దుబ్బాక,గ్రేటర్: ఒత్తిడిలో ఏపీ బీజేపీ -తిరుపతిలో జగన్కు చుక్కలే -నిమ్మగడ్డపైనా సోము వీర్రాజు ఫైర్
రాష్ట్ర విభజన జరిగి ఆరేళ్లు పూర్తికాగా, తెలంగాణలో బీజేపీ బాగా పుంజుకుంది. గతేడాది నాలుగు లోక్ సభ సీట్లతో విజయపరంపర ప్రారంభించిన తెలంగాణ కమల దళం.. ఆ మధ్య దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలో గెలుపొంది, తాజాగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అనూహ్యంగా 48 సీట్లతో సత్తా చాటుకుంది. ఖాళీ స్థానంగా నోటిఫై కాకముందే నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికపైనా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. కాంగ్రెస్ దాదాపు నిర్వీర్యమైపోయిన పరిస్థితుల్లో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కమలానికి మొదటి లేదా రెండో స్థానం ఖాయంగా కనిపిస్తోంది. తెలంగాణలో పార్టీ దూకుడు నేపథ్యంలో ఏపీ బీజేపీ ఒకింత ఒత్తిడికి గురవుతున్నట్లు తెలుస్తోంది. అయితే..
గ్రేటర్ గెలుపు: ఢిల్లీకి బండి సంజయ్ -కేంద్ర కేబినెట్లో చోటు? -బీజేపీ అధికారంలోకి రాగానే..

ఒత్తిడి కాదు స్ఫూర్తి..
దుబ్బాక బైపోల్, గ్రేటర్ సాధారణ ఎన్నికల్లో తెలంగాణ బీజేపీ గెలుపు తమలోనూ స్ఫూర్తి నింపిందని ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు అన్నారు. ఆదివారం రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. గ్రేటర్ ఫలితాలపై స్పందిస్తూ.. తెలంగాణ తరహాలోనే ఏపీలో కూడా బీజేపీ కచ్చితంగా విజయం సాదిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గ్రేటర్ స్ఫూర్తితో ఏపీలోని తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో జగన్ నేతృత్వంలోని వైసీపీకి గట్టి పోటీ ఇస్తామని తెలిపారు. కేంద్రం ఇప్పటివరకు ఏపీకి రూ.5వేల కోట్లు ఇచ్చిందని, ఈ విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి బీజేపీ గెలుపునకు కృషిచేస్తామని సోము చెప్పారు. అంతేకాదు..
గ్రేటర్ మేయర్:చేతులెత్తే పద్ధతిలో ఎన్నిక -ఎంఐఎం-బీజేపీకి అదొక్కటే ఆప్షన్ -సంచలన సమీకరణలు

2024లో అధికారం మాదే..
వైసీపీ అక్రమాలు, అవినీతిపై రాజీలేని పోరాటం చేస్తున్నామని, 2024 ఎన్నికల్లో వైసీపీని ఓడించి తీరుతామని, బీజేపీ- జనసేన కూటమి అధికారం చేపడుతుందని సోము వీర్రాజు అన్నారు. కోట్ల రూపాయాల కుంభకోణాలకు పాల్పడిన టీడీపీని ప్రజలు ఇప్పటికే బుద్ధి చెప్పారని, ఇప్పుడు టీడీపీ బాటలోనే అక్రమాలకు పాల్పడుతోన్న వైసీపీకి సైతం అదే గతిపడుతుందని, ఏపీలో కాంగ్రెస్, టీడీపీ కనుమరుగైపోతాయని, అప్పుడు ప్రధాన పోటీ బీజేపీ కూటమి, వైసీపీ మధ్యే ఉంటుందని సోము వీర్రాజు అన్నారు. ఇది..

తిరుపతితోనే తేలిపోనుందా?
కాంగ్రెస్, టీడీపీ కనుమరుగైపోయి, బీజేపీ కూటమి-వైసీపీల మధ్యే పోటీ నెలకొంటుందనే విషయం రాబోయే తిరుపతి లోక్ సభ ఎన్నికలో ప్రస్పుటం కానుందని, తిరుపతి బైపోల్ లో వైసీపీకి గట్టి పోటీ ఇస్తామని సోము వీర్రాజు తెలిపారు. అయితే, తిరుపతిలో బీజేపీ అభ్యర్థి బరిలోకి దిగుతారా? లేక పొత్తులో భాగంగా జనసేనకు అవకాశమిస్తారా? అనే విషయాన్ని ఆయన స్పష్టం చేయలేదు. గ్రేటర్ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకున్నందుకు ప్రతిఫలంగా తిరుపతి టికెట్ తమకే కావాలని జనసేనాని పవన్ కల్యాణ్ పట్టుపడుతుండటం, ఇందు కోసం ఢిల్లీకి కూడా వెళ్లిన ఆయన.. ఉమ్మడి అభ్యర్థి ఎంపికపై కమిటీని కూడా వేయించడం తెలిసిందే. ఇదిలా ఉంటే..

నిమ్మగడ్డపై సోము ఫైర్..
ఏపీలో స్థానిక ఎన్నికలకు సంబంధించి సీఎం జగన్ వర్సెస్ ఎస్ఈసీ నిమ్మగడ్డ అన్నట్లుగా సాగుతోన్న వివాదంపై బీజేపీ చీఫ్ సోము వీర్రాజు అనూహ్య వ్యాఖ్యలు చేశారు. మార్చి నాటి స్థానిక ఎన్నికల్లో ఎస్ఈసీ నిమ్మగడ్డ.. వైసీపీకి అనుకూలంగా ఏకంగా 2వేల ఎంపీటీసీ స్థానాలను ఏకగ్రీవం చేశారని, ఆ పని చేసినందుకు నిమ్మగడ్డను కచ్చితంగా నిలదీయాల్సిందేనని అన్నారు. ఎన్నికల ప్రక్రియ కొనసాగింపుపై కోర్టుల్లో వాదోపవాదాలు జరుగుతోన్న వేళ.. ఇప్పటివరకూ జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తిగా రద్దు చేసి, మళ్లీ కొత్త నోటిఫికేషన్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు.