ఏపీలో సర్పంచ్ ల విలవిల- ఆర్ధికసంఘం నిధులు లాక్కొన్న సర్కార్-న్యాయపోరాటమే దిక్కు
ఏపీలో గ్రామ సచివాలయాలు, పంచాయతీ ఎన్నికల నిర్వహణ వంటి కార్యక్రమాలతో గ్రామస్వరాజ్యానికి బాటలు వేస్తున్నట్లు చెప్పుకుంటున్న వైసీపీ సర్కార్.. వాటికి నిధులు మాత్రం ఇవ్వడం లేదు. ముఖ్యంగా అరకొర నిధులతో అల్లాడుతున్న పంచాయతీలు తాజాగా ఎన్నికలు పూర్తిచేసుకోవడంతో 14వ ఆర్ధికసంఘం నిధులు విడుదలయ్యాయి. అలా వచ్చాయో లేదో ఇలా ప్రభుత్వం వాటిని తీసేసుకుంది. ఆ తర్వాత 15వ ఆర్ధిక సంఘం నిధులు కూడా లాక్కొనేందుకు సిద్ధమైపోతోంది. దీంతో పార్టీలకతీతంగా సర్పంచ్ లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించారు.

సర్పంచ్ లకు షాకులు
ఏపీలో సర్పంచ్ లకు వరుస షాకులు తగులుతున్నాయి. తాజాగా వైసీపీ సర్కార్ హయాంలో వాయిదా పడుతూ వచ్చిన పంచాయతీ ఎన్నికల నిర్వహణతో రాష్ట్రవ్యాప్తంగా సర్పంచ్ లు అధికారం చేపట్టారు. అయితే అధికారం చేపట్టిన నాటి నుంచి వారికి ప్రభుత్వం నిద్రలేకుండా చేస్తోంది. ముఖ్యంగా సర్పంచ్ లకు పోటీగా వీఆర్వోలను రంగంలోకి దింపి పంచాయతీలకు ప్రత్యామ్నాయంగా గ్రామ సచివాలయాల్ని తెరపైకి తీసుకురావడంతో వీరికి ఇబ్బందులు మొదలయ్యాయి. ఆ తర్వాత వీరికి నిధుల కేటాయింపు విషయంలో వివక్షచూపుతూ వచ్చిన ప్రభుత్వం.. చివరికి వారికి కేంద్రం నుంచి విడుదలవుతున్న ఆర్ధికసంఘం నిధులపై కన్నేసింది.

ఆర్ధిక సంఘం నిధులు లాక్కొంటున్న వైనం
పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించకపోవడంతో గతంలో రావాల్సిన నిధులపై సందిగ్ధత ఉండేది. కానీ కరోనా సాకుతో అప్పట్లో నిధులు తీసేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఆ తర్వాత ఎన్నికలు నిర్వహించడంతో 14వ ఆర్ధికసంఘం నిధులతో పాటు 15వ ఆర్ధిక సంఘం నిధులు కూడా క్రమంగా విడుదలవుతున్నాయి. అయితే ముందుగా ఆరు నెలల క్రితం 14వ ఆర్ధిక సంఘం నిధులు రూ.450 కోట్లు విడుదల కాగానే వాటిని సర్కార్ తమ ఖాతాల్లో మళ్లీంచేసుకుంది. ఆ తర్వాత ఇప్పుడు 15వ ఆర్ధిక సంఘం నిధులు రూ.3 వేల కోట్లను కూడా లాక్కొనేందుకు ప్రయత్నిస్తోంది. అదేమని అడిగితే పంచాయతీల కరెంటు బిల్లుల బకాయిలను సాకుగా చూపుతోంది.

కేంద్రం నిబంధనలివే
ప్రతి సంవత్సరం కేంద్రం ఇచ్చే ఆర్థిక సంఘం నిధులలో 40 శాతం బేసిక్ గ్రాంటు రూపంలో విడుదల చేస్తారు. అంటే వీటిని ప్రజల అవసరాలు, పంచాయితీ అభివృద్ధి కొరకు మాత్రమే ఖర్చు చేయవలసి ఉంటుంది. మిగిలిన 60 శాతం టైడ్ గ్రాంట్ అంటారు. వీటిలో 30 శాతం త్రాగునీటి అవసరాలకు మాత్రమే ఖర్చు చేయాల్సి ఉంటుంది. మరో 30 శాతం పారిశుద్ధ్యం కొరకు ఖర్చు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిబంధనలు చెప్తున్నాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర నిధులను కన్సాలిడేటెడ్ ఫండ్ కు జమ చేసుకొని వాడేసుకుంటోంది.
సర్పంచ్ ల లబోదిబో
పంచాయతీల నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం తమ ఖాతాలకు మళ్లించేసుకుంటుండంతో సర్పంచ్ లకు షాకులు తప్పడం లేదు. పంచాయతీ ఎన్నికలు నిర్వహించి గ్రామ స్వరాజ్యం పేరుతో కబుర్లు చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు తాము నిధులు ఇవ్వకపోగా... కేంద్రం ఇచ్చిన ఆర్ధిక సంఘాల నిధుల్ని సైతం లాగేసుకోవడంపై సర్పంచ్ లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో మెజారిటీ అధికార వైసీపీ సర్పంచ్ లే ఉన్నారు. తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలతో పాటు మెజార్టీ స్ధానాల్లో ఎన్నికైన సర్పంచ్ లు నిధుల్లేని పంచాయతీల్ని నడపలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే కారణంతో సీఎం జగన్ సొంత జిల్లా కడపలోనే తాజాగా 13 మంది సర్పంచ్ లు మూకుమ్మడి రాజీనామాలు కూడా సమర్పించారు.

సర్కార్ పై న్యాయపోరాటమే దిక్కు
రాష్ట్ర ప్రభుత్వం తమ నిధులు లాక్కోవడంపై సర్పంచ్ లు మండిపడతున్నారు. ఈ మోసానికి గ్రామ పంచాయతీలు నిర్వీర్యమైపోయి, సర్పంచ్ లు ఉత్సవ విగ్రహాల్లాగా మారిపోయారని పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు బాబూ రాజేంద్రప్రసాద్ ఆరోపించారు. తిరిగి ఆ నిధులు ఇచ్చేయ్యాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పటికే ప్రభుత్వ తీరుపై హైకోర్టులో కేసులు దాఖలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. సర్పంచ్ లకు చెప్పకుండా, కనీసం తెలియజేయకుండా వారి అనుమతి, గ్రామ పంచాయతీల తీర్మానం లేకుండా పంచాయతీల స్వంత నిధులు రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించి ఎలా వాడేసుకుంటుందని రాజేంద్ర ప్రసాద్ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా ఇవాళ సర్పంచ్ లు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు.