తిరుమల శ్రీవారి ఆలయం ఎదుటే ఐదేళ్ళ బాలుడిని కిడ్నాప్ చేసిన మహిళ
తిరుమల శ్రీవారి ఆలయం ఎదుట ఒక బాలుడు కిడ్నాప్ అయిన ఘటన కలకలం రేపుతుంది. తిరుమలలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడానికి భక్తులు తిరుమలకు పోటెత్తుతున్నారు. ఈ క్రమంలో తాజాగా శ్రీవారి ఆలయానికి వచ్చిన, అక్కడ ఆలయానికి ఎదురుగా కూర్చున్న 5 ఏళ్ల బాలుడు కిడ్నాప్ గురవడం స్థానికంగా ఆందోళన కలిగించింది.
తిరుపతి దామినేడుకు చెందిన గోవర్ధన్ రాయల్ అనే ఐదు సంవత్సరాల బాలుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఎదుట కిడ్నాప్ కు గురయ్యాడు. ఆదివారం సాయంత్రం 5 .45 నిమిషాలకు బాలుడి కిడ్నాప్ ఘటన చోటుచేసుకుంది . సైలెంట్ గా వచ్చిన ఒక మహిళ బాలుడిని ఎత్తుకొని అక్కడినుండి ఉడాయించింది . శ్రీవారి ఆలయం ఎదురుగా బాలుడు కూర్చుని ఉండగా మహిళ బాలుడిని కిడ్నాప్ చేసింది. అప్పటివరకు తమతో ఉన్న కుమారుడు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు లబోదిబోమన్నారు.

ఇక బాలుడు కిడ్నాప్ ఘటనపై బాలుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు బాలుడి కోసం గాలింపు చేపట్టారు. బాలుడిని కిడ్నాప్ చేసిన మహిళ తిరుపతి వెళ్లి ఏపీ 03 జెడ్ 0300 నెంబర్ గల ఆర్టీసీ బస్సులో ప్రయాణించినట్లు పోలీసులు గుర్తించారు. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా మహిళను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
ఈ మహిళ ఎవరు? ఎక్కడి నుండి వచ్చింది? బాలుడిని ఎందుకు కిడ్నాప్ చేసింది? మహిళకు ఆ కుటుంబానికి ఏమైనా సంబంధం ఉందా? లేదా ఎవరైనా చైల్డ్ ట్రాఫికింగ్ కు పాల్పడుతున్న మహిళనా ? అన్న కోణంలో పోలీసులు ఈ కిడ్నాప్ కేసును దర్యాప్తు చేస్తున్నారు. బాలుడి జాడ తెలిస్తే 9440796769, 9440796772 నంబర్లకు ఫోన్ చేయాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. తిరుపతిలో ఉన్న రద్దీదృష్ట్యా తల్లిదండ్రులు పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలని అటు పోలీసులు, టిటిడి అధికారులు సూచిస్తున్నారు.