విషాదం: చెరువులోకి దూసుకెళ్లిన కారు, నలుగురు మృతి
గుంటూరు: జిల్లాలోని మంగళగిరి మండలంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఎర్రబాలెం చెరువులో కారు దూసుకెళ్లింది. దీంతో కారులోని నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. కృష్ణాయపాలెం నుంచి నలుగురు వ్యక్తులు కారులో వస్తుండగా.. ఎర్రబాలెం చెరువు మలుపు వద్దకు రాగానే కారు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లింది.
ఈ ప్రమాదంలో కారులో ఉన్న సాయి, శ్రీనివాస్, నరేంద్ర కుమార్, తేజ రాంజీగా అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు వెంటనే స్పందించి కారు అద్దాలు పగలగొట్టి నలుగురిని బయటకు తీయగా, అందరూ విగత జీవులుగా ఉన్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులంతా మంగళగిరికి చెందినవారిగా గుర్తించారు.
మరో విషాద ఘటన: కాలువలో పడి ఇద్దరు మృతి
సంక్రాంతి పండగపూట విషాద ఘటన చోట చేసుకుంది. కాల్వలోకి స్నానానికి దిగిన ఆరుగురు యువకుల్లో ఇద్దరు నీటమునిగి మరణించారు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం రాజవరంలో చోటుచేసుకుంది. రాజవరం గ్రామ శివారులో ఉన్న ఎర్ర కాలువలో ప్రమాదవశాత్తు ఇద్దరు యువకులు నీటమునిగి చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. సంక్రాంతి పండుగ కావడంతో జంగారెడ్డిగూడెం మండలం కేతవరం గ్రామానికి చెందిన ఆరుగురు స్నేహితులు రాజవరంలో ఉన్న ఎర్ర కాల్వ వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో అంతా కలిసి కాల్వలోకి స్నానానికి దిగారు.

వీరిలో జెట్టి ముఖేష్( 21) జెట్టి గణేష్ (20) లోతులోకి వెళ్లారు. ఈత రాకపోవడం, కాల్వ లోతు ఎక్కువగా ఉండటంతో ఇద్దరూ ఊపిరాడక మృతి చెందారు. మిగతా నలుగురు స్నేహితులు గట్టుపైకి చేరారు. వెంటనే ఆ నలుగురు యువకులు గ్రామస్థులకు సమాచారం ఇచ్చారు. గ్రామస్థులంతా అక్కడికి చేరుకొని ఇద్దరు యువకులు మృతదేహాలను బయటకు తీశారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కొయ్యలగూడెం పోలీసులు తెలిపారు. పండగపూట ఇద్దరు యువకుల మరణంతో ఆ రెండు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. గ్రామంలోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి.