ప్లేట్ లేకుండా రోడ్డుపై పడేసిన పులిహోరను తింటూ అమరావతి ప్రాంత రైతుల నిరసన
అమరావతి: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని అమరావతి ప్రాంత రైతులు.. తమ నిరసనలను మరింత ఉధృతం చేశారు. రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి జగన్ ప్రభుత్వం చేస్తోన్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా అమరావతి ప్రాంత రైతులు చేస్తోన్న నిరసన ప్రదర్శనలు 442వ రోజుకు చేరుకున్నాయి. అయినప్పటికీ.. మూడు రాజధానుల ఏర్పాటు ప్రక్రియను వెనక్కి తీసుకోకపోవడంతో రైతుల్లో ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా అమరావతి ప్రాంత మహిళా రైతులు రోడ్డెక్కారు.
మూడు రాజధానుల దిశగా..శరవేగంగా: కీలకంగా మారిన శ్రీలక్ష్మి: అమరావతి ప్రాజెక్టుల్లో కదలిక?

పూర్తిస్థాయి రాజధానిగా..
అమరావతిని పూర్తిస్థాయి రాజధానిగా కొనసాగించాలంటూ వారు నినదించారు. ప్లకార్డులను ప్రదర్శించారు. రహదారులపై బైఠాయించారు. ఎండను సైతం లెక్క చేయకుండా రైతులు, మహిళలు నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్నారు. ఏపీ సచివాలయం వైపు కవాతుగా వెళ్లడానికి వారు చేసిన ప్రయత్నాలను పోలీసులు అడ్డుకున్నారు. అమరావతి ప్రాంతానికి చెందిన రైతులు, మహిళలు ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకోవడానిక మూకుమ్మడిగా బయలుదేరి వెళ్లగా..మార్గమద్యలో పోలీసులు వారిని ఎక్కడికక్కడ అడ్డుకున్నారు.

నడిరోడ్డుపై ఆహారాన్ని తింటూ..
దీనితో వారు అక్కడే బైఠాయించారు. నిరసన ప్రదర్శలను కొనసాగించారు. నిరసనల్లో పాల్గొన్న వారికి అమరావతి పరిరక్షణ సమితి ప్రతినిధులు భోజనం చేయడానికి పులిహోర పాకెట్లను అందించారు. ఆ పాకెట్లను చింపి.. పులిహోరను రోడ్డుపై పడేసి, దాన్ని తింటూ నిరసన తెలిపారు. ప్లేట్, పేపర్ లేకుండా నడిరోడ్డుపై పడేసిన పులిహోరను తిన్నారు. తాము కష్టపడి పండించుకున్న పంటను, ఆహారాన్ని జగన్ ప్రభుత్వం నేలపాలు చేసిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్ డౌన్ డౌన్ అంటూ నినదించారు. రైతుల పొట్టకొట్టిన ప్రభుత్వం ఎంతోకాలం మనుగడ సాగించలేదంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

తెలుగు మహిళ నేతలతో..
ఈ ఆందోళనల్లో పలువురు తెలుగు మహిళ నాయకులు పాల్గొన్నారు. అమరావతి ప్రాంత మహిళల సత్తా చూపుతామని హెచ్చరించారు. మున్ముందు తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని, ప్రభుత్వం దిగొచ్చేంత వరకూ కొనసాగిస్తామని హెచ్చరించారు. ముఖ్యమంత్రి అమరావతి ప్రాంత రైతులు అంటే భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. అందుకే- ఇక్కడి నుంచి వెళ్లిపోవడానికే ఆయన ప్రయత్నాలు చేస్తున్నారని మండి పడ్డారు. అమరావతిని అంగుళం కూడా కదపనివ్వని విధంగా తమ ఉద్యమం కొనసాగుతుందని హెచ్చరించారు. మందడంలో నిర్వహించిన నిరసన కార్యక్రమాల్లో టీడీపీ మహిళా నాయకురాలు దివ్యవాణి పాల్గొన్నారు.

ఉద్రిక్తంగా అమరావతి గ్రామాలు
అంతకుముందు అమరావతి ప్రాంత రైతులు- ర్యాలీగా ఇంద్రకీలాద్రికి చేరుకోవడాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీనితో వారంతా ప్రకాశం బ్యారేజీపై బైఠాయించారు. సేవ్ అమరావతి అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించడంతో పెనుగులాట చోటు చేసుకుంది. అనంతరం వారిని అరెస్ట్ చేసి, పోలీస్ స్టేషన్కు తరలించారు. వెలగపూడి, మందడం, తుళ్లూరు, పెదపరిమి వంటి చోట్ల రైతుల నిరసనలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ప్లేట్ లేకుండా రోడ్డుపై పడేసిన పులిహోరను తింటూ అమరావతి ప్రాంత రైతుల నిరసన#Amaravatifarmersprotest #WomensDay #Amaravati pic.twitter.com/DK6ZtoJ9bW
— oneindiatelugu (@oneindiatelugu) March 8, 2021