
విషాదం: పబ్జీ గేమ్ ఓడిపోవడంతో స్నేహితుల హేళన.. 16 ఏళ్ల బాలుడు ఆత్మహత్య
కృష్ణా: మచిలీపట్నంలో పబ్జీ గేమ్ ఓ బాలుడి ప్రాణం తీసింది. పబ్జీ గేమ్ ఓడిపోయావని తోటి పిల్లలు హేళన చేయడంతో మనస్తాపానికి గురైన బాలుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బాలుడి మరణంతో అతడి కుటుంబంతోపాటు స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.
వివరాల్లోకి వెళితే.. స్థానిక కాంగ్రెస్ పార్టీ నేత శాంతిరాజ్ కుమారుడు ప్రభు(16) కొంత కాలంగా పబ్జీ ఆడుతున్నాడు. ఆదివారం కూడా ఇలాగే స్నేహితులతో కలిసి పబ్జీ ఆడాడు. అయితే, ఆటలో అతడు ఓడిపోవడంతో తోటి స్నేహితులు హేళన చేశారు. దీంతో ప్రభు మనస్తాపానికి గురయ్యాడు.

ఇంటికి వెళ్లి గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉదయం ఎంతకీ గదిలోనుంచి వెలుపలికి రాకపోవడంతో తండ్రి వెళ్లి చూశారు. ఫ్యాన్‌కు కొడుకు మృతదేహం వేలాడుతూ కనిపించడంతో ఆ తండ్రి ఒక్కసారిగా షాక్ గురై సొమ్మసిల్లిపడిపోయాడు. కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
కాగా, ఆత్మహత్య విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు తాంతియా కుమారి బాధిత కుటుంబసభ్యులను పరామర్శించారు. ప్రభు మృతదేహానికి నివాళులర్పించారు. చిన్నతనంలోనే ప్రభు తనువు చాలించడంపై ఆవేదన వ్యక్తం చేశారు. జీవితాలను బలిగొంటున్న పబ్జీ తరహా గేమ్‌లను పూర్తిగా నిషేధించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే, ఇప్పటికే పబ్జీపై దేశంలో నిషేధం విధించిన విషయం తెలిసిందే.