ఏపీలో తాజాగా 984 కరోనాకేసులు; తిరుమలలో కోవిడ్ నిబంధనలు మరింత కఠినం; సమీక్షలో టీటీడీ చైర్మన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో 24,280 సాంపిల్స్ ని పరీక్షించగా 984 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కరోనా వల్ల ఎటువంటి మరణం సంభవించలేదు అని సమాచారం. ఏపీలోనూ కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో కఠిన ఆంక్షల దిశగా చర్యలు చేపట్టింది ఏపీ ప్రభుత్వం.

గత 24 గంటల్లో 984 కరోనా కేసులు నమోదు, జీరో మరణాలు
గత 24 గంటల్లో 984 కరోనా కేసులు నమోదు కాగా, రాష్ట్రంలో 152 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలోని నమోదైన మొత్తం 20,79,948 పాజిటివ్ కేసులకు గాను 20,59,837 మంది డిశ్చార్జ్ కాగా 14,505 మంది మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనాతో బాధపడుతూ చికిత్స పొందుతున్న యాక్టివ్ కేసుల సంఖ్య 5,606గా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నుండి నేటి వరకు 3,16,30,231 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.

ఏపీలో జిల్లాల వారీగా నమోదైన కేసుల వివరాలివే
గత 24 గంటల్లో జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసుల వివరాలు చూస్తే రాష్ట్రంలో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 244 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక విశాఖపట్నంలో 151 కరోనా కేసులు, తూర్పుగోదావరి జిల్లాలో 117 కరోనా కేసులు, నెల్లూరు జిల్లాలో 81 కరోనా కేసులు, విజయనగరంలో 75 కరోనా కేసులు, గుంటూరు జిల్లాలో 73 కరోనా కేసులు, అనంతపురం జిల్లాలో 65 కరోనా కేసులు, కృష్ణాజిల్లాలో 55 కేసులు, శ్రీకాకుళంలో 47 కేసులు, ప్రకాశం జిల్లాలో 33 కరోనా కేసులు, కడప జిల్లాలో 26 కేసులు, పశ్చిమగోదావరి జిల్లా లో 2 కరోనా కేసులు నమోదయ్యాయి.

వైకుంఠ ద్వార దర్శనం దృష్ట్యా తిరుమలలో కఠిన నిబంధనలు
చిత్తూరు జిల్లాలో విపరీతంగా కరోనా కేసులు పెరిగిన నేపథ్యంలో తిరుమలలోనూ కరోన కఠిన నిబంధనలను అమలు చేయాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వస్తున్న భక్తుల సంఖ్యను దృష్టిలో పెట్టుకొని టీటీడీ కరోనా వ్యాప్తిని అరికట్టడం కోసం తగిన చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. వైకుంఠ ద్వార దర్శనం దృష్ట్యా తిరుమలలో నిబంధనలను మరింత కఠినంగా అమలు చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వై వి సుబ్బారెడ్డి ఈ మేరకు అధికారులను ఆదేశించారు.

అధికారులతో సమీక్ష నిర్వహించిన టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి
తిరుమలలోని తన క్యాంపు కార్యాలయంలో కొవిడ్ మార్గదర్శకాలపై అదనపు ధర్మారెడ్డి తదితర అధికారులతో సమీక్ష నిర్వహించిన టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి కరోనా వ్యాప్తి నేపధ్యంలో భద్రత చర్యలపై అధికారులతో మాట్లాడారు. ఈనెల 13న వైకుంఠ ఏకాదశి 14న ద్వాదశి తో పాటుగా మిగిలిన ఎనిమిది రోజులు భక్తులు ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండే విధంగా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించారు.

వైకుంఠ ద్వారా దర్శనం నేపధ్యంలో తగిన చర్యలకై ఆదేశం
వైకుంఠ ద్వార దర్శనం నేపథ్యంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, తదనుగుణంగా చర్యలు తీసుకోవాలి సూచించిన ఆయన జన సమూహం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, క్యూలైన్లు, శ్రీవారి ఆలయంలో శానిటైజర్ లను అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు.ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్కులు ధరించి ఎలా చర్యలు తీసుకోవాలని, భక్తులకు అవగాహన కల్పించడంతోపాటుగా, నిబంధనలు పాటించని వారిపై కఠినంగా వ్యవహరించాలని వై వి సుబ్బారెడ్డి పేర్కొన్నారు. కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో తిరుమలకు వచ్చే భక్తుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని, కరోన నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని వై.వి.సుబ్బారెడ్డి పేర్కొన్నారు