ఉప రాష్ట్రపతి సహా - పెద్దల సభలో కొత్త ఈక్వేషన్ : సీఎం జగన్ నిర్ణయంతో..!!
రాజ్యసభలో వైసీపీ సభ్యుల సంఖ్య పెరిగింది. రాష్ట్రం నుంచి టీడీపీకి చెందిన ఇద్దరు సభ్యులే ఇప్పుడు సభలో కొనసాగనున్నారు. అయితే, ఇదే సమయంల మరో అరుదైన సందర్భం చోటు చేసుకుంటోంది. వైసీపీ నుంచి తాజాగా నలుగురు అభ్యర్దులను సీఎం జగన్ ఖరారు చేసారు. అందులో విజయ సాయిరెడ్డికి రెన్యువల్ కాగా.. బీదా మస్తాన రావు.. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఇద్దరికి అవకాశం దక్కింది. అయితే, ఇప్పుడు రెన్యువల్ పొందిన విజయ సాయిరెడ్డితో పాటుగా కొత్త సభ్యుడు కాబోతున్న బీదా మస్తాన రావు సైతం నెల్లూరు జిల్లాకు చెందిన వారే.

సీఎం జగన్ తాజా నిర్ణయంతో
విజయ సాయిరెడ్డి సొంత జిల్లా సైతం నెల్లూరు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, తాళ్లపూడికి చెందిన సాయిరెడ్డి 2016 నుంచి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఇక ఇదే జిల్లాకు చెందిన బీదా మస్తాన రావు అల్లూరు మండలం.. ఇస్కపల్లి గ్రామానికి చెందిన వారు. జెడ్పీటీసీ గా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆయన 2004 ఎన్నికల్లో అల్లూరు నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. 2009 ఎన్నికల్లో కావలి నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014-19 మధ్య ఆంధ్రప్రదేశ్ రాజధాని డెవలప్మెంట్ అథారిటీ సలహా సభ్యులుగా పనిచేశారు. 2019లో నెల్లూరు లోక్సభ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

ఉపరాష్ట్రపతితో సహా.. ఆరుగురు సభ్యులు
ఇక, ఇదే జిల్లా నుంచి ఇప్పటికే రాజ్యసభ లో ఇద్దరు..లోక్ సభలో ఇద్దరు వైసీపీ నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాజ్యసభలో విజయ సాయిరెడ్డి.. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉండగా.. లోక్ సభ లో నెల్లూరు ఎంపీ ఆదాల, ఒంగోలు ఎంపీ మాగుంట లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే, సుదీర్ఘ కాలం రాజ్యసభ సభ్యుడిగా..కేంద్ర మంత్రిగా పని చేసి..ప్రస్తుతం ఉప రాష్ట్రపతి హోదాలో ఉన్న వెంకయ్య నాయుడు సైతం నెల్లూరు జిల్లా వాసే. దీంతో..నెల్లూరు జిల్లా నుంచి రాజ్యసభ - లోక్ సభలో ఆరుగురికి అవకాశం లభించింది. 2019 ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. మొత్తం 10 స్థానాలు గెలుచుకుంది.

బీదా మస్తానరావు ఎంపికతో
టీడీపీలో పార్టీ అధినేత చంద్రబాబు కోటరీలో కీలకంగా పని చేసిన బీదా మస్తాన రావుకు గతంలో ఇచ్చిన హామీ మేరకు వైసీపీలో చేరారు. వైసీపీ ముఖ్యనేత విజయ సాయిరెడ్డితో ఉన్న సత్సంబంధాలతో ఆయన వైసీపీలో చేరారు. ఇప్పుడు కోరుకున్న విధంగానే వైసీపీ నుంచి పెద్దల సభలో అడుగు పెట్టటం లాంఛనమే. ఉపరాష్ట్రపతితో సహా ఒకే జిల్లా నుంచి పార్లమెంట్ లో ఈ స్థాయిలో ప్రాతినిద్యం దక్కటం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తి కర చర్చకు కారణమవుతోంది.