విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భూ సేకరణ చట్టం సవరణ...కార్పోరేట్ సంస్థలకు భూములు కట్టబెట్టేందుకే:సిపిఎం

By Suvarnaraju
|
Google Oneindia TeluguNews

విజయవాడ: 2013 భూసేకరణ చట్టానికి సవరణలు చేయడం ద్వారా బహుళజాతి సంస్థలకు, కార్పొరేట్లకు భూములు కట్టబెట్టేందుకు తెలుగుదేశం ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని సిపిఎం ఆరోపించింది. ఇది చాలా అమానుషమని మండిపడింది.

సిపిఎం రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు వి.శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. రైతుల నుండి బలవంతంగా భూములు గుంజుకునేందుకు వీలుగా ఈ చట్టంలో సవరణలు పెట్టారనన్నారు. గతంలో కేంద్రం కూడా ఇలాగే సవరణలు పెడితే ప్రజా ఆందోళనతో వెనక్కు తగ్గిందనే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తించాలన్నారు.

భిన్నమంటూనే...బిజెపి బాటలో

భిన్నమంటూనే...బిజెపి బాటలో

ముఖ్యమంత్రి చంద్రబాబు తాము బిజెపికి భిన్నమైన వ్యక్తులమని చెప్పుకుంటున్నారని...కానీ ఆచరణలో ఆ పార్టీ విధానాలనే అనుసరిస్తున్నారని సిపిఎం నేతలు విమర్శించారు. రాష్ట్రంలో భూ సంబంధిత సమస్యలపై వెంటనే అఖిలపక్ష సమావేశం జరపాలని సిపిఎం నేతలు కోరారు. భూ సేకరణ చట్టంలో సవరణలు వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. టిడిపి ప్రభుత్వం బిజెపితో పోటీ పడి ప్రజలపై పెను భారాలు వేస్తూ గోళ్లూడకొడుతూనే మరోవైపు తానేదో ప్రజా అనుకూల విధానాలను అనుసరిస్తున్నానని ఊదరగొడుతుందని, ఇది ఏమాత్రం సరికాదని సిపిఎం నేతలు ధ్వజమెత్తారు.

పెట్రోల్ రేటు...తగ్గించు బాబూ!

పెట్రోల్ రేటు...తగ్గించు బాబూ!

పెట్రోల్‌ ధర పైసా తగ్గించి బిజెపి ప్రజలను అపహాస్యం చేస్తే...అందుకు భిన్నంగా కేరళ ప్రభుత్వం అదనంగా రూపాయి ధర తగ్గించి ఆదర్శాన్ని చేతల్లో చూపిందన్నారు. అదేవిధంగా చంద్రబాబు కూడా పెట్రోల్‌పై పన్నులు తగ్గించాలని సిపిఎం నేతలు డిమాండ్‌ చేశారు. మహానాడులో కూడా తాము 100 శాతం హామీలు అమలు చేశామని చంద్రబాబు,టిడిపి నేతలు చెబుతున్నారని, ప్రజల సమస్యలు, వారి బాధలపై చర్చ లేకుండానే వాళ్లకివాళ్లే నూటికినూరు మార్కులు వేసేసుకున్నారని ఎద్దేవా చేశారు. మరోవైపు రాష్ట్రంలో ప్రజలు మాత్రం నానా అవస్థలు పడుతున్నారన్నారు. అసలు టిడిపి జరిపింది మహానాడు కాదని...ఒట్టినాడని విమర్శించారు.

దీక్షలు...పక్కదారి పట్టించేందుకే

దీక్షలు...పక్కదారి పట్టించేందుకే

నవ నిర్మాణ దీక్షల పేరుతో ప్రజాధనంతో హడావుడి చేస్తున్న టిడిపి ప్రభుత్వం సమస్యలపై చర్చ జరగకుండా ప్రజలను పక్కదారి పట్టిస్తోందని సిపిఎం నేతలు ఆరోపించారు. దేశంలోనే అత్యధిక పెన్షన్లు ఇస్తున్నామని చెబుతున్న టిడిపి ప్రభుత్వం అసలైన అర్హులకు ఆ పెన్షన్లు ఇవ్వడం లేదన్నారు. జన్మభూమి కమిటీలను కాదని, రియల్‌టైమ్ గవర్నెన్స్‌ ద్వారా పెన్షన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిందని...తద్వారా ఇప్పటి వరకూ ఉన్న జన్మభూమి కమిటీలు వైఫల్యం చెందాయని, ఏకపక్షంగా వ్యవహరించాయని ప్రభుత్వం అంగీకరించినట్లయిందన్నారు. జన్మభూమి కమిటీలను రద్దుచేసేయాలని సిపిఎం డిమాండ్‌ చేశారు.

 ప్రాజెక్టులు...అక్కడే

ప్రాజెక్టులు...అక్కడే

రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం ముందుకు వెళ్లడం లేదన్నారు. ఎప్పుడో పూర్తి చేస్తామని చెప్పిన జంఝావతి, వెలిగొండ ప్రాజెక్టులు ఇంకా పూర్తి కాలేదన్నారు. రైతులకు సంబంధించి...వేరుశనగ, శనగ, సుబాబుల్‌, పత్తి పంటలకు ధర లేదని, ధాన్యం కూడా ధర తగ్గిందని అయినా ప్రభుత్వం సంక్షేమం గురించి గొప్పలు చెబుతోందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు చేసే ప్రతి కార్యక్రమం రాజకీయ లబ్దికోసమే అన్నట్లు ఉంటోందని, దీన్ని ప్రజలు సహించబోరని తెలిపారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ పేరుతో జాతీయస్థాయిలో పెద్దఎత్తున ప్రకటనలు గుప్పించారన్నారు. విదేశీ కంపెనీలకు 24 గంటల్లోనే ఆన్‌లైన్ లోనే సమస్యలు పరిష్కరిస్తామని గొప్పగా చెబుతున్నారని...కానీ రాష్ట్రంలో ఇళ్ళు, ఇళ్లస్థలాలు, పెన్షన్ల కోసం చేసుకున్న దరఖాస్తులను మాత్రం పరిశీలించే తీరిక ప్రభుత్వానికి లేకుండా పోయిందని సిపిఎం నేతలు ధ్వజమెత్తారు.

విజయవాడలో...అడుగడుగునా ఆంక్షలు

విజయవాడలో...అడుగడుగునా ఆంక్షలు

దీక్షల పేరుతో, మహానాడు పేరుతో విజయవాడలో తరుచూ ట్రాఫిక్‌ ఆంక్షలు పెడుతున్నారని, దీనివల్ల ప్రయాణికులు, రోజువారీ కూలీ పనులు చేసుకునేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సిపిఎం నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా దీక్షల కోసం ప్రతిపక్షాలు కోరితే అనుమతులివ్వడం లేదని, అధికార పార్టీ మాత్రం నగరం నడిబొడ్డు బెంజిసర్కిల్లో కూడా దీక్షలు పెడుతూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందన్నారు. టిడిపి ప్రభుత్వం తీరు పూర్తి నియంతృత్వ ధోరణిగా ఉందన్నారు. మరోవైపు దీక్షల పేరుతో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని ఇష్టారాజ్యంగా దుర్వినియోగం చేస్తున్నారన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా త్వరలోనే కార్యాచరణ చేపట్టనున్నట్లు సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు వి.శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు తెలిపారు.

English summary
Vijayawada: CPI (M) has alleged that the TDP government is making efforts to acquire land for multinational corporations and corporates through amendments to the Land Acquisition Act 2013.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X