గన్నవరం పంచాయతీ ఒట్టిదే-నియోజకవర్గ సమస్యలపైనే వెళ్లా-వంశీ కీలక వ్యాఖ్యలు
గన్నవరంలో టీడీపీ నుంచి వైసీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి, ఆయన ప్రత్యర్ధులకు మధ్య నెలకొన్న పంచాయతీకి సీఎం క్యాంపు ఆఫీసులో జరిగిన చర్చలు కూడా తెరదించలేకపోయాయి. ఈ నేపథ్యంలో ఆయన ఇవాళ మరోసారి ప్రత్యర్ధులపై తీవ్ర విమర్శలకు దిగారు. నిన్న చర్చల విఫలం తర్వాత ప్రత్యర్ధి దుట్టా రామచంద్రరావు చేసిన వ్యాఖ్యలకు వంశీ కౌంటర్ ఇచ్చారు.
గన్నవరంలో తన ప్రత్యర్ధులు తన చేతిలో సింగిల్ గా, గ్రూపులు, గ్రూపులుగా గతంలో ఓడిపోయారని ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గుర్తుచేశారు. ఆ ఇగోతోనే ఓటమిని జీర్ణించుకోలేక తనపై రాజకీయాలు చేస్తున్నారని వంశీ తెలిపారు. గతంలో వరుసగా మూడు ఎన్నికల్లో తన ప్రత్యర్ధుల్ని ఒక్క అడుగు కూడా ముందుకు వేయనివ్వలేదని, అందుకే తాను వారికి నచ్చలేదన్నారు. నియోజకవర్గంలో ఇప్పటివరకూ ఎవరూ తనపై ఆధిపత్యం సాగించలేకపోయారని వంశీ పేర్కొన్నారు.

గన్నవరంలో తనకు ఎవరితోనూ సమస్య లేదని, వారికి ఎవరితో ఉందో తెలియదని తన ప్రత్యర్ధులను ఉద్దేశించి వంశీ వ్యాఖ్యానిచారు. నిన్న తన నియోజకవర్గ సమస్యలపైనే సీఎం పేషీకి వెళ్లానని వంశీ తెలిపారు.దుట్టా రామచంద్రరావును తనను కూర్చొబెట్టి మాట్లాడింది లేదన్నారు. నియోజకవర్గ నాయకులకి మాతో సమస్యా?..పార్టీతో సమస్యా? అని వంశీ ప్రశ్నించారు. అధిష్ఠానంతో సమస్యా అనేది కూడా అర్థం కావడం లేదన్నారు. గన్నవరంలో తాను వైసీపీ క్యాడర్ను ఎక్కడా నిర్లక్ష్యం చేయలేదని వంశీ చెప్పుకొచ్చారు.