విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జర్నలిస్టు-స్మగ్లర్: రూ. 100 కోట్ల మోసాలు, చనిపోయినట్లూ నమ్మించాడు

|
Google Oneindia TeluguNews

విజయవాడ: అతను తన జీవితాన్ని బాధ్యతాయుతమైన ఓ జర్నలిస్టుగా ప్రారంభించాడు. ఆ తర్వాత రియల్టర్ అవతారం ఎత్తి, రాజకీయ నేతలతో పరిచయం పెంచుకుని రూ. కోట్లలో మోసాలకు పాల్పడ్డాడు. నకిలీ సంస్థలు ఏర్పాటు చేసి సుమారు రూ. వంద కోట్లకు పైగానే మోసాలకు పాల్పడ్డాడు. ఈ మధ్య కాలంలోనే గంజాయి స్మగ్లింగ్ చేస్తూ రూ. కోట్లు గడించాడు. అంతేగాక, తన మోసాలన్నీ బయటపడటంతో తప్పించుకునేందుకు తాను చనిపోయినట్లు కూడా చిత్రీకరించుకునే యత్నాలు కూడా చేశాడు. చివరకు బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. అతడి ఆట కట్టించి కటకటాల వెనక్కి నెట్టారు.

పోలీసుల కథనం ప్రకారం.. నిందితుడు నార్ల వంశీకృష్ణ జర్నలిస్టుగా ప్రయాణం మొదలుపెట్టి.. 2006 నుంచి రియల్‌ వ్యాపారం చేసి రూ. కోట్లు గడించాడు. విజయవాడ నగరం సత్యనారాయణపురంతో పాటు పలు ప్రాంతాల్లో అపార్ట్‌మెంట్లలో ఫ్లాటు కొనుగోలు చేసి వాటిని బ్యాంకుల్లో తనఖా పెట్టి తర్వాత ఒకరికి తెలియకుండా మరొకరికి విక్రయించేవాడు. ఇలా విజయవాడ కమిషనరేట్‌లోని కృష్ణలంక, గవర్నర్‌పేట, మాచవరం, సూర్యారావుపేట, పటమట, వన్‌టౌన్‌తోపాటు గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్‌ స్టేషన్లలో 13 చీటింగ్‌ కేసులు నమోదయ్యాయి.

2011లో తెనాలి సమీపంలోని బకింగ్‌హాం కాలువలో తన కారును తోసి తాను ప్రమాదవశాత్తు చనిపోయినట్లు చిత్రీకరించుకునే యత్నం చేశాడు. కొంతకాలం అజ్ఞాతంలో ఉండటంతో ఇది నిజమని బాధితులు నమ్మారు. చివరకు అతడు బతికేఉన్నాడని తెలుసుకుని 2013లో కృష్ణలంక పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అతడ్ని అరెస్ట్‌ చేశారు. కృష్ణలంక స్టేషన్‌లో నమోదయిన కేసులో కేసు రుజువు కావటంతో ఆరు నెలలు శిక్ష పడింది.

A smuggler arrested in Vijayawada

స్మగ్లింగ్‌కు దారితీసిన జైలు పరిచయాలు

వంశీకృష్ణ జైలులో ఉండగా అంతర జిల్లాల గంజాయి స్మగ్లర్లతో పరిచయాలు ఏర్పడ్డాయి. అక్కడి నుంచి విడుదలైన వంశీకృష్ణ చాలాకాలం అజ్ఞాతంలోనే ఉన్నాడు. 2015 ఆక్టోబర్‌ నుంచి స్మగ్లర్‌ అవతారం ఎత్తాడు. విశాఖపట్నం జిల్లా చింతపల్లిలో గంజాయి సాగుదారులతో నేరుగా మాట్లాడుకొని అమ్మకాలు ప్రారంభించాడు. చింతపల్లిలో కొనుగోలు చేసి విజయవాడ, తర్పూగోదావరి, ఢిల్లీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు సరఫరా చేసి విక్రయాలు సాగించాడు.

ఇలా ఏడాదిలోనే రూ.8 నుంచి 10 కోట్లు విలువ చేసే గంజాయిని విక్రయించాడు. 2015లో ఇతనిపై గంజాయి కేసులు మొదలయ్యాయి. ఢిల్లీలోని వసంత్‌విహార్‌ స్టేషన్‌లో వెయ్యి కిలోల గంజాయి కేసు, ఈ ఏడాది జనవరి 22న కొండపల్లిలో మూడు వేల కిలోల గంజాయి కేసు, మార్చి 27న తూర్పుగోదావరి జిల్లా డొంకరాయిలో వెయ్యి కిలోల కేసు, విజయవాడ పటమట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని భారతీ‌నగర్‌లో, మాచవరం పోలీస్‌ స్టేషన్‌లో, ఇబ్రహీంపట్నంలలో మొత్తం కలిపి ఆరు కేసులు నమోదయ్యాయి.

రిమాండ్

రెండు నెలల కిందట ఢిల్లీ నుంచి నార్కోటిక్స్‌ బృందం వంశీకృష్ణ విచారణ కోసం విజయవాడ రావడంతో పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వంశీకృష్ణ తల్లి కోర్టులో సెర్చ్‌ వారెంట్‌ పిటిషన్‌ వేయడంతో నేరుగా న్యాయస్థానం ఎదుట సోమవారం ఉదయం హాజరుపర్చారు. వాస్తవానికి నాలుగో ఏసీఎంఎం కోర్టులో హాజరుపరచాల్సి ఉండగా పోలీసుల ఒత్తిడి ఎక్కువగా ఉందని న్యాయవాదులు మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ న్యాయమూర్తి ఎదుట రెండు కేసుల్లో హాజరుపరిచారు.

మిగిలిన కేసులు నిమిత్తం జులై 29న నాలుగో ఏసీఎంఎం కోర్టులో హాజరుపర్చాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఢిల్లీ, తూర్పుగోదావరి జిల్లాల కేసుల్లో అరెస్ట్‌ కావాల్సి ఉంది. కాగా, గంజాయి కలిగిఉన్న కేసులో నిందితుడు నార్ల వంశీకృష్ణకు జులై 29 వరకు రిమాండ్‌ విధిస్తూ నగర మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జి ఆర్‌ నిరంజన్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, తన కుమారుడు ఏ నేరం చేయలేదని పోలీసులు అన్యాయంగా అరెస్టు చేసి అన్ని గంజాయి కేసులు ఒప్పుకోమని వేధింపులకు గురిచేశారని వంశీ తల్లి ఆరోపించారు.

English summary
A smuggler arrested in Vijayawada.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X