చంద్రబాబుకు తోడు దొరికినట్లేనా ? మున్సిపల్ పోరులో సీపీఐతో పొత్తు-జనసేనతో అవగాహన ?
ఏపీలో మున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఎన్నికల నేపథ్యంలో గతంలో పొత్తు లేకుండా బరిలోకి దిగి సార్వత్రిక ఎన్నికల్లో చేతులు కాల్చుకున్న చంద్రబాబు ఈసారి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అందుకే ఎక్కడా పొత్తన్న మాట లేకుండానే ఇతర పార్టీల మద్దతు తీసుకుంటున్నారు. అవకాశం ఉన్న చోట వారికి మద్దతిచ్చేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో గతంలో టీడీపీకి వ్యతిరేకంగా జట్టు కట్టిన పార్టీలు సైతం ఈ ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా బాబుకు మద్దతిచ్చేందుకు సిద్ధపడుతున్నాయి. విజయవాడ, గుంటూరు, విశాఖతో పాటు పలు చోట్ల ఇప్పుడు ఇదే పరిస్ధితి కనిపిస్తోంది.
మున్సిపల్ పోరులోనూ ఏకగ్రీవాల జోరు- కడప రికార్డులు- పులివెందుల క్లీన్‌స్వీప్

రసకందాయంలో మున్సిపల్ పోరు
ఏపీ మున్సిపల్ పోరులో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేసి దెబ్బతిన్న విపక్షాలు ఇప్పుడు తెరవెనుక సహకరించుకునేందుకు సిద్ధమవుతున్నాయి. కొన్ని చోట్ల ప్రత్యక్షంగా, మరికొన్ని చోట్ల పరోక్షంగా సహకారం అందించుకుంటున్నాయి. ముఖ్యంగా ప్రధాన విపక్షం టీడీపీకి సహకరించేందుకు సీపీఐ, జనసేన వంటి పార్టీలు సిద్ధం కావడం ఏపీ రాజకీయాల్లో కీలక మలుపుగా మారుతోంది. ప్రధాన కార్పోరేషన్ల ఎన్నికలతో పాటు మున్సిపాల్టీల్లోనూ ఇప్పుడు ఇదే పరిస్ధితి కనిపిస్తోంది. ఇది భవిష్యత్ రాజకీయాలకు సంకేతంగా కూడా మారబోతోంది.

టీడీపీకి మద్దతిస్తున్న సీపీఐ, జనసేన
మున్సిపల్ పోరులో ఇతర విపక్షాలతో పాటు క్షేత్రస్దాయిలో క్యాడర్, బలం, బలగం ఉన్న ఏకైక పార్టీ టీడీపీ మాత్రమే. దీంతో ఇప్పుడు సీపీఐ, జనసేన వంటి పార్టీలు తాము బలంగా లేని చోట టీడీపీకి మద్దతివ్వడం ద్వారా ఉమ్మడి ప్రత్యర్ది వైసీపీని దెబ్బతీసేందుకు వ్యూహరచన చేస్తున్నాయి. దీని ప్రభావం విజయవాడ, గుంటూరు, విశాఖ వంటి ప్రధాన కార్పోరేషన్లలో ఇప్పటికే కనిపిస్తోంది. సీపీఐ నేరుగా టీడీపీతో క్షేత్రస్ధాయిలో స్ధానికంగా పొత్తు పెట్టుకుని బరిలోకి దిగుతుండగా.. జనసేన మాత్రం టీడీపీతో అవగాహనతో పనిచేస్తు్న్న పరిస్ధితులు కనిపిస్తున్నాయి. టీడీపీ నేతలు కూడా ఆయా పార్టీలకు బలం ఉన్న చోట మద్దతిచ్చేందుకు సిద్ధపడుతున్నారు.

మళ్లీ పొత్తుల బాటలో చంద్రబాబు
టీడీపీ ఆవిర్భావం నుంచి దాదాపు ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకునే ఎన్నికల బరిలోకి దిగి విజయాలు సాధించింది. ఎన్నికల సమయంలో తమ బలాబలాలతో సంబంధం లేకుండా భావసారూప్యం ఉన్న పార్టీలతో పొత్తులు పెట్టుకోవడం టీడీపీకి అలవాటే. అయితే ఈ పొత్తులు కొన్నిసార్లు టీడీపీకి అదికారం కట్టబెట్టగా.. మరికొన్ని సార్లు అధికారానికి దూరం చేశాయి. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో అయితే అధికారంలో ఉంటూ ఎన్నికలకు వెళ్లిన చంద్రబాబుతో పొత్తుకు కమ్యూనిస్టులతో పాటు జనసేన కూడా నిరాకరించాయి. సొంతంగా పోరాడాయి. అయితే ఇది ఇరువురికీ నష్టం చేసింది. వైసీపీ ఘన విజయాన్ని అందుకుంది. దీంతో ఈసారి చంద్రబాబు అలాంటి తప్పిదాలకు చోటివ్వకుండా స్దానిక ఎన్నికలు కాబట్టి స్ధానికంగానే పొత్తులు, అవగాహనలత ముందుకెళ్తున్నారు.

వైసీపీకి ఉమ్మడి ప్రత్యర్ధులుగా టీడీపీ, జనసేన, సీపీఐ
ప్రస్తుతం అధికార బలం, అంగబలం, అర్ధబలంతో చెలరేగిపోతున్న వైసీపీని ఎదుర్కోవాలంటే వ్యూహాత్మక పొత్తులు తప్పనిసరి. అదే సమయంలో విపక్షాలన్నింటికీ వైసీపీ ప్రధాన శత్రువుగా కనిపిస్తోంది. దీంతో ఉమ్మడిగా ముందుకు సాగితే తప్ప వైసీపీని సమర్ధంగా ఎధుర్కోవడం కష్టమన్న భావన వారిలో కనిపిస్తోంది. కాబట్టి తమకు బలమున్న చోట సొంతంగా పోటీ చేస్తూ ఇతర పార్టీల మద్దతు తీసుకోవడం, మిత్రులు బలంగా ఉన్న చోట వారికి మద్దతునిచ్చి గెలిపించడం ఇప్పుడు టీడీపీ, సీపీఐ, జనసేనకు తప్పనిసరిగా మారిపోయింది. దీంతో కీలకమైన నగరపాలక, పురపాలక సంస్ధల్లో ఈ మూడు పార్టీలు అవగాహనతో పనిచేస్తున్నాయి.