సర్వేల్లో తేలింది ఇదే - సీఎం జగన్ పాలన కు ఎన్ని మార్కులు : ఎమ్మెల్యేలకు ఆదరణ ఉందా : వారి పై వేటు..!!
ఏపీలో మూడేళ్ల జగన్ పాలకు ప్రజల మద్దతు ఎంత మేర ఉంది. జగన్ పాలన ఎంత మంది కోరుకుంటున్నారు. వైసీపీ ఎమ్మెల్యేల పని తీరు ఎలా ఉంది. సర్వే నివేదికలు ఏం తేల్చాయి. ఇప్పుడు ఇది వైసీపీలో హాట్ టాపిక్ గా మారాయి. సీఎం జగన్ వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. ప్రభుత్వం - పార్టీని ఆ దిశగా సిద్దం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో 151 సీట్లు తగ్గకూడదని లక్ష్యంగా డిసైడ్ చేసారు. తన ప్రభుత్వం చేస్తున్న మంచిని సమర్ధవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్తే 175 సీట్లు ఎందుకు రావంటూ సీఎం ప్రశ్నిస్తున్నారు.

గేర్ మారుస్తున్నాం.. సిద్దంగా ఉండండి
మే నుంచి గేర్ మారుస్తున్నామన్నారు. ఎన్నికలకు ఇప్పటి నుంచే సరైన అడుగులేస్తేనే మనం అధికారంలో కొనసాగుతామని పేర్కొన్నారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి జగన్ క్షేత్ర స్థాయిలో ప్రభుత్వ - పార్టీ పని తీరు గురించి సర్వేల ద్వారా సేకరించిన సమచారాన్ని ప్రస్తావించారు. పని తీరు లో కొంతమంది ఎమ్మెల్యేలే ముందంజలో ఉన్నారని చెప్పారు.
చాలా మంది మధ్య స్థాయిలో ఉన్నారని వెల్లడించారు. 10-15 శాతం మంది తక్కువ స్థాయిలో ఉన్నారని వివరించారు. సీఎం లెక్కల ప్రకారం దాదాపుగా 50-60 మంది వరకు మధ్య స్థాయిలో పని తీరు ప్రదర్శిస్తున్నట్లుగా సర్వేలో తేలిందని తలుస్తోంది. అదే విధంగా 20-24 మంది వరకు తక్కువ స్థాయిలో ఉన్నట్లుగా పార్టీలో చర్చ సాగుతోంది. తక్కువ, మధ్య స్థాయి ఎమ్మెల్యేలు 'గడప గడపకు' పూర్తిగా తిరగడం ద్వారా వారి గ్రాఫ్‌ను పెంచుకోవాని సీఎం నిర్దేశించారు.

సర్వేలు కీలకం...సరి చేసుకోండి
వారికి ఇదొక అవకాశంగా సీఎం పేర్కొన్నారు. ఎనిమిది నెలల తరువాత మరో సారి సమీక్ష ఉంటుందని వెల్లడించారు. అప్పటికీ వారి పని తీరులో మెరుగుదల కనిపించకపోతే చేసేదేమీ ఉండదని తేల్చి చెప్పారు. ఇదే సమయంలో ప్రభుత్వ పని తీరు..ముఖ్యమంత్రి జగన్ కు 65 శాతం మద్దతు ఉన్నట్లుగా సర్వేల్లో తేలిందని మాజీ మంత్రి కొడాలి నాని స్పష్టం చేసారు.
ముఖ్యమంత్రి జగన్ ఉండాలని 65 శాతం మంది కోరుకుంటున్నట్లు తేలిందని వెల్లడించారు. అయితే, ఎమ్మెల్యేల విషయంలోనే 40 నుంచి 50 శాతం వరకు ఉందని చెప్పారు. ఎమ్మెల్యేలు చాలా మంది ప్రజలకు దూరంగా ఉంటున్నారనేది తేలిందని...ఇప్పుడు దానిని సరిదిద్దుకొనే సమయం దొరికిందని వ్యాఖ్యానించారు. ఇప్పుడు కూడా ప్రజల్లోకి వెళ్లకపోతే వారి గ్రాఫ్ మరింత పడిపోతుందన్నారు.

గ్రాఫ్ పెరగకపోతే..సీటు లేనట్లే
ఎమ్మెల్యేల పని తీరు విషయంలో సీఎం స్పష్టత ఇచ్చారని.. గడపగడప తరుాత సైతం గ్రాఫ్ పెరగక పోతే ఆ స్థానంలో కొత్త వారికి అవకాశం ఇవ్వాల్సి ఉంటుందని చెప్పుకొచ్చారు. ఏ రాజకీయ పార్టీ అయినా ఓడే వాళ్లకు సీటు ఇస్తారా అంటూ నాని ప్రశ్నించారు.
ఇక, మే 10 నుంచి ప్రారంభం కానున్న ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతీ ఎమ్మెల్యే ప్రతీ ఇంటికి వెళ్లి... కరపత్రం..ఒక లేఖ తో వెళ్లి వారికి అందుతున్న పథకాల పైన వివరిస్తారు. ఒకటికి రెండు సార్లు ప్రతీ ఇంటికి వెళ్లాలని సీఎం నిర్దేశించారు. దీంతో..ఇప్పుడు ఎమ్మెల్యేలకు గడప గడపకు వైసీపీ కార్యక్రమం ప్రతిష్ఠాత్మకంగా మారింది.

ఇక ప్రజల్లోనే సీఎం జగన్.. నేతలు
ఇదే సమయంలో సర్వే లెక్కలు సైతం పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. జగన్ పాలనకు ప్రజల నుంచి మద్దతు ఉందనే విషయం సర్వేల్లో వెల్లడి కావటంతో వైసీపీ నేతలకు బిగ్ రిలీఫ్ ఇచ్చింది.
అయితే, ఎమ్మెల్యేల పని తీరు పైన వస్తున్న రిపోర్టులు మాత్రం వారిలో టెన్షన్ కు కారణం అవుతున్నాయి. దీంతో..సీఎం జగన్ ముందుగానే హెచ్చరించటంతో..ఎమ్మెల్యేలు సమర్ధతకు ఈ సమయం సవాల్ గా మారుతోంది. ఇదే సమయంలో..ముఖ్యమంత్రి తీసుకొనే నిర్ణయాలు.. వేయబోతున్న అడుగులు సైతం ఏపీ రాజకీయాల్లో మరింత ఆసక్తిని పెంచుతున్నాయి.