ఏపీలో కరోనా కల్లోలం: 6 లక్షలు దాటిన కేసులు, 72 మంది మృతి, తగ్గుతున్న యాక్టివ్ కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే అత్యధిక కేసులున్న రాష్ట్రాల జాబితాలో రెండో స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా నమోదైన కేసులతో మొత్తం కేసుల సంఖ్య ఆరు లక్షలను దాటింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య శాఖ అధికారులు తాజా బులిటెన్ విడుదల చేశారు.

ఏపీలో ఆరు లక్షలు దాటిన కరోనా కేసులు
గత 24 గంటల్లో ఏపీలో 77,492 నమూనాలను పరీక్షించగా.. 8702 కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,01,462కు చేరింది. తాజాగా, 10,72 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 5,08,088కి చేరింది. ప్రస్తుతం 88,197 యాక్టివ్ కేసులున్నాయి. అయితే, కొత్తగా నమోదువుతున్న కరోనా పాజిటివ్ కేసుల కంటే కోలుకుంటున్నవారి సంఖ్య ఎక్కువగా ఉండటం ఊరటనిచ్చే అంశంగా మారింది.

చిత్తూరులో అత్యధిక కరోనా మరణాలు
ఒక్క రోజు వ్యవధిలో 72 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 5177కు చేరింది. జిల్లాల వారీగా మరణాలు గమనించినట్లయితే.. చిత్తూరులో అత్యధికంగా 12 మంది మరణించారు. ప్రకాశంలో 10, కపడలో 6, గుంటూరు, కర్నూలు, నెల్లూరు జిల్లాలో ఆరుగురు చొప్పున, తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాల్లో ఐదుగురు చొప్పున, అనంతపురం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో నలుగురు చొప్పున, శ్రీకాకుళంలో ఇద్దరు, విజయనగరంలో ఒకరు మరణించారు.

ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యధిక కేసులు
ఇక జిల్లాల వారీగా కొత్త కరోనా కేసులను గమనించినట్లయితే.. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 1383 కేసులు నమోదయ్యాయి. అనంతపురంలో 545, చిత్తూరులో 905, గుంటూరులో 550, కడపలో 637, కష్ణాలో 367, కర్నూలులో 394, నెల్లూరులో 610, ప్రకాశంలో 705, శ్రీకాకుళంలో 567, విశాఖపట్నంలో 449, విజయనగరంలో 526, పశ్చిమగోదావరిలో 1064 కేసులు నమోదయ్యాయి. కాగా, రాష్ట్రంలో ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యధిక కేసులు నమోదవుతుండటం గమనార్హం.

దేశంలో అరకోటి దాటిన కేసులు
దేశ వ్యాప్తంగా కూడా కరోనా పాజిటివ్ కేసులు భారీగానే పెరుగుతున్నాయి. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాల్లోనే అధిక కేసులు నమోదవుతున్నాయి. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 51,41,906 కరోనా కేసులు నమోదు కాగా, 10,17,756 యాక్టివ్ కేసులున్నాయి. 40,39,986 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 83,432 మంది కరోనా బారినపడి మరణించారు.