వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిఎం చంద్రబాబు ముంబై టూర్ ముచ్చట్లు:టాటాకు స్వాగతం...అంబానీ, బిర్లా ఆసక్తి

By Suvarnaraju
|
Google Oneindia TeluguNews

అమరావతి:"ఆంధ్రప్రదేశ్ కు రండి...అమరావతిలో జరుగుతున్న అభివృద్ధిని కళ్లారా చూడండి...కేవలం పెట్టుబడులు పెట్టడమే కాదు...నవ్యాంధ్ర అభివృద్ధిలో ప్రత్యక్ష భాగస్వాములుకండి!...మీ నమ్మకాలు వమ్ము కావు. ఇది నేను ఇస్తున్న భరోసా"...ఇది ఎపి సీఎం చంద్రబాబు పారిశ్రామిక దిగ్గజాలకు ఇచ్చిన హామీ.

ముంబై పర్యటనలో భాగంగా సోమవారం బీఎస్‌ఈలో అమరావతి బాండ్ల లిస్టింగ్‌ను అధికారికంగా ప్రారంభించిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు అక్కడే పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ తరువాత జరిగిన ప్రత్యేక భేటీల్లో రాష్ట్రంలో హరిత రవాణాను ప్రోత్సహించేందుకు సహకరించాలని టాటా గ్రూప్‌ చైర్మన్‌ రతన్‌ టాటాను సిఎం చంద్రబాబు కోరగా...నవ్యాంధ్ర అభివృద్దిపై ముఖ్యమంత్రి ప్రణాళికల గురించి స్వయంగా ఆయన నోటివెంటే విన్న అంబానీ, బిర్లా ఏపిలో పెట్టుబడులకు ఆసక్తి చూపినట్లు తెలిసింది.

ఎపి...మరో ముందడుగు

ఎపి...మరో ముందడుగు

నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణంలో పెట్టుబడులు లక్ష్యంగా ఎపి ప్రభుత్వం మరో కీలకమైన ముందడుగు వేసింది. బాంబే స్టాక్‌ఎక్స్ఛేంజీలో అమరావతి బాండ్ల నమోదు ప్రక్రియను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసింది. బీఎస్‌ఈ సంప్రదాయం ప్రకారం 9.15 గంటలకు ప్రత్యేక గంటను ముఖ్యమంత్రి మోగించడంతో అమరావతి బాండ్ల నమోదు ముగిసింది. ముంబయిలోని బీఎస్‌ఈలో సర్‌ దిన్‌షా పెటిట్‌ ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ హాల్‌ అమరావతి బాండ్ల నమోదు ప్రక్రియకు వేదికయింది. తక్షణ పెట్టుబడులతో వచ్చేవారికి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న రాయితీలను పారిశ్రామికవేత్తలకు సిఎం చంద్రబాబే స్వయంగా వివరించారు. ప్రపంచంలోనే అత్యుత్తమ రాజధాని నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

సిఎం చంద్రబాబు...భరోసా

సిఎం చంద్రబాబు...భరోసా

పారిశ్రామికవేత్తలతో సమావేశం సందర్భంగా సిఎం చంద్రబాబు మాట్లాడుతూ...మీరు మాపై నమ్మకంతో పెట్టుబడి పెట్టారని...అంతటిదో ఆగొద్దని...అమరావతి నిర్మాణంలోనూ క్రియాశీల భాగస్వాములవ్వాలని కోరారు. అమరావతికి వచ్చి అభివృద్ధిని చూసి నిర్ణయం తీసుకోవాలని...మేం మాటలకే పరిమితం కావని...ప్రతిదీ ఆచరణలో చూపిస్తామన్నారు...మీరు మాపై ఉంచిన నమ్మకాన్ని ఎప్పుడూ వమ్ముచేయమని చెప్పారు. మీ డబ్బుకు ఏమీ ఢోకాలేదని...మా నిజాయితీని, అంకితభావాన్ని రుజువు చేసుకుంటామని చంద్రబాబు ఈ సందర్భంగా వారికి భరోసానిచ్చారు.

