గురుకుల్ తర్వాత మణికొండ? క్రమబద్దీకరణకు ఛాన్స్
హైదరాబాద్: గురుకుల్ భూముల్లో నిర్మాణాలపై ఉక్కుపాదం మోపిన తెలంగాణ సర్కారు.. గ్రామ పంచాయతీల పరిధిలోని అక్రమ నిర్మాణాలపై దృష్టిసారించిందా? నిబంధనలకు విరుద్ధంగా వెలసిన భవనాలపై చర్యలకు సిద్ధమవుతుందా? అంటే
అవునంటున్నారు. ప్రభుత్వ హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) మణికొండ, నార్సింగి గ్రామ పంచాయతీల పరిధిలోని అక్రమ నిర్మాణాల వివరాలను రాష్ట్ర విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు అందించినట్లుగా తెలుస్తోందని వార్తలు వస్తున్నాయి.
అయితే ఇక్కడ కూడా గురుకుల్ తరహా చర్యలుంటాయా? జీహెచ్ఎంసీలా పది సూత్రాలు అమలు చేస్తారా? లేక క్రమబద్ధీకరణకు అవకాశం కల్పిస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఐదారేళ్ల క్రితం మణికొండ, నార్సింగి గ్రామాల పరిధిలో పుట్టగొడుగుల్లా భవనాలు వెలిశాయి. అనుమతి తీసుకున్న ప్రకారం జీ ప్లస్ 2 వరకు భవనాలు కట్టాల్సి ఉండగా నాలుగైదు అంతస్తుల వరకూ నిర్మాణాలు చేపట్టారు.

మణికొండలో దాదాపు 2500కు పైగా వరకు అక్రమ నిర్మాణాలుంటాయని అంచనా. నార్సింగ్‌లో వెయ్యి వరకు నిబంధనలు ఉల్లంఘించిన నిర్మాణాలు ఉండవచ్చునంటున్నారు. నిబంధనలను అతిక్రమించి నిర్మించిన భవనాల క్రమబద్ధీకరణకు 2008లో ప్రభుత్వం బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్ (బీపీఎస్)ను ప్రవేశపెట్టింది. దీని ప్రకారం భూవినియోగం సరిగా ఉంటే భూమి విలువను బట్టి నిర్ణీత రుసుము చెలిస్తే భవనాన్ని క్రమబద్ధీకరిస్తారు.
ఈ పథకంలో భాగంగా మణికొండ గ్రామ పరిధిలోని నిర్మాణాలకు సంబంధించి చాలా దరఖాస్తులు వచ్చాయట. దరఖాస్తు చేసుకోని భవనాల సంఖ్య మరో వెయ్యి వరకు ఉంటుందని అంచనా. కాగా, ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడడంతోపాటు అక్రమ నిర్మాణదారుల విషయంలోనూ కఠినంగా వ్యవహరించాలనే యోచనలో తెలంగాణ సర్కారు ఉన్నట్లు తెలుస్తోంది. గురుకుల్ భూములతోపాటు మణికొండ, నార్సింగ్ గ్రామాల పరిధిలో అక్రమ నిర్మాణాల వివరాలను ప్రభుత్వం అడిగినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications