అమరావతి భూములపై సుప్రీంలో ఆసక్తికర వాదన ... టీడీపీ నేతలకు, సిట్ కు సుప్రీం నోటీసులు
అమరావతి భూ కుంభకోణంపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారిస్తోంది. ఏపీ రాజధాని అమరావతి భూముల విషయంలో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. నేడు ఈ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం తెలుగుదేశం పార్టీ నేతలకు,వారితో పాటు భూ కుంభకోణంపై విచారణ జరుపుతున్న ప్రత్యేక దర్యాప్తు బృందం అయిన సిట్ కు నోటీసులు జారీ చేసింది. అమరావతి భూ కుంభకోణంపై విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వేసింది.

దర్యాప్తు ప్రాథమిక దశలోనే హైకోర్టు స్టే ఇవ్వడం సరికాదని వాదించిన దుష్యంత్ దవే
అమరావతి భూ కుంభకోణం విషయంలో సిట్ దర్యాప్తుపై ఏపీ హైకోర్టు స్టే విధించటాన్ని సుప్రీం కోర్టులో సవాల్ చేసింది ఏపీ సర్కార్ . అమరావతి భూముల అంశంలో నేడు జరిగిన విచారణలో రాష్ట్ర ప్రభుత్వం తరపున న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపించారు. సి ఆర్ డి ఎ ప్రాంతంలోని భూముల అంశంలో అవకతవకలు జరిగాయని కేబినెట్ సబ్ కమిటీ నివేదిక ఇచ్చిందని సర్వోన్నత న్యాయస్థానానికి దుష్యంత్ దవే తెలిపారు . సబ్ కమిటీ నివేదిక ఆధారంగానే ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసిందని ఆయన తెలిపారు . దర్యాప్తు ప్రాథమిక దశలోనే హైకోర్టు స్టే ఇవ్వడం సరికాదని దుష్యంత్ దవే సుప్రీం కోర్టు దృష్టికి తీసుకు వెళ్లారు.

టీడీపీ ప్రభుత్వ నిర్నయాలన్నింటినీ మీ ప్రభుత్వం సమీక్షిస్తుందా ? సుప్రీం ఆసక్తికర ప్రశ్న
ఈ కేసును విచారిస్తున్న సుప్రీం ధర్మాసనం ఏపీ ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించింది. ఏపీ ప్రభుత్వం తరపున వాదనలు వినిపిస్తున్న దుష్యంత్ దవే గతంలో ఇచ్చిన తీర్పులను ఉదాహరిస్తూ భూ కుంభకోణంపై హైకోర్టు స్టే ఇచ్చే అధికారం లేదని సుప్రీం ధర్మాసనానికి నివేదించారు.
తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను మీ ప్రభుత్వం సమీక్షిస్తుందా అని అడిగిన ప్రశ్నకు భారీ స్థాయిలో అక్రమాలు చోటు చేసుకున్న అంశాల్లో మాత్రమే విచారణ జరుపుతున్నామని, అన్ని నిర్ణయాలపై కాదని సమాధానమిచ్చారుదుష్యంత్ దవే .

ఆర్టికల్ 226 ప్రకారం హైకోర్టులో సిట్ దర్యాప్తుపై వేసిన పిటిషన్లపై ఏపీ ప్రభుత్వ అభ్యంతరం
హైకోర్టు ఈ వ్యవహారంలో స్టే ఇవ్వడాన్ని ప్రస్తావించిన దుష్యంత్ దవే హైకోర్టుకు అసాధారణ అధికారాలు లేవని సుప్రీం ఆదేశాలకు లోబడి పని చేయాల్సిందేనని సుప్రీం ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు. అమరావతి భూ కుంభకోణంపై పారదర్శకంగా దర్యాప్తు జరుగుతున్న తరుణంలో హైకోర్టు జోక్యం చేసుకోవడం సరికాదని తన వాదనను బలపరచుకోవడం కోసం పాత తీర్పులను ఉదహరించి వాదించారు.
ఆర్టికల్ 226 ప్రకారం హైకోర్టులో సిట్ దర్యాప్తు పై పిటిషన్లు వేశారని, వ్యక్తిగతంగా ప్రభావితం అయితే తప్ప ఆర్టికల్ 226 ప్రకారం పిటిషన్లు దాఖలు చేయకూడదని దుష్యంత్ దవే పేర్కొన్నారు.

టీడీపీ నేతలకు , సిట్ కు సుప్రీం నోటీసులు .. నాలుగువారాలపాటు కేసు వాయిదా
టిడిపి నేతలు ఉద్దేశపూర్వకంగా సిట్ దర్యాప్తు అడ్డుకున్నారని ఆరోపించారు. వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం ప్రతివాదులు అయిన వర్ల రామయ్య, ఆలపాటి రాజేంద్రప్రసాద్ తో సహా సిట్ కు నోటీసులు జారీ చేసింది. కౌంటర్లు దాఖలు చేయాలంటూ ఆదేశించింది . ఈ కేసులో విచారణను సుప్రీం ధర్మాసనం నాలుగు వారాల పాటు వాయిదా వేసింది.