
గత 24 గంటల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా, ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 6,988కి చేరింది. కృష్ణా జిల్లాలో ఇద్దరు, విశాఖపట్నంలో ఇద్దరు, చిత్తూరు, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కరు చొప్పున కరోనాతో మరణించారు. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 3787 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో కోలుకున్నవారి సంఖ్య 8,52,298కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 8397 యాక్టివ్ కేసులున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

ఏపీ జిల్లాల వారీగా కరోనా కేసులు ఇలా..
జిల్లాల వారీగా తాజా కరోనా కేసులను గమనించినట్లయితే..అనంతపురంలో 16, చిత్తూరులో 64, తూర్పుగోదావరిలో 40, గుంటూరులో 101, కడపలో 48, కృష్ణాలో 85, కర్నూలులో 15, నెల్లూరులో 39, ప్రకాశంలో 19, శ్రీకాకుళంలో 15, విశాఖపట్నంలో 36, విజయనగరంలో 35, పశ్చిమగోదావరిలో 107 కరోనా కేసులున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య లక్ష(1,22,246) దాటింది. పశ్చిమగోదావరిలో 92వేలకు పైగా కేసులున్నాయి.

దేశ వ్యాప్తంగా 4 లక్షలకు పడిపోయిన యాక్టివ్ కేసులు
ఇక దేశ వ్యాప్తంగానూ కరోనా కేసులు తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో 42,298 మంది కోలుకోగా, 41,810 మంది కరోనా బారినపడ్డారు. దీంతో కరోనా కేసుల సంఖ్య 93,92,920కి చేరింది. 88,02,267 మంది కరోనా నుంచి కోలుకున్నారు. నిన్న ఒక్కరోజే 496 మంది మరణించారు. ఇప్పటి వరకు కరోనాతో 1,36,696 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 4,53,956 యాక్టివ్ కేసులున్నాయి.