పిచ్చికుక్క కరిచినట్లు టీడీపీ నేతల మాటలు .. చీకట్లో చిదంబరాన్ని కలిసింది చంద్రబాబే : అంబటి రాంబాబు
టిడిపి అధినేత చంద్రబాబుపై, టిడిపి నేతలపై వైసీపీ ఎమ్మెల్యే, వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శల వర్షం కురిపించారు. వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీ ని కలిసింది రాష్ట్ర అభివృద్ధి కోసం మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. వ్యక్తిగత అజెండా కోసం సీఎం జగన్ ప్రధాని మోడీ ని కలిశారని టిడిపి నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిపడ్డారు.
ప్రధాని మోడీ జగన్ ను పొగిడారు .. చంద్రబాబు, లోకేష్ లు ఆందోళనలో ఉన్నారు : మంత్రి ఆళ్ళ నానీ

ప్రధానిని కలిసే వ్యక్తిగత అజెండా జగన్ కు లేదు
జగన్మోహన్ రెడ్డికి వ్యక్తిగత ఎజెండాతో ప్రధాని మోడీని కలవాల్సిన అవసరం లేదని, జగన్ చంద్రబాబులా కాదని , ఆయన దేనికీ భయపడరని అంబటి రాంబాబు పేర్కొన్నారు.
చీకట్లో చిదంబరాన్ని కలిసిన చరిత్ర చంద్రబాబుదని ఎద్దేవా చేసిన అంబటి రాంబాబు , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పదేళ్ల పాటు రాజధానిగా హైదరాబాదు ఉన్నప్పటికీ, ఓటుకు నోటు కేసులో చంద్రబాబు భయపడి ఏపీకి పారిపోయి రాజధాని వదిలి వచ్చాడు అంటూ విమర్శలు గుప్పించారు . రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని భావించి సీఎం జగన్, రాష్ట్ర ప్రయోజనాల కోసమే ప్రధాని నరేంద్ర మోడీని కలిశారని పేర్కొన్నారు.

కేసులకు భయపడేవాడు జగన్ కాదు
కేసులకు భయపడే స్వభావం జగన్ ది కాదని అంబటి రాంబాబు పేర్కొన్నారు. సీఎం జగన్ పై ఉన్నవన్నీ కుట్రపూరితమైన కేసులే తప్ప వాటిలో వాస్తవాలు లేవని అంబటి అభిప్రాయపడ్డారు. కేసులు జగన్ ను ఏమీ చేయలేవని అంబటి రాంబాబు ధీమా వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి నిబద్ధతను గుర్తించిన ఏపీ ప్రజలు 151 సీట్లతో జగన్ కు అఖండ మెజారిటీని అందించారని చంద్రబాబును చిత్తుగా ఓడించారు అంటూ అంబటి రాంబాబు పేర్కొన్నారు.

చంద్రబాబు మారకుంటే ప్రజలు బుద్ధి చెప్తారు
ఇప్పటికీ చంద్రబాబు మారకుంటే ప్రజలు మళ్ళీ బుద్ధి చెబుతారని అంబటి రాంబాబు చంద్రబాబు పై విరుచుకుపడ్డారు.
సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రధానిని , కేంద్ర మంత్రులను కలిసినప్పుడల్లా కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని అంబటి నిప్పులు చెరిగారు. ప్రధానికి ఎవరైనా కోర్టుల పై ఫిర్యాదు చేస్తారా అని ప్రశ్నించారు అంబటి రాంబాబు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ని టార్గెట్ చేసుకుని వార్తలు రాస్తున్న మీడియాపై కూడా ఆయన నిప్పులు చెరిగారు. టిడిపి నేతలు పనీపాట లేనట్లు వ్యవహరిస్తున్నారని పిచ్చి కుక్కలు కరిచినట్టు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు అంబటి రాంబాబు.