టాటాకు...సిఎం ఆహ్వానం

టాటాకు...సిఎం ఆహ్వానం

అనంతరం ఆయన టాటా ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌కు వెళ్లి రతన్‌ టాటాతో భేటీ అయ్యారు. అమరావతిలో హరిత వాహనాలను ప్రోత్సహిస్తున్నామని...అక్కడ అవసరమయ్యే ఎలక్ట్రిక్‌ బస్సులను తయారు చేయాలని కోరారు. అలాగే పారిశ్రామిక పార్కులకు కూడా టాటా సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో హోటల్‌, పర్యాటక రంగాల్లోనూ పెట్టుబడులు పెట్టాలని రతన్‌ టాటాను చంద్రబాబు కోరారు...రాష్ట్రంలో రిసార్ట్‌లను నెలకొల్పేందుకు అనుకూలమైన టూరిజం స్పాట్ లు ఉన్నాయన్నారు. విజయవాడ గన్నవరం విమానాశ్రయం నుంచి ‘విస్తారా' సేవలు ప్రారంభించాలని...సింగపూర్‌ నుంచి గన్నవరం విమానాశ్రయానికి అక్టోబరు 2 వ తేదీ నుంచి అంతర్జాతీయ విమానాలు రాకపోకలు సాగించనున్నాయని చెప్పారు. తాము 9 నగరాల్లో ఎలక్ట్రిక్‌ వాహనాలను నడుపుతున్నామని...మరో రెండు నెలల్లో ఎలక్ట్రిక్‌ కారును మార్కెట్లోకి తీసుకువస్తున్నామని ఈ సందర్భంగా టాటా అధికారులు సిఎంకు వివరించారు.

అంబానీ,బిర్లా...ఇతర పారిశ్రామికవేత్తల ఆసక్తి

అంబానీ,బిర్లా...ఇతర పారిశ్రామికవేత్తల ఆసక్తి

అనంతరం రిలయన్స్‌ అధినేత ముఖేష్ అంబానీతో సిఎం చంద్రబాబు భేటీ అయ్యారు. తిరుపతిలో రూ.15వేల కోట్ల పెట్టుబడితో 25వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించే ఎలక్ట్రానిక్స్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్‌లో రిలయన్స్‌ పెట్టుబడుల విషయం...అలాగే అమరావతిలో పెట్టుబడుల గురించి చర్చించారు. అనంతరం ఆదిత్య బిర్లా గ్రూప్‌ అధినేత కుమార మంగళం బిర్లాతో సమావేశమైన సిఎం రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టుల్లో పెట్టుబడుల గురించి మాట్లాడారు. గోద్రెజ్‌ గ్రూప్‌ అధిపతి నాదిర్‌ గోద్రెజ్‌ ఏపీలో తమ కార్యకలాపాలు మరింత విస్తరిస్తామని ఈ సందర్భంగా సిఎంకు హామీ ఇచ్చినట్లు తెలిసింది. మహేంద్ర వరల్డ్‌ సిటీ సంస్థకు చెందిన సంగీతా ప్రసాద్‌ తమ ప్రాజెక్టుల గురించి చంద్రబాబుకు వెల్లడించగా...రహేజా గ్రూప్‌ అధ్యక్షుడు నీల్‌ చంద్రు... రహేజా హోటళ్లు, కన్వెన్షన్‌ సెంటర్లు, మాల్స్‌ నిర్మాణంలో తమ నైపుణ్యాన్ని, భవిష్యత్‌ ప్రణాళికలను వివరించారు. తిరుపతి, విశాఖ, విజయవాడల్లో పెద్ద కన్వెన్షన్‌ కేంద్రాలు నిర్మించేందుకు ముందుకురావాలని చంద్రబాబు ఆయనను కోరారు.

English summary
Amaravathi:In a bid to develop its capital Amaravathi, the Andhra Pradesh government on Monday, 27 August 2018, listed bonds worth Rs 2,000 crore issued by AP Capital Region Development Authority (AP CRDA) at the Bombay Stock Exchange. CM Chandrababu rang the opening bell, as the the government securities titled ‘Amaravati Bond 2018’ were listed on the Bombay Stock Exchange. Speaking at the listing of the bonds at BSE in Mumbai, Naidu outlined his grand vision for the greenfield capital, claiming that he is confident of making Amaravati one of the best cities in the world.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X