ఏపీ మంత్రివర్గ భేటీకి ముహూర్తం ఖరారు: మూడు రాజధానులు..జగన్ ఢిల్లీ పర్యటనపై సహా
అమరావతి: రాష్ట్ర మంత్రివర్గ సమావేశానికి ముహూర్తం కుదిరింది. పలు కీలక అంశాలు ఈ భేటీలో చర్చకు రానున్నాయి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను దృష్టిలో ఉంచుకుని సభలో ప్రవేశపెట్టాల్సిన బిల్లులు.. ఇతర ప్రతిపాదనలపై మంత్రులు చర్చించనున్నారు. అలాగే- ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు రోజుల ఢిల్లీ పర్యటన విశేషాలు, మూడు రాజధానుల కోసం తీసుకుని రాదలిచిన కొత్త బిల్లు.. ప్రస్తావనకు వస్తుందని తెలుస్తోంది. కరోనా వైరస్ మళ్లీ వ్యాప్తి చెందుతోన్నందున దాన్ని అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యలపైనా దృష్టి సారిస్తుంది కేబినెట్.

ఈ నెల 21న
ఈ నెల 21వ తేదీన ఉదయం 11 గంటలకు సచివాలయంలో మంత్రివర్గం సమావేశం కానుంది. వైఎస్ జగన్ దీనికి అధ్యక్షత వహిస్తారు. ఈ మేరకు ఇందులో చర్చించాల్సిన అంశాలపై ప్రతిపాదనలు పంపించాలంటూ ముఖ్యమంత్రి కార్యాలయం అన్ని శాఖలు, విభాగాధిపతులకు సర్కులర్ జారీ చేసింది. ఫిబ్రవరి-మార్చి నెలల్లో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను నిర్వహించాలనే ఉద్దేశంతో ఉంది జగన్ సర్కార్. దీనికి అవసరమైన కసరత్తును మొదలు పెట్టాలని నిర్ణయించింది. బడ్జెట్ ప్రతిపాదనలు, అంచనా వంటి విషయాలపై వైఎస్ జగన్.. మంత్రులతో చర్చిస్తారని తెలుస్తోంది.

ఢిల్లీ పర్యటన విశేషాలపై..
కొద్దిరోజుల కిందటే వైఎస్ జగన్ దేశ రాజధానిలో రెండు రోజుల పాటు పర్యటించిన విషయం తెలిసిందే. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్రమంత్రులు నిర్మల సీతారామన్, అనురాగ్ ఠాకూర్, జ్యోతిరాధిత్య సింధియా, ధర్మేంద్ర ప్రధాన్‌ను కలుసుకున్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన పలు కీలకాంశాలపై చర్చించారు. ఆ చర్చల సారాంశాన్ని వైఎస్ జగన్.. మంత్రివర్గ సమావేశంలో వివరించే అవకాశం ఉంది. అందిన హామీలు, అందాల్సిన నిధులు, విభజన అనంతరం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న కొన్ని వివాదాలపై కేంద్రం ఏ రకంగా స్పందించిందనే విషయాన్ని ఆయన మంత్రులకు వివరిస్తారని అంటున్నారు.

మూడు రాజధానుల బిల్లుపై..
మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన కొత్త బిల్లు ఎలా ఉండాలనే విషయంపై వైఎస్ జగన్.. మంత్రివర్గ భేటీలో చర్చిస్తారని చెబుతున్నారు. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే ఈ బిల్లును తీసుకుని రావడానికి గల అవకాశాలను కేబినెట్ పరిశీలిస్తుందని, లేదా వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టేలా ఇప్పటి నుంచే కసరత్తు చేయడానికి అనుగుణంగా నిర్ణయాలు వెలువడొచ్చని సమాచారం. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తేదీలను కూడా ఖరారు చేసే అవకాశం లేకపోలేదని అంటున్నారు. ఎన్ని రోజుల పాటు అసెంబ్లీని సమావేశపర్చాలి?, బడ్జెట్ కేటాయింపులు ఎలా ఉండాలి?, రాష్ట్ర బడ్జెట్ మొత్తాన్ని ఎంతవరకు నిర్ధారించుకోగలం అనే అంశాలపై కేబినెట్ చర్చిస్తుంది.

పోలవరం సహా..
ఇదివరకట్లా రాష్ట్రంలో కరోనా వైరస్ మరోసారి తన విజృంభణను మొదలు పెట్టింది. కొత్తగా 1831 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఎవరూ మరణించలేదు. చిత్తూరు, అనంతపురం, గుంటూరు, కృష్ణా, నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో వందకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ పరిస్థితుల మధ్య- వైరస్ వ్యాప్తిని ఎలా అడ్డుకోవాలనే విషయంపై కొన్నినిర్ణయాలను తీసుకోవచ్చని తెలుస్తోంది. పేద కుటుంబాలకు అదనంగా ఆర్థిక సహాయాన్ని అందించడం, కోవిడ్ ఆంక్షలను మరింత విస్తరింపజేయడం వంటి అంశాలు కేబినెట్లో చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.