జగన్ కు మరో అగ్నిపరీక్ష-కేంద్రం మద్దతిస్తుందా ? ఇప్పటికే వరుస షాకులు
కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంతో సత్సంబంధాలు నెరుపుతున్నప్పటికీ ఇప్పటివరకూ విభజన హామీల్లో ప్రధానమైన ఏ ఒక్క దాన్నీ సాధించుకోలేకపోయిన ఏపీ సీఎం వైఎస్ జగన్.. ఇప్పుడు అగ్నిపరీక్ష ఎదుర్కొంటున్నారు. విభజన హామీలను అమలు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కేంద్రం.. ఇప్పుడు జగన్ కోరుతున్న విధంగా ఓ కీలకమైన అంశంలో సాయం చేస్తుందా లేదా అన్న చర్చ సాగుతోంది. ఇందులోనూ విఫలమైతే మాత్రం జగన్, బీజేపీ సంబంధాలపై కచ్చితంగా ప్రభావం పడటం ఖాయంగా తెలుస్తోంది.

ఏపీకి కేంద్రం బిగ్ హ్యాండ్
గతంలో ఏపీ విభజన సందర్భఁగా కేంద్ర ప్రభుత్వం అప్పట్లో రాజ్యసభలో భారీగా హామీలిచ్చింది. విభజనకు సహకరిస్తే ఏపీ భవిష్యత్తుకు తాము బాధ్యత తీసుకుంటామని చెప్పింది. కానీ హామీలిచ్చిన యూపీఏ సర్కార్ అధికారం కోల్పోవడంతో ఎన్నికల రాజకీయాల్లో భాగంగా అప్పట్లో ప్రధాని పదవికి పోటీ పడుతున్న నరేంద్రమోడీ కూడా వాటిని అమలు చేస్తామని చెప్పారు. కానీ టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇందులో ఏ ఒక్క హామీ పూర్తిగా అమలు కాలేదు.
దీంతో సహజంగానే అప్పటి సీఎం చంద్రబాబుపై అంతకంతకూ ఒత్తిడి పెరుగుతూ పోయింది. చివరి నిమిషంలో మేల్కొని కేంద్రంపై ధర్మాపోరాటం ప్రకటించినా జనం నమ్మకపోవడంతో ఆయన అధికారం కోల్పోయారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీదీ అదే పరిస్ధితి. ఈ రెండేళ్లలో విభజన హామీల్ని విస్మరించిన కేంద్రాన్ని వైసీపీ సర్కార్ పల్లెత్తుమాట అనలేని పరిస్దితి.

దయనీయ స్ధితిలో జగన్
ఏపీకి గతంలో విభజన సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని రెండేళ్లుగా సీఎం జగన్ కేంద్రాన్ని కోరుతూనే ఉన్నారు. అయినా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. దీంతో ఆయన చేసేది లేక కేంద్రాన్ని అడుగుతూనే ఉంటానంటూ కొత్త వాదన తెరపైకి తీసుకొచ్చారు. కేంద్రాన్ని గట్టిగా ప్రశ్నిస్తే తనపై నమోదైన సీబీఐ కేసుల్ని ఎక్కడ తిరగతోడుతుందోనన్న భయమే ఇందుకు కారణమని విపక్షాలు ఇప్పటికీ ఆరోపిస్తూనే ఉన్నాయి. అయినా ఎక్కడా చలనం లేదు. దీంతో జగన్ ఈ ఐదేళ్ల పాటు కేంద్రం నుంచి ఏదీ సాధించుకోకుండానే తన పదవీకాలాన్ని ముగిస్తారా అన్న చర్చ జరుగుతోంది.

జగన్ కు అగ్నిపరీక్ష
ఇప్పటికే విభజన హామీల్లో ఒక్క దాన్ని కూడా తన హయాంలో సాధించుకోలేని జగన్ కు తాజాగా మరో అగ్నిపరీక్ష ఎదురవుతోంది. రాయలసీమ ప్రాంత సాగునీటి అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్మిస్తున్న రాయలసీమ లిఫ్ట్ పై తెలంగాణ ప్రభుత్వంతో నెలకొన్న వివాదాలు జగన్ కొంప ముంచేలా కనిపిస్తున్నాయి. రాయలసీమ లిఫ్ట్ పై తెలంగాణతో ఓవైపు పోరాటాన్ని కొనసాగిస్తూనే మరోవైపు ఈ ప్రాజెక్టుకు అనుమతుల కోసం కేంద్రాన్ని ఆయన బతిమాలుతున్నారు. కానీ ప్రస్తుత పరిస్ధితుల్లో కేంద్రం జగన్ విజ్ఞప్తిని మన్నించే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో జగన్ పై అంతకంతకూ ఒత్తిడి పెరుగుతోంది.

చంద్రబాబు తరహాలోనే జగన్ పరిస్ధితి
గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా.. కేంద్రంలోని ఎన్డీయే సర్కారులో టీడీపీ మంత్రి పదవులు తీసుకుంది. దీంతో కేంద్రాన్ని గట్టిగా ప్రశ్నించే పరిస్ధితి లేకపోయింది. జాతీయ రాజకీయాల్లో లాబీయింగ్ కు కేరాఫ్ అడ్రస్ అయిన చంద్రబాబు ప్రయత్నాలూ ఫలించలేదు. దీంతో రాష్ట్రంలో వైసీపీ అధినేత జగన్ ఇదే అదనుగా చంద్రబాబుపై ఒత్తిడి పెంచుతూ పోయారు. ఫలితంగా చంద్రబాబు తొలుత ఎన్డీయే సర్కార్ నుంచి తన మంత్రుల్ని రాజీనామా చేయించాల్సి వచ్చింది.
ఆ తర్వాత ఏకంగా ఎన్డీయేకే గుడ్ బై చెప్పాల్సి వచ్చింది. అంతటితో ఆగకుండా ఎన్డీయేపై టీడీపీ మిగతా విపక్షాలతో కలిసి ఏకంగా ధర్మపోరాటమే చేసింది. దీన్ని జనం నమ్మకపోవడంతో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. ఇప్పుడు జగన్ పరిస్ధితి కూడా అలాగే కనిపిస్తోంది. ప్రస్తుతం జగన్ కూడా దాదాపు ఇలాంటి పరిస్ధితుల్నే ఎదుర్కొంటున్నారు. రాయలసీమ లిఫ్ట్ విషయంలో కేంద్రం నుంచి మద్దతు లభించకపోతే మాత్రం జగన్ పైనా అదే తరహా ఒత్తిడి పడటం ఖాయం. అప్పుడు జగన్ ఏం నిర్ణయం తీసుకుంటారన్న దానిపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది.