చిత్తూరులో యువతి ప్రాణాలు తీసిన ప్రేమోన్మాది ఢిల్లీ బాబు .. చివరకు విగతజీవిగా, విషాదాంతంగా !!
చిత్తూరు జిల్లాలో యువతి ప్రాణాలను బలి తీసుకున్న ప్రేమోన్మాది ఢిల్లీ బాబు చివరకు ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు. పెనుమూరు మండలం తూర్పు పల్లి అడవిలో ఉరేసుకుని నిందితుడు ఢిల్లీ బాబు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తనను ప్రేమించి, రహస్యంగా పెళ్లి చేసుకుని, ఆ తర్వాత తల్లిదండ్రుల వద్దే ఉంటానంటూ తనను దూరం చేసి మోసం చేసిందని భావించిన ఢిల్లీ బాబు, యువతిని దారుణంగా కత్తితో దాడి చేసి హతమార్చాడు. ఆ తర్వాత అక్కడి నుండి పారిపోయిన ఢిల్లీ బాబు తాను ఆత్మహత్యకు పాల్పడి విగత జీవిగా మారాడు.
కత్తితో విచక్షణారహితంగా ప్రేమోన్మాది దాడి; యువతి మృతి .. చిత్తూరు జిల్లాలో దారుణం

ఢిల్లీ బాబును పెళ్లి చేసుకుని , మళ్ళీ వద్దన్న గాయత్రి
చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం తూర్పు పల్లెకు చెందిన గాయత్రి , పూతలపట్టు మండలం చింతమాకుల పల్లి కి చెందిన ఢిల్లీ బాబు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. కులాలు వేరు కావడంతో పెద్దలకు తెలియకుండా రహస్యంగా తిరుపతిలో పెళ్లి చేసుకున్నారు. గాయత్రి తల్లిదండ్రులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు, ఢిల్లీ బాబును, గాయత్రిని పిలిపించిన పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు. పోలీసుల కౌన్సిలింగ్ తర్వాత గాయత్రి ఢిల్లీ బాబుని కాదని తల్లిదండ్రులతో ఉండటానికి నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ బాబుని దూరం పెట్టింది.

గాయత్రిని కత్తితో పొడిచిన కక్ష పెంచుకున్న ఢిల్లీ బాబు .. ఆపై పరారీ
దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఢిల్లీ బాబు, గాయత్రి పై ద్వేషాన్ని పెంచుకుని నిన్న ఆమెపై కత్తితో దాడి చేసి పారిపోయాడు. కత్తితో ఆమె కడుపులో 10 సార్లు పొడిచాడు . తీవ్ర గాయాలపాలైన గాయత్రిని ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలో మృతి చెందింది. గాయత్రిని కత్తితో దాడి చేసి పరారైన ఢిల్లీ బాబు కోసం వెతుకుతున్న పోలీసులకు గాగమ్మ వారి పల్లె సమీపంలో ఢిల్లీ బాబు బైక్ కనిపించింది. ఢిల్లీ బాబు బైక్ ని అక్కడే వదిలేసి సమీప అటవీ ప్రాంతంలోకి పారిపోయినట్లు గా గుర్తించిన పోలీసులు, అటవీ ప్రాంతంలో వెతకటం ప్రారంభించారు .

గాయత్రి మృతి , ఢిల్లీ బాబు ఆత్మహత్య .. రెండు కుటుంబాల్లో తీరని విషాదం
ఢిల్లీ బాబు కోసం వెతుకుతున్న క్రమంలో తూర్పు పల్లి అడవిలో చెట్టుకు ఉరి వేసుకున్న ఢిల్లీ బాబు మృతదేహం కనిపించింది. పోలీసులు మృతదేహాన్ని కిందికి దించి, పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ప్రేమను నిరాకరించిన కారణంతో గాయత్రి అనే యువతిని హతమార్చిన ఢిల్లీ బాబు, చివరకు తాను కూడా ఆత్మహత్యకు పాల్పడి విగత జీవిగా మారాడు. అనాలోచిత నిర్ణయాలతో గాయత్రి, ఢిల్లీ బాబు సాగించిన ప్రేమ కథ చివరకు విషాదాంతంగా మిగిలింది.
రెండు కుటుంబాల్లో తీరని శోకం మిగిల్చింది.