విశాఖ వద్దు-అమరావతి ముద్దు, రాజధాని రైతుల దీక్షకు మద్దతు: సబ్బం హరి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నుంచి విశాఖపట్టణం మార్చేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ రాజధాని రైతులు ఆందోళన బాట పట్టిన సంగతి తెలిసిందే. అయితే వారి నిరసన శనివారంతో 200వ రోజుకు చేరుకుంది. ఈ క్రమంలో పలువురు నేతలు రైతులకు సంఘీభావం తెలుపుతున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరికాదని, వెనక్కి తీసుకోవాలని కోరుతున్నారు. విశాఖలో రాజధాని వద్దు అని చెప్పే మొదటి వ్యక్తిని తానేనని మాజీ ఎంపీ సబ్బం హరి అన్నారు. రాజధానిని మార్చొద్దని మహిళలు చెబుతోన్న మాటలు అక్షర సత్యాలు అని పేర్కొన్నారు. వారి చెబుతున్నది న్యాయమైనవని.. ఉద్యమం ద్వారా ప్రజలకు చేరిందన్నారు.

పాదయాత్ర..?
ప్రభుత్వం మాత్రం ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. దీంతో ప్రభుత్వ చర్యలను చూసి ప్రజలు చీదరించుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. కానీ వైసీపీ నేతలు మాత్రం ప్రజలను ఓదార్చేలా కాకుండా భయపెట్టేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వాస్తవానికి విశాఖపట్టణం నుంచి అమరావతి వరకు పాదయాత్ర చేయాలని భావించానని.. కరోనా వైరస్ వల్ల నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నానని తెలిపారు. తొలుత మండలి రద్దు చేస్తామని చెప్పిన వైసీపీ.. తర్వాత కొనసాగించడం దేనికి సంకేతమని ప్రశ్నించారు.

సీఎం మారే ఛాన్స్..?
మరో నాలుగేళ్లు వైసీపీ అధికారంలో ఉంటుందని.. కానీ సీఎం మారే అవకాశం ఉంది అని హింట్ చేశారు. ఏడాదిలో జగన్ కాక మరొకరు సీఎం పదవీ చేపడుతారనే సమాచారం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. 2022లో జమిలి ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది అని కామెంట్ చేశారు. అదే జరిగితే అమరావతి రాజధానిగా ఉంటుందని పేర్కొన్నారు. అమరావతి రాజధాని మార్చే పరిస్థితి లేదని.. రాష్ట్రంలో రాజకీయంగా పెను మార్పులు జరగబోతున్నాయని తెలిపారు. 60 ఏళ్లు హైదరాబాద్ అభివృద్ది చేస్తే కట్టుబట్టలతో బయటకొచ్చామని.. రాష్ట్రం వీడిపోయిన తర్వాత ప్రజల ఆశలకు టీడీపీ రూపకల్పన చేసిందన్నారు. కానీ ప్రభుత్వం మారడంతో రాజధాని మార్పు పేరుతో రాజకీయాలు జరుగుతున్నాయని తెలిపారు.

మారుమూల ప్రాంతం కాదు..
దేశంలో ఎక్కడ లేనివిధంగా రాజధాని కోసం 30 వేల ఎకరాల భూమిని అమరావతి రాజధాని కోసం సేకరించామని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. ఆ రైతుల త్యాగాన్ని జగన్ సర్కార్ నిర్వీర్యం చేసే ప్రయత్నాలను రైతులు తమ నిరసన ద్వారా తిప్పికొడుతున్నారని తెలిపారు. రాజధాని మార్చాలనే ప్రభుత్వ నిర్ణయం ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టడమేనని తెలిపారు. కృష్ణానది ఒడ్డున ఉన్న అమరావతికి పుష్కలంగా తాగునీరు, నేషనల్ హైవే ఉన్నాయని వివరించారు. నెల్లూరు, ప్రకాశం, రాయలసీమ జిల్లాలు, గుంటూరు, కృష్ణా, గోదావరి జిల్లాలకు ఎంతో అనుకూలమైన ప్రాంతం అని చెప్పారు. మారుమూల ప్రాంతంలో రాజధాని ఉంటే.. మారుస్తున్నామని చెబితే అర్థం ఉండేదన్నారు.

అభినందనీయం
కృష్ణా, గుంటూరు జిల్లాల వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు అమరావతి రాజధాని వద్దని గుండెపై చేయి వేసుకుని చెప్పగలరా అని ప్రశ్నించారు. ఇందులో మరో కారణం లేదు అని.. చంద్రబాబు నాయుడికి పేరు వస్తుందని మాత్రమే సీఎం జగన్ మారుస్తున్నారని ఆరోపించారు. 2 వేల కోట్లు వెచ్చిస్తే అధునాతమైన, సౌకర్యవంతమైన రాజధాని అందుబాటులోకి వస్తుందని సోమిరెడ్డి అన్నారు. రాజధానిని మీరే పూర్తి చేస్తే.. చిరకాలం మీ పేరు నిలిచిపోతుందన్నారు. సౌకర్యవంతమైన రాజధానిని.. శిథిలాల కింద మార్చడం బాధాకరమని అభిప్రాయపడ్డారు. భూములిచ్చిన రైతులు భార్యాపిల్లలతో 200 రోజులుగా పోరాటం చేయడం అభినందనీయమన్నారు. రాజధాని కోసం పోరాడుతోన్న అందరికీ తమ మద్దతు ఉంటుందని పేర్కొన్నారు.