ఏ పరిస్థితులైనా ఎదుర్కొంటాం - చంద్రబాబు రెచ్చగొడుతున్నారు : మంత్రి అంబటి ఫైర్..!!
టీడీపీ అధినతే చంద్రబాబు లక్ష్యంగా మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు పర్యటనకు జనస్పందన కరువైందన్నారు. ప్రస్టేషన్‌తో చంద్రబాబు గందరగోళంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రజల్లో చంద్రబాబుకు ఆదరణ ఉంటే ఒంటరిగా పోటీ చేయాలని సవాలు విసిరారు. సీఎం వైయస్ జగన్‌ను ఎదుర్కొవడానికి కలిసి పోటీ చేయడానికి చంద్రబాబు సిద్ధమవుతున్నారని పేర్కొన్నారు. ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొవడానికి వైయస్ఆర్సీపీ సిద్ధంగా ఉందన్నారు.

కావాలనే రెచ్చగొడుతున్నారు
ప్రజలకు సంక్షేమ పథకాలు అందకూడదని చంద్రబాబు కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. కావాలనే చంద్రబాబు ప్రజలను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. గడిచిన ప్రతి ఎన్నికలోనూ చంద్రబాబును ప్రజలు చిత్తుచిత్తుగా ఓడించారన్నారు. ప్రస్టేషన్‌తో చంద్రబాబు గందరగోళంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఏపీ కన్నా మహారాష్ట్రలో ఆర్టీసీ చార్జీలు ఎక్కువగా ఉన్నాయని అంబటి వివరించారు. ఏపీ కన్నా కర్ణాటకలో ఎక్కువ విద్యుత్ చార్జీలు వసూలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు.

అది టీడీపీ చేసిన పనే
పోలవరం ప్రాజెక్టు పూర్తి అయితే 7 రాష్ట్రాలకు ఉపయోగకరంగా ఉంటుందని గతంలో తాను చెబితే హేళనగా మాట్లాడారని, ఐదేళ్లు జలవనరుల శాఖ మంత్రిగా పని చేసిన దేవినేని ఉమా ఇప్పుడు ఏ బావిలో దూకుతారని ప్రశ్నించారు. చంద్రబాబుకు ఎన్ని సంచులు మోసావో ఉమాకు అవగాహన ఉందని ఎద్దేవా చేశారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలనే జిజ్ఞత కానీ, నీళ్లు ఇవ్వాలనే చిత్తశుద్ధి టీడీపీ లేకపోయిందన్నారు. పోలవరం కాఫర్ డ్యామ్‌ను పూర్తి చేసిన తరువాత డయాఫ్రం వాల్ నిర్మాణం చేపట్టాలన్నారు.

చంద్రబాబు కుట్రలో భాగమే
ఇది శాస్త్రీయంగా తెలిసిన విషయం. కానీ చంద్రబాబు డయాఫ్రం వాల్‌ను నిర్మించి మధ్యలో ఆపేసి పారిపోయారన్నారు. ఆయన పారిపోవడం వల్లే అనార్థం జరిగిందన్నారు. దీన్ని మా ప్రభుత్వంపై రుద్దడానికి ప్రయత్నం చేయవద్దని అంబటి రాంబాబు పేర్కొన్నారు. పన్నులు లేకుండా ప్రభుత్వాలు నడుస్తాయా.. గతంలో చంద్రబాబు పన్నులు లేకుండానే ప్రభుత్వాన్ని నడిపారా అంటూ ప్రశ్నించారు. నవరత్నాలు, సంక్షేమ కార్యక్రమాలు అమలు కాకూడదని కుట్రలో భాగంగానే ఈ రాద్దాంతం చేస్తున్నారని అంబటి మండిపడ్డారు.