లారీని ఢీకొట్టిన బైక్: చెలరేగిన మంటలు, ఇద్దరు సజీవ దహనం
అనంతపురం: జిల్లాలోని గుత్తిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆదివారం సాయంత్రం గుత్తి-నెల్లూరు జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు సజీవ దహనమయ్యారు. ద్విచక్ర వాహనానికి సంబంధించిన పెట్రోల్ ట్యాంక్ లీకై మంటలు వ్యాపించడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యాడికి మండలం బోగలకట్టకు చెందిన నారాయణ రెడ్డి(45), రోశిరెడ్డి(65) గుత్తి సమీపంలోని బాట సుంకులమ్మ దేవాలయానికి ద్విచక్ర వాహనంపై వెళ్లారు. అక్కడ్నుంచి తిరిగి గ్రామానికి వస్తుండగా గుత్తి మండలం ఎంగిలిబండ-కొత్తపేట మధ్య ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టారు.


ఈ ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో ద్విచక్ర వాహనంలోని పెట్రోల్ బయటికి వచ్చేసింది. వెంటనే మంటలు చెలరేగి రోశిరెడ్డి, నారాయణరెడ్డికి అంటుకున్నాయి. దీంతో వారిద్దరూ మంటలో కాలిపోయి అక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో లారీకి కూడా మంటలు అంటుకోవడంతో కొంత భాగం దగ్ధమైంది. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
విద్యుత్ షాక్‌తో కానిస్టేబుల్ మృతి
చిత్తూరు జిల్లాలోని గుర్రంకొండ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ఇబ్రహీం(38) విద్యుత్ ఘాతంతో శనివారం సాయంత్రం మృతి చెందారు. ఇందిరమ్మకాలనీలో నూతనంగా నిర్మిస్తున్న ఇంటి పైకప్పు పనుల్లో భాగంగా ఆయన ఇను కమ్మీలను పైకి ఎత్తుతుండగా ఇంటిపై ఉన్న 11 కేవీ విద్యుత్ తీగలు తగలి షాక్‌కి గురయ్యాడు. వెంటనే స్థానికులు అతడ్ని వాల్మీకిపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతునికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.