దేశంలోనే తొలిసారి: బీఎస్ఈలో అమ్మకానికి ‘అమరావతి’ బాండ్లు, నిధుల సేకరణ
అమరావతి: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి బాండ్లు అమ్మకానికి వచ్చాయి. అమరావతి నిర్మాణానికి నిధులు సేకరించే పనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి షేర్లను బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజీలో అమ్మకానికి పెట్టింది.

అయితే, ఓ రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం బాండ్లు జారీ చేయడం దేశంలోనే ఇది తొలిసారి కావడం గమనార్హం. ఈ బాండ్లు రూ.10లక్షల ముఖ విలువతో సంస్థాగత మదుపర్లకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. తొలి విడతలో భాగంగా రూ.1,300 కోట్ల నిధుల సేకరణకు అమరావతి బాండ్లను సీఆర్డీఏ విడుదల చేసింది.

బీఎస్ఈలో మంగళవారం ఉదయం 11 గంటల నుంచి ఎలక్ట్రానిక్ బిడ్డింగ్ ప్లాట్ఫాం ద్వారా తొలివిడతలో 600 బాండ్లు విక్రయానికి అందుబాటులో ఉంచారు. వీటిపై మదుపర్లు ఆసక్తి చూపడంతో త్వరగానే అమ్ముడుపోయాయి.
మళ్లీ మంగళవారం మధ్యహ్నం 12 గంటల తర్వాత మరిన్ని బాండ్లు అందుబాటులో ఉంచనున్నట్లు తెలుస్తోంది. బాండ్ల విక్రయాలను సీఆర్డీఏ కమిషనర్ శ్రీధర్ సహా ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు.