తిరుమల వెంకన్నకు రూ. కోట్ల విలువ చేసే ఆస్తి మొత్తం వీలునామాగా రాసిచ్చిన హైదరాబాద్ భక్తుడు
Tirumala: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. సోమవారం నాడు 80,130 మంది భక్తులు శ్రీవారి దర్శించుకున్నారు. వారిలో 26,786 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్కరోజే హుండీ ద్వారా 4.55 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 18 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 10 నుంచి 12 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లు, క్యూ లైన్లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అన్న ప్రసాదం, అల్పాహారం, పాలు, మంచినీరు పంపిణీ చేశారు.

హైదరాబాద్ కు చెందిన రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి వైవీఎస్ఎస్ భాస్కర్ రావు తన మరణానంతరం వీలునామా ద్వారా టీటీడీకి మూడు కోట్ల విలువైన ఇళ్లు, బ్యాంకు ఖాతాల్లో దాచుకున్న 66 లక్షల రూపాయలను విరాళంగా అందించి శ్రీవారిపై తనకు ఉన్న అచంచలమైన భక్తిని చాటుకున్నారు.
భాస్కర్ రావుకు హైదరాబాద్ వనస్థలిపురం ప్రాంతంలో ఉన్న ఆనంద నిలయం పేరుతో 3,500 చదరపు అడుగులు గల భవనం ఉంది. దీన్ని ఆధ్యాత్మిక కార్యకలాపాల కోసం ఉపయోగించాలన్న ఉద్దేశంతో దీన్ని టీటీడీకి విరాళంగా ఇస్తున్నట్లు వీలునామాలో పేర్కొన్నారు.
తను బ్యాంకులో దాచుకున్న సొమ్మును టీటీడీ శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు రూ.36 లక్షలు, శ్రీ వేంకటేశ్వర సర్వ శ్రేయాస్ ట్రస్టుకు రూ.6 లక్షలు, శ్రీ వేంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్టుకు రూ.6 లక్షలు, శ్రీ వేంకటేశ్వర గో సంరక్షణ ట్రస్టుకు రూ.6 లక్షలు, శ్రీవేంకటేశ్వర విద్యాదాన ట్రస్టుకు రూ.6 లక్షలు, శ్రీవాణి ట్రస్టుకు రూ.6 లక్షలు విరాళంగా అందివ్వాలని సంకల్పించారు.
తన జీవితాంతం శ్రీవేంకటేశ్వరస్వామి సేవలో అంకితమై ఉండాలని ఆకాంక్షించిన భాస్కర్ రావు అంతిమ కోరిక మేరకు ఆయన మరణానంతరం ట్రస్టీలు ఎం దేవరాజ్ రెడ్డి, వీ సత్యనారాయణ, బీ లోకనాథ్.. ఈ వీలునామా ప్రకారం టీటీడీకి చెందాల్సిన ఆస్తి పత్రాలు, చెక్కులను శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు కార్యినిర్వహణాధికారి సీహెచ్ వెంకయ్య చౌదరికి అందజేశారు.
హైదరాబాద్ కు చెందిన ట్రినిటీ కంబైన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ టీటీడీ శ్రీవేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు గురువారం 2 కోట్ల రూపాయల విరాళాన్ని అందించింది. ఈ మొత్తంతో కూడిన రెండు వేర్వేరు చెక్కులను ఆ సంస్థ ప్రతినిధులు తిరుమలలోని రంగనాయకుల మండపంలో వెంకయ్య చౌదరికి డీడీ రూపంలో అందజేశారు. ఈ సందర్భంగా దాతలను ఆయన అభినందించారు.












Click it and Unblock the Notifications