విశాఖ విషాదం: కేంద్రం సంచలన ఆదేశాలు.. రాష్ట్రాలకు వార్నింగ్.. టార్గెట్ అంటే తాటతీసుడేనట..
ఆంధ్రప్రదేశ్ కాబోయే రాజధాని విశాఖపట్నంలో గ్యాస్ లీకేజీ ఘటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆర్ఆర్ వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్ ప్లాంటులో స్టెరీన్ గ్యాస్ లీకై చుట్టుపక్కల ప్రాంతాల్లోని 12 మంది ప్రాణాలు కోల్పోవడం, వేలాది మంది ఆస్పత్రులపాలైన తీరుపై ఐక్యరాజ్యసమితి లాంటి అంతర్జాతీయ సంస్థలు సైతం ఆందోళన వ్యక్తం చేశాయి. లాక్డౌన్ కారణంగా 40రోజులకుపైగా ఫ్యాక్టరీ నిర్వహణ సరిగా లేకపోవడం, సడలింపుల కారణంగా రీఓపెన్ చేసే క్రమంలో ప్రమాదం తలెత్తడం తెలిసిందే. విశాఖ ఘటన తర్వాత దేశంలోని మిగతా కెమికల్, మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీల భద్రతపై తీవ్ర భయాందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన ఆదేశాలు జారీచేసింది.

చేతులు కాలిన తర్వాత..
నిత్యం ప్రమాదకర రసాయనాలతో పనిచేసే ఫ్యాక్టరీలు, తయారీ సంస్థల్లో సాధారణంగా రోజువారీ ఆపరేషన్లు చాలా క్రిటికల్ గా సాగుతుంటాయి. అలాంటి కంపెనీలను కూడా అత్యవసర సేవల కిందే పరిగణించి, లాక్ డౌన్ మినహాయింపులు ఇవ్వాల్సిందిగా ఇండియన్ కెమెకల్ కౌన్సిల్(ఐసీసీ) గతంలోనే కేంద్రానికి మొరపెట్టుకున్నా ఫలితంలేకపోయింది. విశాఖలో ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటనతో చేతులు కాలిన తర్వాతగానీ ప్రభుత్వాలు స్పందించలేదు. మూడో దశ లాక్ డౌన్ గడువు ఈనెల 17తో ముగియనున్న నేపథ్యంలో.. దేశవ్యాప్తంగా కెమికల్, మాన్యుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీల రీఓపెనింగ్కు సంబంధించి కేంద్ర హోం శాఖ ఆదివారం సరికొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ఫ్యాక్టరీల పున:ప్రారంభం సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కార్మికుల రక్షణ, చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రజల్ని అప్రమత్తం చేయడం తదితర అంశాలపై స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది.

తొలివారమంతా ట్రయల్సే..
రసాయన విపత్తులు-2007, మేనేజ్మెంట్ ఆఫ్ కెమికల్(టెర్రరిజం) డిజాస్టర్-2009, పెట్రోలియం, ఆయిల్ లిక్విడ్ ట్యాంకర్ల భద్రత-2010 చట్టాల ఆధారంగా నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ(ఎన్డీఎంఏ) గైడ్ లైన్స్ పేరుతో హోం శాఖ ఉత్తర్వులు విడుదుల చేసింది. లాక్ డౌన్ తర్వాత యూనిట్లను రీస్టార్ట్ చేసే విషయంలో తొలి వారాన్ని పూర్తిగా ట్రయల్ రన్స్ మాత్రమే నిర్వహించాలని, అన్ని రకాల ప్రోటోకాల్స్ ఫాలో అవుతూ, భద్రతను ఒకటికి నాలుగు సార్లు చెక్ చేసుకోవాలని తాజా మార్గదర్శకాల్లో సూచించారు. ఫ్యాక్టరీలు తెరుచుకున్న తొలివారంలోనే టార్గెట్లు విధించుకుని ఉత్పత్తిని వెంటనే ప్రారంభించకూడదని, అలా చేస్తే చర్యలు తప్పవని కేంద్రం హెచ్చరించింది.

