ఇబ్బందులను అధిగమిస్తాం..విలీనం పూర్తి చేస్తాం: కేంద్రం వాదన అర్దరహితం..మంత్రి నాని..!
తెలంగాణ ఆర్టీసీ సమ్ము వ్యవహారం..హైకోర్టులో జరిగిన వాదనలు..కేంద్ర ప్రభుత్వ అభ్యంతరాల పైన ఏపీ ప్రభుత్వం సమీక్షించింది. ఏపీ విభజన ప్రక్రియే సరిగ్గా పూర్తి చేయటంలో సమస్యలు ఉండగా..ఇక, ఆర్టీసీ విభజనలో సమస్యలు ఎందుకు ఉండవనే అభిప్రాయం వ్యక్తం అయింది. తెలంగాణలో ఆర్టీసీ కేంద్రంగా జరుగుతోన్న పరిణామాల ప్రభావం ఏపీపై ఉండదని రవాణా శాఖ మంత్రి పేర్ని నాని స్పష్టం చేసారు. ఇప్పుడు కేంద్రం చేస్తున్న వాదనలు అర్ద రహితంగా భావిస్తున్నారు.
ఏపీలో ఆర్టీసీ విలీన ప్రక్రియకు ఎలాంటి ఇబ్బంది లేదని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో కార్మికుల విలీనానికి ఆర్టీసీ బోర్డు అంగీకరించిందని చెప్పుకొచ్చారు. ఆర్టీసీ బోర్డులో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి ఉన్నారని..కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి కూడా ఆర్టీసీ విలీనానికి అంగీకరించారని వివరించారు. అయితే, ఆర్టీసీ విభజన అనేది సాంకేతికపరమైన అంశం మాత్రమే అంటున్నారు.

విలీనానికి ఇబ్బంది లేకుండా సాంకేతిక ఇబ్బందులను అధిగమిస్తామని ప్రభుత్వం స్పస్టం చేస్తోంది. విభజన జరగలేదన్న కేంద్రం.. ఏపీ, తెలంగాణలకు విడివిడిగా ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోళ్లకు నిధులు ఎలా కేటాయించిందని ఏపీ ప్రభుత్వం ప్రశ్నిస్తోంది.
విభజనలో కొన్ని సమస్యలు ఉన్నా..
రాష్ట్ర విభజన సమస్యలే ఇప్పటికీ పూర్తిగా పరిష్కారం కాలేదని.. ఆర్టీసీలో సమస్యలు ఉండటంలో ఆశ్చర్యం ఉండదని ఏపీ ప్రభుత్వం అంటోంది. ఈ రోజు తెలంగాణ హైకోర్టులో జరిగిన వాదనల్లో భాగంగా కేంద్ర న్యాయవాది అసలు ఆర్టీసీ విభజనను నోటీఫై చేయలేదని చెప్పటం ద్వారా ఏపీ ఆర్టీసీ విలీన ప్రక్రియలో సమస్య ఏర్పడుతుందనే చర్చ మొదలైంది. అయితే, ఏపీ..తెలంగాణ ప్రభుత్వాలు రెండూ ఆర్టీని రెండు రాష్ట్రాలకు విభజన చేసారని..ఆర్టికల్ 3 ప్రకారం విభజన జరిగిందని ఏపీ ప్రభుత్వం చెబుతోంది.
అయితే, హైదరాబాద్ కేంద్రంగా కొన్ని ఆస్తుల అంశం పైన మాత్రం ఇప్పటికీ పరిష్కారం లభించలేదు. ఇక, కోర్టులో ఈ నెల 11న జరిగే వాదనలు..కోర్టు నిర్ణయం ఆధారంగా తదుపరి కార్యాచరణ ఖరారయ్యే అవకాశం ఉంది. ఇబ్బందులు ఏర్పడినా.. అధిగమించి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం పూర్తి చేస్తామని మంత్రి పేర్ని నాని స్పష్టం చేసారు.
కేసీఆర్ తొలుత ఆర్టీసీ విలీనం ప్రక్రియ పైన చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా ముఖ్యమంత్రి జగన్ సైతం షాక్ అయ్యారు. అలా మాట్లాడుతున్నారేంటంటూ వ్యాఖ్యానించారు. అయితే, ఇప్పుడు మాత్రం ఏపీ ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనానికి ఎటువంటి ఇబ్బందులు లేవని బలంగా వాదిస్తోంది.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!