వైఎస్ జగన్‌కు ఎన్డీఏ పెద్దల నుంచి పిలుపు: రేపు ఢిల్లీకి ప్రయాణం?: ఆ విషయంపై క్లారిటీ
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. మరోసారి హస్తినకు బయలుదేరి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రానికే తలమానికంలా భావిస్తోన్న విశాఖపట్నం ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ వ్యవహారం, పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపు, తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక, దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం రద్దు కావడం వంటి పరిణామాల మధ్య ఆయన బుధవారం ఢిల్లీ విమానం ఎక్కబోతోన్నట్లు తెలుస్తోంది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను ఆయన కలుస్తారని అంటోన్నారు. అదే సమయంలో కొందరు కేంద్రమంత్రులతోనూ జగన్ భేటీ అవుతారని సమాచారం.
వైజాగ్ ఎయిర్పోర్ట్ జగన్ రెడ్డికి లక్కీ ప్లేస్: ఆయనే బాధ్యుడు: వైసీపీని తరిమికొట్టండి: పట్టాభి

ఢిల్లీ నుంచి ఫోన్ కాల్..
నిజానికి- ఇప్పట్లో ఢిల్లీ వెళ్లాలనే ఆలోచన ముఖ్యమంత్రికి లేదని, అలాంటి కార్యక్రమం ఏదైనా మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ తరువాతే ఉండొచ్చంటూ తేలింది. అనూహ్యంగా కొద్దిసేపటి కిందటే ముఖ్యమంత్రికి ఎన్డీఏ పెద్దల నుంచి ఫోన్ కాల్ వచ్చిందని సమాచారం. బుధవారం నాడు అందుబాటులో ఉండాల్సిందిగా ఢిల్లీ పెద్దలు ఆయనకు సూచించారనేది ఆ ఫోన్ కాల్ సారాంశమని తెలుస్తోంది. దీనితో- బుధవారం నాటి రోజువారి కార్యక్రమాల వివరాలు, షెడ్యూల్‌ను మార్చాల్సిందిగా తన కార్యాలయం అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించినట్లు తెలుస్తోంది.

ఈ సారి పర్యటనకు రాజకీయ ప్రాధాన్యత?
ఈ సారి కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ తరఫు పెద్దలే వైఎస్ జగన్‌ను ఢిల్లీకి రావాల్సిందిగా ఆహ్వానించడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకున్నట్టయింది. నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్డీఏ పెద్దలే ఆయనను ఢిల్లీకి రావాలంటూ సూచించడం.. జగన్ పర్యటన ప్రధానంగా రాజకీయ కారణాలతోనే ఉండొచ్చని చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ఎన్డీఏ కూటమిలో చేరుతుందంటూ ఇదివరకు విస్తృతంగా ప్రచారం సాగినప్పటికీ.. అది వాస్తవ రూపం దాల్చలేదు. ఈ సారి కూడా అలాంటి కారణాలే ఉంటాయని అంటున్నారు.

ప్రత్యేక హోదా మెలిక..
రాష్ట్రానికి ప్రత్యేక హోదాను కల్పిస్తే.. తాము ఏ కూటమికైనా మద్దతు ఇస్తామని వైఎస్ జగన్ ముందు నుంచీ చెబుతూ వస్తోన్నారు. ప్రత్యేక హోదాను కల్పించితే - బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ అలయన్స్‌కు గానీ, కాంగ్రెస్ నేతృత్వాన్ని వహిస్తోన్న యూపీఏ కూటమిలో గానీ చేయడానికి తమకు ఎలాంటి భేషజాలు లేవని ఆయన పలుమార్లు స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవలే నిర్వహించిన ముఖ్యమంత్రుల వీడియో కాన్ఫరెన్స్‌లోనూ ఆయన ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ఈ పరిణామాల మధ్య మరోసారి ఢిల్లీ పర్యటన చేపట్టడం ఆసక్తి రేపుతోంది. ఎన్డీఏలో చేరికపై జగన్.. మరోసారి క్లారిటీ ఇస్తారని తెలుస్తోంది.

రాష్ట్ర ప్రయోజనాలపైనా
విశాఖపట్నం ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ వ్యవహారం, పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపు వంటి అంశాలనూ ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్తారని అంటున్నారు. జీఎస్టీ బకాయిలు, పోలవరం నిర్మాణ వ్యయానికి సంబంధించిన లెక్కలను ఆయన వివరిస్తారని తెలుస్తోంది. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల పరిహారం చెల్లింపు మొత్తాన్ని వెంటనే విడుదల చేయాలని జగన్.. కేంద్రాన్ని కోరుతారని సమాచారం. విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించాల్సిన పరిస్థితే ఎదురైతే.. దాన్ని రాష్ట్రానికి కేటాయించాలని, దాన్ని లాభాల బాటలోకి ఎలా తీసుకెళ్లాలనే దానిపై చర్చిస్తారని అంటున్నారు.