అణువణువూ పరిశీలించాకే..
విశాఖ ఎల్జీ పాలిమర్స్ ప్లాంటులో లాక్ డౌన్ సమయానికే ట్యాంకర్లలో గ్యాస్ నిల్వలు ఉండటం, రిఫ్రిజిరేషన్ ప్రక్రియ నిర్వహించే నిపుణులు లేక, రీఓపెనింగ్ సమయంలో గ్యాస్ లీకైపోయిన సంగతి తెలిసిందే. ఆ అనుభవం దృష్ట్యా.. లాక్ డౌన్ కారణంగా మూతపడ్డ ఫ్యాక్టరీల్లో ఏమూల ఏం జరిగిందో, బాయిలర్లు, ట్యాంకర్లలో కెమికల్స్ నిల్వలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాయో, నీటి సరఫరా, విద్యుత్ సరఫరాలో ఎమైనా లోపాలున్నాయి, షార్ట్ సర్క్యూట్ కు అవకాశముందా.. ఇలా ప్రతి చిన్న విషయాన్ని అణువణువూ పరిశీలించిన తర్వాత ట్రయల్ రన్స్ మొదుపెట్టాలని, ఏడురోజులపాటు ట్రయల్స్ నిర్వహించిన తర్వాతే ఉత్పత్తివైపునకు మళ్లాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.

రాష్ట్రాలకూ బాధ్యత..
కెమికల్, మాన్యుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీల రీఓపెనింగ్ సందర్భంగా ఎన్డీఎంఏ మార్గదర్శకాలు కచ్చితంగా అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనని కేంద్రం స్పష్టం చేసింది. ఆయా జిల్లాల్లో ఫ్యాక్టరీల సామర్థ్యాన్ని బట్టి కలెక్టర్ స్టాయి అధికారులు సైతం స్వయంగా చొరవ తీసుకుని, భద్రతా ఏర్పాట్లను పరిశీలించాలని సూచించింది. రాష్ట్ర అధికారులు విధిగా ఆయా ఫ్యాక్టరీల్లో తనిఖీలు చేసి సేఫ్టీపై దృష్టిసారించాలని, ప్రత్యేక విభాగాల్లో పనులు నిపుణుల ఆధ్వర్యంలోనే జరుగుతున్నట్లు నిర్ధారణ చేసుకోవాలనీ కేంద్రం సూచించింది.

కార్మికుల భధ్రతపై..
ఫ్యాక్టరీల రీఓపెనింగ్ సమయంలో ప్రమాదాలు జరగకుండా చూసుకోవడంతోపాటు కార్మికుల భద్రతకు కూడా పెద్ద పీట వేయాలని, కరోనా వైరస్ ప్రబలకుండా పని ప్రదేశంలో రోజుకు మూడు సార్లయినా శానిటేషన్ ప్రక్రియ చేపట్టాలని ఎన్డీఎంఏ మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. ప్రతి షిఫ్టులో 33 శాతం కంటే ఎక్కువ మంది కార్మికుల్ని అనుమతించరాదని, వాళ్లు వాడే పని ముట్లను కూడా శానిటైజ్ చేయాలని, షిఫ్టులకు మధ్య కొంత సమయం ఇస్తూ, ఫ్యాక్టరీ పరిసరాలు మొత్తాన్ని శానిటైజ్ చేయాలని సూచించారు. కంపెనీల్లో పనిచేసే అందరు ఉద్యోగులకు, కార్మికులకు రోజుకు రెండు సార్లు టెంపరేచర్ చెక్ చేయాలని ఆదేశించారు. మొత్తంగా విశాఖ గ్యాస్ లీకేజీ ఘటన తర్వాతైనా ఫ్యాక్టరీల రీఓపెనింగ్ పై కేంద్రం మార్గదర్శకాలు జారీచేయడాన్ని పారిశ్రామిక వర్గాలు స్వాగతించాయి.