బాబుపై ఏదో కుట్ర ప్రచారం: వాసిరెడ్డి, అజ్ఞాతంలోకి బీద మస్తానరావు? వైసీపీ రెబల్ సంస్థల్లో ఐటీ సోదాలు
విజయవాడ: ఐటీ దాడుల పేరుతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ఏదో కుట్ర జరుగుతోందని ఏదేదో ప్రచారం చేస్తున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వాసిరెడ్డి పద్మ అన్నారు. ఐటీ దాడులు కేవలం రియల్ ఎస్టేట్ సంస్థలపై జరుగుతున్నాయని తెలిపారు.
ఐటీ రైడ్స్ సర్వ సాధారణం అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇంట్లో దొరికిన డబ్బు ఏపీ సీఎం చంద్రబాబుది కాదా చెప్పాలని నిలదీశారు. అంతకుముందు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఐటీ దాడులపై స్పందించిన విషయం తెలిసిందే. ఎన్నికలు జరుగుతున్న సమయంలో విపక్ష పార్టీలను బెదిరించేందుకు కేంద్రంలోని ప్రభుత్వం సర్వసాధారణంగా ప్రయోగించే అస్త్రం ఐటీ దాడులు అని, అందువల్ల అందరూ అప్రమత్తమంగా ఉండాలని సహచరులకు సూచించారు.

వైసీపీ రెబల్ ఎమ్మెల్యే సంస్థలపై ఐటీ దాడులు
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎమ్మెల్యే పోతుల రామారావుకు చెందిన సంస్థల పైన కూడా ఐటీ దాడులు జరిగాయి. సదరన్ సీ ఫుడ్స్ సంస్థపై ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. విజయవాడలోని సదరన్ డెవలపర్స్ సంస్థలో పోతుల రామారావుకు వాటాలున్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల సోదాలు
తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 28 చోట్ల ఐటీ దాడులు జరిగాయి. హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నంలలో సోదాలు నిర్వహించారు. సదరన్ కన్స్ట్రక్షన్, వీఎస్ లాజిస్టిక్స్, స్వగృహ సహా పలు కంపెనీల్లో సోదాలు చేశారు. బోగస్ కంపెనీలు, పెట్టుబడులు, అక్రమ లావాదేవీలపై ఆరా తీశారు. కంపెనీలకు సంబంధించిన పెద్దలను ఐటీ అధికారులు ప్రశ్నించారు. కంపెనీల కార్యాలయాలు, ప్రతినిధుల ఇళ్లలోను ఐటీ అధికారులు తనిఖీ చేశారు. హైదరాబాద్ కేంద్రంగా సదరన్ కన్స్ట్రక్షన్ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. గుంటూరులో రైల్వే కోచ్ల మరమ్మతులు, నిర్మాణాల్లో వీఎస్ లాజిస్టిక్స్ ఉంది. జగ్గయ్యపేట సమీపంలో సిమెంట్ ఇటుక కంపెనీ పైన దాడులు నిర్వహించారు. పడమటలంక పరుచూరివారి వీధిలో సోదాలు జరిగాయి. వినాయక్ థియేటర్ సమీపంలోని వీఎస్ఎల్ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించారు.

బీదా మస్తాన్ రావు ఆస్తులపై ఆరా
ఎస్పీఎస్ నెల్లూరు జిల్లా కావలి మాజీ ఎమ్మెల్యే బీదా మస్తాన్ రావు ఆస్తులపై కూడా ఐటీ దాడులు జరిగాయి. బీదా మస్తాన్ వ్యాపార సంస్థలో రెండో రోజు కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. కాగా, ఐటీ దాడుల నేపథ్యంలో బీద మస్తాన్ రావు, ఆయన సోదరుడు రవిచంద్రలు అజ్ఞాతంలోకి వెళ్లినట్లుగా తెలుస్తోంది. వారి ఫోన్లు కూడా పని చేయడం లేదని సమాచారం. కొందరు టీడీపీ పెద్దలకు బీద మస్తాన్ రావు బినామీగా ఉనన్ారని భావిస్తున్నారు. విజయవాడ వెటర్నరీ కాలనీలో శుభగృహ కార్యాలయంలో సోదాలు జరిగాయి. విజయవాడతో పాటు విశాఖ, రాజమండ్రి, కాకినాడ బ్రాంచీలలో తనిఖీలు నిర్వహించారు. గడువు ముగిసినా ఐటీ రిటర్న్స్ దాఖలు చేయకపోవడంపై ఐటీ దృష్టి సారించింది.
సంచలనం:ఎపిలో ఐటి దాడులు మొదలు...వివిధ ఆఫీసులు,స్థావరాల్లో సోదాలు

ఐటీ సోదాల్లో 15 బృందాలు
కాగా, ఐటీ దాడుల్లో 15 బృందాలు పాలుపంచుకున్నాయి. సదరన్ కన్స్ట్రక్షన్ కార్యాలయాల్లో దాని అనుబంధ సంస్థగా రిజిస్టర్ అయిన సదరన్ డెవలపర్స్, బీఎంఆర్ గ్రూప్ కార్యాలయాలు, బీఎంఆర్ హేచరీస్ తదితర సంస్థల్లో సోదాలు నిర్వహించారు. పోలీసు బృందాలతో చేరుకున్న ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు.