ఆ దినపత్రిక ఆరాటమేకానీ.. చంద్రబాబుకు కష్టమే: అంబటి రాంబాబు
'ప్రతిరోజూ ఒక పత్రిక ప్రభుత్వంపై విషం కక్కుతోంది.. ఎవరినో అధికారంలోకి తేవటానికి ఎన్నోరకాల ప్రయత్నాలు చేస్తోంది.. రాష్ట్రంలో 250కి పైగా పథకాలు పనిచేయటంలేదని ఆ పత్రిక రాసింది.. ఎన్నికలకు ముందు ప్రభుత్వంపై విషం కక్కితే ప్రజలు నమ్ముతారని వారి ఆలోచనగా ఉన్నట్లుంది... చంద్రబాబునాయుడు ఏనాడైనా రైతులకు మేలు చేసింది ఉంటే చెప్పమనండి.. అంటూ ఏపీ జలనవరులశాఖ మంత్రి అంబటి రాంబాబు రాష్ట్రంలోని ఒక ప్రధాన పత్రిక, ఆ పత్రిక అధినేతతోపాటు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపైనాయుడిపై మండిపడ్డారు.
మీడియాతో మాట్లాడిన అంబటి రాంబాబు పలు కామెంట్లు చేశారు. అవి ఆయన మాటల్లోనే.. ఒంటిమిట్టలో ఎత్తిపోతల పథకం పనిచేయటంలేదని ఆ పత్రికలో రాశారు. ఆయన ఆరాటమే కానీ చంద్రబాబుకు రాజకీయంగా కష్టం. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే పులిచింతల, శ్రీశైలం ప్రాజెక్టుల మరమ్మతులు చేస్తున్నాంకానీ, గతంలో చంద్రబాబునాయుడి ప్రభుత్వం వాటికి మరమ్మతులే నిర్వహంచలేదు.

ముందస్తు ఎన్నికలంటూ చంద్రబాబునాయుడు కలలు కంటున్నారు. కానీ అవి ఎట్టి పరిస్థితుల్లోను నెరవేరవు. ఎందుకంటే మేం ప్రజల దగ్గరకు వెళుతుంటే వారి కళ్లల్లో ఆనందాన్ని చూస్తున్నాం. చంద్రబాబునాయుడు, దేవినేని ఉమామహేశ్వరరావు తొందరపాటు చర్యలవల్లే పోలవరం డయాఫ్రం వాల్ దెబ్బతింది.. అందువల్లే పోలవరం పనులు నెమ్మదించాయి. గత ప్రభుత్వం దుందుడుకు చర్యలవల్లే డయా ఫ్రం వాల్ దెబ్బతిందని కేంద్రం నుంచి వచ్చిన నిపుణులు కూడా అంటున్నారు. ప్రతి సంవత్సరం ఆగస్టులో రైతులకు సాగునీరు ఇచ్చేవాళ్లం.. ఈ ఏడాది ముందుగానే ఇవ్వబోతున్నాం.. జూన్లో కృష్ణా, గోదావరి బేసిన్లో సాగునీటిని విడుదల చేస్తున్నామని, రైతులంతా సిద్ధంగా ఉండాలని, ఎరువులు, విత్తనాలు కూడా అందుబాటులో ఉంచుతున్నామని, కాల్వలకు జరుగుతున్న మరమ్మతు పనులు పూర్తయ్యాయని అంబటి రాంబాబు చెప్పారు.