• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పెళ్లి కాని కుర్రాడితో సహజీవనం చేస్తోందని...ఆమెని పెట్రోల్ పోసి తగులబెట్టారు

By Suvarnaraju
|

కాకినాడ:ఆమె మనస్పర్ధల కారణంగా భర్త నుంచి విడిపోయింది...ఆ క్రమంలో ఒక అవివాహితుడితో ప్రేమలో పడింది...అది సహజీవనం వరకూ దారితీసింది. అయితే ఈ వ్యవహారంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఆ యువకుడి తల్లిదండ్రులు అతడికి నచ్చచెప్పి తమతో తీసుకెళ్లిపోయారు.

అయితే ఈ కుర్రాడిని అతడి తల్లిదండ్రులే తీసుకువెళ్లుంటారని భావించిన ఆమె ఏకంగా ఆ యువకుడి ఇంటికే వెళ్లింది. అతడు తనిని పెళ్లి చేసుకున్నాడని, తనతో పాటు పంపించేయమని గొడవ పడింది. దీంతో రగిలిపోయిన ఆ యువకుడి తల్లిదండ్రులు ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆమె ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య పోరాడుతోంది. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది.

పోలీసుల కథనం ప్రకారం...కరప మండలం గురజనాపల్లి గ్రామానికి చెందిన 21 ఏళ్ల రావుల మల్లేశ్వరికి స్థానిక చొల్లంగికి చెందిన అప్పారావుతో ఏడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి మూడేళ్ల కుమార్తె కూడా ఉంది. అయితే భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తడంతో ఏడాది క్రితం ఈ దంపతులు విడిపోయారు. అప్పటి నుంచి మల్లీశ్వరి తన కుమార్తెతో పాటు గురజనాపల్లిలోని పుట్టింటిలోనే ఉంటోంది.

A married woman living together with unmarried boy...his parents burnt her with petrol

అయితే ఉపాధి కోసం మల్లీశ్వరి ఫంక్షన్లలో వంట సామగ్రి శుభ్రపరిచే పనులకు వెళుతూ జీవనం కొనసాగించేది. ఈ క్రమంలో ఆమెకు వంట సామగ్రిని తరలించే ఆటో డ్రైవర్‌ కాకినాడ జగన్నాథపురం చినమార్కెట్‌ వీధికి చెందిన బొడ్డు గంగాధ్రి అలియాస్‌ బాబీతో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా సాన్నిహిత్యానికి... ఆ తర్వాత సహజీవనానికి దారి తీసింది.

ఈ నేపథ్యంలో వీరిద్దరూ గత ఆరు నెలలుగా కాకినాడ రూరల్‌ మండలం సర్పవరంలోని పూలమార్కెట్‌ సమీపంలో ఒక ఇల్లు అద్దెకు తీసుకుని కాపురం ఉంటున్నారు. అయితే ఉన్నట్టుండి బాబి వారం రోజులుగా మల్లీశ్వరి వద్దకు రావడం లేదు. దీంతో అతడి తల్లిదండ్రులే తన ప్రియుడ్ని రాకుండా ఆపేసి ఉంటారని మల్లీశ్వరి భావించింది. ఈ నేపథ్యంలో మల్లీశ్వరి సోమవారం తన తల్లి కుమారిని తీసుకుని రామారావుపేటలోని బాబి ఇంటికి వెళ్లింది. కానీ అక్కడ బాబి కనిపించకపోయేసరికి అతడిని తనతో పంపాలంటూ అతడి తల్లిదండ్రులైన అమ్మాజీ, కామేశ్వరరావులను అడిగింది.

దీంతో ఆగ్రహం చెందిన బాబి తల్లిదండ్రులు పెళ్లి కావాల్సిన కుర్రాడిని నీతో ఎందుకు పంపుతాము...అది కుదరదని తెగేసి చెప్పారు. దీంతో ఇరువర్గాల మధ్య అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. అనంతరం బాబి తల్లిదండ్రులు కోపంతో రగిలిపోయి సమీపంలో బాటిల్‌లో ఉన్న పెట్రోల్‌ను మలీశ్వరిపై పోసి నిప్పంటించారు. దాంతో ఆమె దేహం కాలిపోతూ బాధితురాలు హాహాకారాలు చేస్తూ పరుగులు తీస్తూ కుప్పకూలిపోయింది.

గొడవను గమనిస్తున్న స్థానికులు బాధితురాలు మల్లీశ్వరిని జీజీహెచ్‌కు తరలించగా ఆమె అక్కడ చికిత్స పొందుతోంది. 85శాతం కాలిపోయిన నేపథ్యంలో ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు జీజీహెచ్‌ అత్యవసర విభాగ వైద్యులు తెలిపారు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు వన్‌టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

English summary
The young man parents poured petrol and burnt a woman who was living together with their unmarried son on Monday in Kakinada.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X